Let's talk: editor@tmv.in
కేంద్ర కార్మిక విధానాలపై కేరళ సీఎం విజయన్ ప్రతిఘటనకు పిలుపు

కేంద్ర కార్మిక విధానాలపై కేరళ సీఎం విజయన్ ప్రతిఘటనకు పిలుపు

Dantu Vijaya Lakshmi Prasanna
20 డిసెంబర్, 2025

కేంద్ర ప్రభుత్వం తన కార్మిక విధానాల ద్వారా కార్మికుల హక్కులను హరిస్తూ, కార్పొరేట్ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ శుక్రవారం మండిపడ్డారు. కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన 'లేబర్ కోడ్'కు (కార్మిక చట్టాల సంహిత) వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నిర్వహించిన 'కార్మిక సదస్సు'లో ఆయన ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక విధానాలను విమర్శిస్తూ, వాటికి వ్యతిరేకంగా పోరాడాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పిలుపునిచ్చారు

సాంకేతికత, ఉత్పత్తి పద్ధతుల్లో వస్తున్న వేగవంతమైన మార్పులు ఎవరి ప్రయోజనం కోసం అని ఆయన ప్రశ్నించారు. "ఈ మార్పులు మెజారిటీ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికా? లేక కొద్దిమంది కార్పొరేట్ల లాభాలను పెంచడానికా?" అని నిలదీశారు.

సీఎం విజయన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల కార్మికుల హక్కులు తగ్గిపోతున్నాయని, బాధ్యతాయుతమైన సమాజంగా ఈ అంశంపై ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలపడం మన కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. ఇవి కార్పొరేట్ అనుకూల విధానాలని ఆయన విమర్శించారు.

ఉద్యోగ భద్రత, సామాజిక సంక్షేమం లేని అభివృద్ధి నమూనాలు నిలబడవని, కేవలం కార్పొరేట్ లాభాల ఆధారంగా కాకుండా ప్రజల జీవన ప్రమాణాల ఆధారంగా అభివృద్ధిని కొలవాలని విజయన్ అన్నారు. అప్పుడే సుస్థిర అభివృద్ధి సాద్యం అవుతుందన్నారు.

కార్మిక హక్కులు ఏ ప్రభుత్వము పెట్టిన భిక్ష కాదని, వలసవాద వ్యతిరేక పోరాటాలు, సుదీర్ఘ రైతాంగ ఉద్యమాల్లో చిందించిన రక్తం, చెమట వల్ల ఈ హక్కులు సిద్ధించాయని ఆయన గుర్తుచేశారు. బొంబాయి, కోల్‌కతా, కాన్పూర్, అహ్మదాబాద్, కేరళలో జరిగిన కార్మిక ఉద్యమాలు స్వాతంత్ర పోరాటంలో అంతర్భాగమని చెప్పారు. ఇవన్నీ చారిత్రక పోరాటాలు అని అన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ:

1990ల గ్లోబలైజేషన్ తర్వాత చట్టాలు పౌరుల రక్షణ కంటే వ్యాపార ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయని విమర్శించారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను విక్రయించడం, 'నేషనల్ మోనిటైజేషన్ పైప్‌లైన్' వంటి చర్యల ద్వారా ప్రజల సంపదను ప్రైవేటీకరిస్తున్నారని ఆరోపించారు.

కొత్త లేబర్ కోడ్‌లపై అభ్యంతరాలు తెలుపుతూ 29 కార్మిక చట్టాలను కలిపి 4 కోడ్‌లుగా మార్చడం ద్వారా కార్మిక భద్రతను వ్యవస్థీకృత పద్ధతిలో దెబ్బతీస్తున్నారని విమర్శించారు. గతంలో 100 మంది కార్మికులు ఉన్న పరిశ్రమ మూసివేయాలన్నా లేదా లే-ఆఫ్ ఇవ్వాలన్నా ప్రభుత్వ అనుమతి అవసరమయ్యేది. ఇప్పుడు ఆ పరిమితిని 300కు పెంచారు. దీనివల్ల 90% ఫ్యాక్టరీలు ప్రభుత్వ అనుమతి లేకుండానే కార్మికులను తొలగించవచ్చని విజయన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ ను దెబ్బతీస్తుందన్నారు. అలాగే పని గంటలను 8 నుంచి 9 గంటలకు పెంచే నిబంధనలను ఆయన తప్పుబట్టారు. శాశ్వత ఉద్యోగాల స్థానంలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు రావడం వల్ల ఉద్యోగ భద్రత కరువైందని, 'సమాన పనికి సమాన వేతనం' అనే సూత్రం కనుమరుగైందని అన్నారు.

ఈ కొత్త చట్టాలు కార్మిక వ్యతిరేకమని, వీటిని ప్రతిఘటించడం దేశ మనుగడకు అత్యవసరమని విజయన్ పిలుపునిచ్చారు. "కార్పొరేట్-కోమ్యూనల్ (కార్పొరేట్-మతతత్వ) కూటమికి వ్యతిరేకంగా కార్మికులు, రైతులు ఐక్యంగా పోరాడాలి" అని ఆయన స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 కొత్త లేబర్ కోడ్‌లు ఏమిటంటే..

వేతనాల కోడ్:

ఇది జీతాలు, బోనస్‌లకు సంబంధించినది. దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లోని కార్మికులకు కనీస వేతనం వర్తిస్తుంది. ఇదివరకు కొన్ని రంగాలకే పరిమితమై ఉండేది. కేంద్ర ప్రభుత్వం ఒక ప్రాథమిక వేతనాన్ని నిర్ణయిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు దానికంటే తక్కువ కాకుండా జీతాలను నిర్ణయించాలి. జీతాన్ని నెలవారీ, వారపు ప్రాతిపదికన లేదా రోజువారీగా సకాలంలో చెల్లించాలి.

పారిశ్రామిక సంబంధాల కోడ్:

కంపెనీలు కార్మికుల మధ్య సంబంధాల గురించి తెలుపుతుంది. ఇది చాలా వివాదాస్పదమైనది. ఇదివరకు 100 మంది కంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్న కంపెనీ ఎవరినైనా తీసివేయాలన్నా లేదా కంపెనీ మూసేయాలన్నా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఇప్పుడు ఆ పరిమితిని 300 మందికి పెంచారు. అంటే 300 లోపు ఉద్యోగులున్న సంస్థలు ప్రభుత్వ అనుమతి లేకుండానే ఉద్యోగులను తీసివేయవచ్చు. కార్మికులు సమ్మెకు వెళ్లాలంటే కనీసం 60 రోజుల ముందు నోటీసు ఇవ్వడం తప్పనిసరి.

సామాజిక భద్రత కోడ్:

ఇది రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇతర భద్రతలకు సంబంధించినది. స్విగ్గీ, జొమాటో వంటి యాప్‌ల ద్వారా పనిచేసే డెలివరీ బాయ్స్, ఉబర్ డ్రైవర్లను కూడా ఈ చట్టం పరిధిలోకి తెచ్చారు. వీరికి కూడా సామాజిక భద్రత కల్పించాలని ప్రతిపాదించారు. పీఎఫ్ ,ఇ ఎస్ ఐ సౌకర్యాలను మరింత ఎక్కువ మంది కార్మికులకు వర్తింపజేయడం దీని లక్ష్యం.

వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్:

ఇది పని చేసే చోట పరిస్థితుల గురించి తెలుపుతుంది. రోజుకు గరిష్టంగా పని గంటలను పెంచే అవకాశం కల్పించారు (ఉదాహరణకు 8 గంటల నుండి 12 గంటల వరకు, కానీ వారానికి 48 గంటలు మించకూడదు). అలాగే మహిళలు రాత్రి షిఫ్టుల్లో (రాత్రి 7 నుండి ఉదయం 6 వరకు) పనిచేయడానికి అనుమతి ఇచ్చారు, అయితే వారి భద్రత బాధ్యత కంపెనీదే. ఇతర రాష్ట్రాల నుండి వచ్చి పనిచేసే వారికి ప్రయాణ భత్యం, రేషన్ సౌకర్యాలు కల్పించాలి.

ఈ చట్టాలపై ఉన్న ప్రధాన విమర్శలు:

300 మంది లోపు ఉద్యోగులున్న కంపెనీలకు వెసులుబాటు ఇవ్వడం వల్ల కంపెనీలు ఎప్పుడైనా ఉద్యోగులను తొలగించవచ్చనే భయం ఉంది. దీనివల్ల ఉద్యోగ భద్రత తగ్గుతుంది. సమ్మెలకు కఠినమైన నిబంధనలు పెట్టడం వల్ల కార్మికులు తమ నిరసనను వ్యక్తం చేయడం కష్టమవుతుందని యూనియన్లు అంటున్నాయి. పని గంటలు పెంచడం వల్ల కార్మికులపై ఒత్తిడి పెరుగుతుందని విమర్శలు వస్తున్నాయి.

ప్రస్తుతానికి కేంద్రం ఈ చట్టాలను ఆమోదించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటిని నోటిఫై చేయాల్సి ఉంది, అందుకే ఇవి దేశవ్యాప్తంగా ఇంకా పూర్తిస్థాయిలో అమలులోకి రాలేదు.