Let's talk: editor@tmv.in
కేంద్ర ఓబీసీ జాబితాలో తెలంగాణ, ఏపీకి చెందిన 32 కులాలను చేర్చండి: ఎంపీ కే లక్ష్మణ్

కేంద్ర ఓబీసీ జాబితాలో తెలంగాణ, ఏపీకి చెందిన 32 కులాలను చేర్చండి: ఎంపీ కే లక్ష్మణ్

Gaddamidi Naveen
17 మార్చి, 2026

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన మొత్తం 32 వెనుకబడిన కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మణ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తద్వారా ఆయా కులాలకు చెందిన అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో, నియామకాల్లో, విద్యాసంస్థల్లో రిజర్వేషన్ పొందే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సోమవారం రాజ్యసభలో జీరో అవర్ సందర్భంగా లక్ష్మణ్ ఈ అంశాన్ని లేవనెత్తారు.

తెలంగాణకు చెందిన 27 కులాలు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదు కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలన్న సిఫారసులు ఇప్పటికే జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్‌సీబీసీ) చేసినట్లు లక్ష్మణ్ తెలిపారు. సామాజిక, విద్యా, ఆర్థిక పరంగా వెనుకబడిన ఈ వర్గాలు రాష్ట్ర స్థాయిలో ఓబీసీగా గుర్తింపు పొందినా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కేంద్ర విద్యాసంస్థల్లో మాత్రం ఓబీసీ హోదా లభించకపోవడం వల్ల వారికి అనేక అవకాశాలు దూరమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రాల ఓబీసీ జాబితాల్లో ఉన్నప్పటికీ కేంద్ర జాబితాలో పేరు లేకపోవడంతో ఈ కులాలకు కేంద్ర ప్రభుత్వ నియామకాలు, విద్యాసంస్థల్లో అందుబాటులో ఉన్న 27 శాతం ఓబీసీ రిజర్వేషన్ ప్రయోజనం లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల విద్యా, ఉపాధి రంగాల్లో ఈ వర్గాల అభివృద్ధి దెబ్బతింటోందని అన్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లోని కొన్ని వర్గాలకూ ఇదే సమస్య ఉన్నట్లు ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్‌సీబీసీ చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన అమలు చేయాలని లక్ష్మణ్ కోరారు. అర్హత ఉన్న వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు అందేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రధాని న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ అంశాన్ని సహానుభూతితో పరిశీలించి, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యను త్వరలో పరిష్కరిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు.

కేంద్ర ఓబీసీ జాబితాలో తెలంగాణ, ఏపీకి చెందిన 32 కులాలను చేర్చండి: ఎంపీ కే లక్ష్మణ్ - Tholi Paluku