Let's talk: editor@tmv.in
కేంద్రానికి రైతుల బోనస్ భారమా?: సీఎం పినరయి విజయన్

కేంద్రానికి రైతుల బోనస్ భారమా?: సీఎం పినరయి విజయన్

Pinjari Chand
9 ఫిబ్రవరి, 2026

వరి ఉత్పత్తి పెరుగుదల దేశానికి ‘భారం’ అవుతుందని కేంద్ర ప్రభుత్వం చెప్పడం రైతులకు సవాల్ విసురుతున్నట్లేనని, ఇది కేరళ పట్ల ఉన్న శత్రుత్వాన్ని స్పష్టంగా చూపుతోందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదివారం తీవ్రంగా విమర్శించారు. ఒక ప్రకటనలో సీఎం మాట్లాడుతూ, వరి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అదనపు ప్రోత్సాహక బోనస్‌ను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోందని తెలిపారు.

వరి ఉత్పత్తి అవసరానికి మించి ఉండటంతో దాని కొనుగోలు ఖర్చులు ప్రభుత్వ ఖజానాపై భారంగా మారుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ విభాగం కార్యదర్శి అధికారికంగా తెలియజేశారని విజయన్ చెప్పారు. ఈ విషయమై కేంద్ర వైఖరిని వివరించే లేఖ ఒకటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి అందిందని ఆయన తెలిపారు. కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం వరి రైతులకు బోనస్ అందిస్తోందని, దీనిపై కేంద్రానికి ఎందుకు అభ్యంతరం ఉంటోందని సీఎం ప్రశ్నించారు. కేరళలో వరి కొనుగోలుకు కిలోకు అదనంగా రూ. 6.31 ప్రోత్సాహకం ఇస్తున్నామని ఆయన గుర్తు చేశారు.

కార్పోరేట్లకు రుణాలను రద్దు చేస్తారు కానీ.. రైతులకు బోనస్ ఇవ్వలేరా?

వేల కోట్ల రూపాయల కార్పొరేట్ రుణాలను రద్దు చేయడానికి వెనుకాడని వారు, రైతులకు ఇచ్చే బోనస్‌ను మాత్రం పెద్ద భారంగా చూపించడం దుర్మార్గమని ఆరోపించారు. ఉత్పత్తి పెరుగుదలనే భారంగా వ్యాఖ్యానిస్తూ, ప్రస్తుతం అమల్లో ఉన్న బోనస్ విధానాన్ని పునఃసమీక్షించాలనే ఒత్తిడి రాష్ట్రంపై తీసుకువస్తున్నారని, ఇది రైతుల పట్లనే కాకుండా కేరళ రాష్ట్రం పట్ల మొత్తం శత్రుత్వ దృక్పథాన్ని ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు. ఇది భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం పేరుతో అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు దేశ మార్కెట్‌ను తెరవడానికి తీసుకునే తొలి అడుగేనా? అని కూడా సీఎం ప్రశ్నించారు. రైతులకు చెల్లించాల్సిన కేంద్ర వాటా సహాయాన్ని సమయానికి విడుదల చేయడంలో విఫలమవుతున్న కేంద్రం, ఇదే సమయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన విమర్శించారు.

కేంద్ర వైఖరిపై సీఎం విజయన్ తీవ్ర వ్యాఖ్యలు చేయడానికి ముందు, అధికార ఎల్‌డీఎఫ్ కన్వీనర్ టి.పీ. రామకృష్ణన్ కూడా శనివారం రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలుకు అందిస్తున్న అదనపు ప్రోత్సాహకాన్ని నిలిపివేయాలన్న కేంద్ర ఆదేశాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి జోక్యం దేశ ఆహార స్వావలంబనను బలహీనపరుస్తుందని రామకృష్ణన్ ఆరోపించగా, ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా గట్టి నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇది దేశ ఆహార భద్రతకు ముప్పుగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.

జనవరి 9న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ విభాగం కార్యదర్శి వి. వువాల్నమ్, కేరళ ప్రధాన కార్యదర్శి ఏ. జయతిలక్‌కు లేఖ రాస్తూ, వరి, గోధుమలపై రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న అదనపు ప్రోత్సాహక విధానాన్ని పునఃసమీక్షించి నిలిపివేయాలని సూచించారు. అదేవిధంగా, పప్పుధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాల సాగును ప్రోత్సహించే ప్రోత్సాహకాలపై దృష్టి పెట్టాలని, ఇది పోషక భద్రత, ఆత్మనిర్భరత, సుస్థిర వ్యవసాయం అనే జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణమని లేఖలో పేర్కొన్నారు. గోధుమలు, వరి బంపర్ ఉత్పత్తి కారణంగా ప్రజాపంపిణీ వ్యవస్థ, బఫర్ నిల్వలు, ఇతర సంక్షేమ అవసరాలకు మించిన స్థాయిలో నిల్వలు పెరిగిపోయాయని లేఖలో పేర్కొంది. ఈ మిగులు నిల్వలు సంవత్సరానికోసారి పెరుగుతూ, ప్రభుత్వ ఖజానాపై గణనీయమైన, పునరావృత భారంగా మారుతున్నాయని అందులో పేర్కొన్నారు. కేంద్ర సూచనలను కేరళ వ్యవసాయ మంత్రి పి. ప్రసాద్ పూర్తిగా తిరస్కరిస్తూ, అవి ‘అంగీకరించలేనివి’ అని వ్యాఖ్యానించారు. వరి సాగుపై ఎలాంటి రాజీ ఉండదని ఆయన స్పష్టం చేశారు.

కేంద్రానికి రైతుల బోనస్ భారమా?: సీఎం పినరయి విజయన్ - Tholi Paluku