Let's talk: editor@tmv.in
కేంద్ర దర్యాప్తు సంస్థలకు టీఎంసీ తలవంచదు: అభిషేక్ బెనర్జీ

కేంద్ర దర్యాప్తు సంస్థలకు టీఎంసీ తలవంచదు: అభిషేక్ బెనర్జీ

Pinjari Chand
11 జనవరి, 2026

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఎన్నికల కమిషన్ (ఈసీ)లను ఉపయోగించి పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ను బీజేపీ ఆపగలదని భావిస్తున్నదా? అంటూ టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ప్రశ్నించారు. శనివారం బంకురా జిల్లా సాల్టోరాలో నిర్వహించిన పార్టీ ర్యాలీలో మాట్లాడిన ఆయన, కేంద్ర దర్యాప్తు సంస్థల ఒత్తిడికి టీఎంసీ ఎప్పటికీ తలవంచదని స్పష్టం చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఉద్దేశిస్తూ బెంగాల్ చరిత్రను తెలుసుకోండి. స్వామి వివేకానంద, రాజా రామ్మోహన్ రాయ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ లాంటి మహానుభావులు దేశ నిర్మాణానికి చేసిన సేవలను గుర్తుంచుకోండి అని వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ లేకపోయి ఉంటే, సీపీఐ(ఎం) ఇప్పటికీ రాష్ట్రాన్ని పాలిస్తుండేదని ఆయన అన్నారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ విజయం సాధించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఎన్నికల కమిషన్ చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) పేరుతో బెంగాలీలపై దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ ప్రక్రియ కారణంగా కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు, మరికొందరు అనారోగ్యానికి గురయ్యారు. ఈ మరణాలకు బాధ్యులైన వారిని రాజకీయంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు.

అభివృద్ధిపై రాజకీయం చేద్దాం

కొన్ని రాష్ట్రాల్లో బెంగాలీలో మాట్లాడేవారిని బంగ్లాదేశీలుగా ముద్ర వేస్తున్నారని కూడా ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్‌కు చెల్లించాల్సిన రూ. 2 లక్షల కోట్ల బకాయిలను విడుదల చేయడం లేదని ఆరోపించారు. 2019 లోక్‌సభ ఎన్నికలను ప్రస్తావిస్తూ, బీజేపీ బంకురా జిల్లా నుంచి రెండు స్థానాలు గెలుచుకుందని, కానీ ఆ పార్టీ అక్కడ చేసిన పనులపై నివేదిక ఎక్కడ ఉందని ప్రశ్నించారు. గత 15 ఏళ్లలో టీఎంసీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై మేము నివేదిక విడుదల చేశాం. రాజకీయ పోరాటం రోడ్లు, మౌలిక వసతులు, గృహనిర్మాణం, తాగునీరు, వైద్యం, ఉద్యోగాల సృష్టి వంటి అంశాలపై గణాంకాలు, సమాచారం ఆధారంగా జరగాలని ఆయన అన్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వం 15 ఏళ్లుగా, కేంద్రంలో మోడీ ప్రభుత్వం 12 ఏళ్లుగా అధికారంలో ఉంది. బంకురా జిల్లాకు బీజేపీ ఏం చేసింది? అంటూ ఆయన సవాల్ విసిరారు. టీఎంసీ ప్రభుత్వం జంగల్ మహల్ ప్రాంతంలో మావోయిస్టు భీభత్సానికి ముగింపు పలికిందని, విద్యా, వైద్య సదుపాయాలు కల్పించిందని ఆయన తెలిపారు. జల్ జీవన్ మిషన్, రోడ్డు మౌలిక వసతులు, ఎంజీఎన్‌ఆర్‌ఈగా వంటి పథకాల నిధులను కేంద్రం నిలిపివేస్తోందని తెలిపారు.

25,000 ఉద్యోగాలు వస్తాయి

ప్రైవేట్ బొగ్గు గనుల ద్వారా ఉద్యోగాల సృష్టికి కేంద్ర అనుమతుల ప్రక్రియ ఆలస్యం అవుతుండటమే అడ్డంకిగా మారిందని అన్నారు. ముఖ్యంగా రాంచీలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ అనుమతుల విషయాన్ని ప్రస్తావించారు. ఈ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 133 హెక్టార్ల భూమిలో కనీసం 18 గనులు ఏర్పాటు చేయవచ్చని తెలిపారు. ఈ విషయమై ముఖ్యమంత్రితో మాట్లాడాను. మార్చి చివరి నాటికి రెండు నెలల్లో అన్ని అనుమతులు పూర్తి చేయాలని సీఎం కార్యాలయం సంబంధిత శాఖలను ఆదేశించింది. దీని ద్వారా సుమారు 25,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బంకురా జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో కేవలం నాలుగు చోట్లే టీఎంసీ గెలిచిందని, మిగతావన్నీ బీజేపీ గెలుచుకుందని గుర్తు చేస్తూ, రాబోయే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీఎంసీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. టీఎంసీ గెలిస్తే మీ హక్కులు మీకు దక్కుతాయి. బీజేపీ గెలిస్తే అవి కోల్పోతారని ఆయన అన్నారు. లోక్ఖిర్ భండార్ పథకం కింద మహిళలకు నెలకు రూ.1,000 అందుతున్న విషయంపై బీజేపీ నేత ఒకరు ‘వారిని తాళం వేసి పెట్టాలి’ అన్నట్టు వ్యాఖ్యానించారని ఆరోపిస్తూ ఎన్నికల ఫలితాల్లో బెంగాల్ తల్లులు కాషాయ పార్టీకి తాళం వేస్తారని అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యానించారు. లోక్ఖిర్ భండార్ పథకానికి సంవత్సరానికి సుమారు రూ.27,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొంటూ టీఎంసీ ప్రభుత్వం ఉన్నంత కాలం ఈ పథకం కొనసాగుతుంది. ఇదే మా హామీ అని ఆయన స్పష్టం చేశారు.

కేంద్ర దర్యాప్తు సంస్థలకు టీఎంసీ తలవంచదు: అభిషేక్ బెనర్జీ - Tholi Paluku