
కేంద్రమంత్రి వర్సెస్ రాహుల్ గాంధీ
కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టును కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘ద్రోహి’గా వ్యాఖ్యానించిన కొన్ని గంటల్లోనే, బీజేపీ ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడింది. ఇది ప్రతి సిక్కుకుచేసిన అవమానం అని ఆరోపిస్తూ, లోక్‌సభ స్పీకర్ ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కొత్త పార్లమెంట్ భవనం ప్రవేశద్వారం వద్ద బిట్టు, రాహుల్ గాంధీ ఎదురెదురుగా రావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సభ్యత, సంస్కారం అన్న అన్ని హద్దులు దాటాయని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. రవ్నీత్ సింగ్ బిట్టు లుధియానా, ఆనంద్‌పూర్ సాహిబ్ నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం ఆయన రైల్వేలు, ఆహార ప్రాసెసింగ్ శాఖల కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు.
ఈ అంశంపై బీజేపీ తమ పార్టీ సిక్కు నేతలను ముందుకు తెచ్చింది. హర్దీప్ పూరి, ఢిల్లీ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా సహా పలువురు నేతలు, కాంగ్రెస్‌లో ఇప్పటికీ 1984 నాటి సిక్కు వ్యతిరేక మనస్తత్వమే కొనసాగుతోందని ఆరోపించారు. సిర్సా మాట్లాడుతూ నిజమైన ద్రోహులు గాంధీ కుటుంబమే. వారు ట్యాంకులు, తుపాకులతో అమృత్‌సర్ గోల్డెన్ టెంపుల్‌ను అపవిత్రం చేశారు. సిక్కులను టైర్లు వేసి కాల్చారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బుధవారం ఉదయం పార్లమెంటులోకి ప్రవేశిస్తున్న సమయంలో, సస్పెండ్ అయిన కాంగ్రెస్ ఎంపీలకు మద్దతుగా మెట్ల వద్ద నిలబడి ఉన్న రాహుల్ గాంధీ, బిట్టును చూసి ఇదిగో ఒక ద్రోహి నడుచుకుంటూ వస్తున్నాడు. అతడి ముఖం చూడండని వ్యాఖ్యానించారు. అంతేకాదు రాహుల్ గాంధీ బిట్టుతో చేతులు కలపడానికి ప్రయత్నిస్తూ హలో బ్రదర్, నా ద్రోహి మిత్రుడా. భయపడొద్దు, నువ్వు తిరిగి కాంగ్రెస్‌కే వస్తావు అని అన్నారు. దీనికి బిట్టు చేయి కలపడానికి నిరాకరిస్తూ, రాహుల్ వైపు చూపిస్తూ, దేశానికి శత్రువని(దేశ్ కీ దుష్మాన్) వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ విడుదల చేసిన వీడియోల్లో, బిట్టు మకర్ ద్వార్ మెట్లను దాటుతూ, రాహుల్ గాంధీ, సస్పెండ్ అయిన ఎంపీల వైపు చూపిస్తూ దేశానికి శత్రువు అని పదే పదే అంటున్న దృశ్యాలు కనిపించాయి. కాంగ్రెస్ నేతలు కూడా అతడిని ఉద్దేశించి సరెండర్, సరెండర్ అంటూ నినాదాలు చేశారు.
ఆయన బాధ్యతలేని కొడుకు
తర్వాత బిట్టు వీడియో ప్రకటన విడుదల చేస్తూ, రాహుల్ గాంధీని సోనియా గాంధీ బాధ్యతలేని కొడుకుగా పేర్కొన్నారు. ఎందుకు ఇలాంటి మాటలు ఇతర ఎంపీలను అనలేదు? ఒక సిక్కునే ఎందుకు అన్నాడు? అని ప్రశ్నించారు. నా తాత బియంట్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉండి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. గాంధీ కుటుంబం సృష్టించిన అగ్నికాండ వల్లే ఆయన అమరుడయ్యారు. నేను కాంగ్రెస్‌లో ఉన్నంతకాలం నా తాత ‘షహీద్’. ఇప్పుడు బీజేపీలోకి వచ్చాక నేను ద్రోహినయ్యానా? అని బిట్టు ప్రశ్నించారు. బిట్టు తాత, మాజీ పంజాబ్ సీఎం బియంట్ సింగ్ 1995 ఆగస్టు 31న చండీగఢ్‌లోని పంజాబ్ సచివాలయం వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిలో హతమయ్యారు.
రాహుల్ గాంధీపై ఎక్స్ వేదికగా హర్దీప్ సింగ్ పూరి తీవ్ర విమర్శలు చేశారు. ఒక సిక్కు నేత రవ్నీత్ సింగ్ బిట్టును ‘ద్రోహి’ అనడం ఘోర అవమానం. ఇది సిక్కు సమాజమంతటిపై చేసిన దాడి అని ఆయన అన్నారు. సిక్కులు దేశ రక్షణలో చేసిన త్యాగాలు, వారి దేశభక్తిని రాహుల్ గాంధీ తెలుసుకోవాలి. ఆధారాలు లేకుండా ఒక సిక్కును ద్రోహి అనడం అసహ్యకరమైన విషయమని పూరి పేర్కొన్నారు. ఢిల్లీ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా కూడా బిట్టును ద్రోహి అని పిలవడం ద్వారా రాహుల్ గాంధీ మొత్తం సిక్కు సమాజాన్ని అవమానించాడు. లోక్‌సభ స్పీకర్ ఈ అంశంపై తప్పక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
