Let's talk: editor@tmv.in
కేంద్రమంత్రులతో ప్రధాని భేటీ

కేంద్రమంత్రులతో ప్రధాని భేటీ

Pinjari Chand
23 మార్చి, 2026

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ఇంధనం, గ్యాస్, విద్యుత్, ఎరువుల సరఫరా వ్యవస్థపై ప్రధాని నరేంద్రమోడీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆదివారం జరిగిన ఈ కీలక సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్,, హోం మంత్రి అమిత్‌షా, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, వాణిజ్య మంత్రి పీయూష్‌గోయల్‌ తదితరులు పాల్గొన్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌దోవల్‌తో పాటు కీలక ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. సమావేశంలో క్రూడ్ ఆయిల్, గ్యాస్, పెట్రోలియం ఉత్పత్తులు, విద్యుత్, ఎరువుల సరఫరా నిరంతరంగా కొనసాగేందుకు చర్యలపై చర్చించారు. లాజిస్టిక్స్ వ్యవస్థను స్థిరంగా ఉంచడం, దేశవ్యాప్తంగా సమర్థంగా పంపిణీ చేయడమే ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు.

హార్ముజ్ మార్గం ప్రభావం

పశ్చిమ ఆసియా యుద్ధం నాలుగో వారంలోకి చేరడంతో కీలక సముద్ర మార్గమైన హర్ముజ్‌లో నౌకాయానం తీవ్రంగా ప్రభావితమైంది. ప్రపంచ ఇంధన సరఫరాలో సుమారు 20 శాతం ఈ మార్గం ద్వారానే జరిగే నేపథ్యంలో, ఇరాన్ నియంత్రణలో ఉన్న ఈ మార్గంలో అంతరాయం గ్లోబల్ మార్కెట్లపై ప్రభావం చూపుతోంది.

ధరల పెరుగుదల, సరఫరా చర్యలు

సంక్షోభ ప్రభావంతో పరిశ్రమల డీజిల్ ధరలు సుమారు 25 శాతం పెరిగి లీటరు రూ.87.67 నుంచి రూ.109.59కు చేరాయి. అయినప్పటికీ సరఫరా అంతరాయం లేకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. టెక్సాస్ నుంచి వచ్చిన ఎల్పీజీ నౌక న్యూ మంగుళూరు పోర్ట్‌కు చేరడం ద్వారా సరఫరా కొనసాగింపునకు ఊరట లభించింది.

పోర్ట్ సౌకర్యాలు, భద్రత

క్రూడ్ ఆయిల్, ఎల్పీజీ కార్గోపై మార్చి 14 నుంచి 31 వరకు ఛార్జీలను మాఫీ చేసినట్లు కేంద్రం తెలిపింది. దేశంలోని ఏ పోర్టులోనూ రద్దీ లేదని స్పష్టం చేసింది. పర్షియన్ గల్ఫ్‌లో ఉన్న 22 భారత నౌకలు, 611 మంది భారతీయ నావికులు సురక్షితంగా ఉన్నారని వెల్లడించింది.

గ్లోబల్ పరిస్థితులపై సమీక్ష

ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు, సరఫరా గొలుసులో అంతరాయాలు, వినియోగదారులు మరియు పరిశ్రమల ప్రయోజనాల పరిరక్షణపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా సమావేశంలో సమీక్షించారు.

ప్రధాని వ్యాఖ్యలు, దౌత్య చర్యలు

మార్చి 12న ప్రధాని మోడీ పశ్చిమ ఆసియా యుద్ధం ప్రపంచ ఇంధన సంక్షోభానికి దారితీసిందని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని శాంతి, సహనం, ప్రజల్లో అవగాహనతో ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని అన్నారు. సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి పలు దేశాల నేతలతో ఆయన టెలిఫోన్ ద్వారా చర్చలు జరిపారు. ప్రపంచ పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో, దేశంలో అవసరమైన అన్ని ముఖ్య వస్తువుల సరఫరా నిరంతరంగా కొనసాగేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తోంది.