
కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్‌లకు కేటీఆర్ లీగల్ నోటీసులు
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ లీగల్ నోటీసులు జారీ చేశారు. తనపై, తన కుటుంబంపై నిరాధారమైన ఆరోపణలు చేసి పరువు నష్టం కలిగించారంటూ విడివిడిగా ఈ నోటీసులు పంపించారు. నోటీసు అందిన ఐదు రోజుల్లోగా స్పందించకపోతే సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు.
బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి సాక్ష్యాధారాలు లేకుండా అడ్డగోలుగా వ్యాఖ్యలు చేయడం ద్వారా తన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీయాలని ప్రయత్నించారని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజల్లో తనపై ఉన్న నమ్మకాన్ని తగ్గించేలా, దురుద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేశారని నోటీసుల్లో స్పష్టం చేశారు. వెంటనే తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగంగా నిబంధనలు లేని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు పంపిన నోటీసులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. కేటీఆర్ కుటుంబం ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించిందని, సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ చేశారంటూ జనవరి 23న నిర్వహించిన ప్రెస్ మీట్‌లో బండి సంజయ్ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని న్యాయవాదులు స్పష్టం చేశారు. ఇప్పటికే బండి సంజయ్‌పై పరువు నష్టం దావా సిటీ సివిల్ కోర్టులో పెండింగ్‌లో ఉన్నప్పటికీ, మళ్లీ అదే తరహా వ్యాఖ్యలు చేయడం చట్టవిరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
అలాగే ఎంపీ ధర్మపురి అరవింద్‌కు పంపిన నోటీసులో ఆయన చేసిన వ్యక్తిగత దూషణలను తీవ్రంగా తప్పుబట్టారు. కేటీఆర్ డ్రగ్స్ సేవిస్తున్నారని, సరఫరా చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు అక్షేపణీయమని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ఐటీ రంగ విస్తరణకు కృషి చేసిన మాజీ మంత్రిపై ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడటం రాజకీయ కక్ష సాధింపేనని నోటీసులో వివరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిత్వ హననానికి పాల్పడితే న్యాయపరమైన పరిణామాలు తప్పవని కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు.
