Let's talk: editor@tmv.in
కేంద్రం విదేశీ నిఘా వాస్తవాలను దాచేస్తోంది : రాహుల్ గాంధీ

కేంద్రం విదేశీ నిఘా వాస్తవాలను దాచేస్తోంది : రాహుల్ గాంధీ

Pinjari Chand
5 ఏప్రిల్, 2026

దేశంలో చైనా సీసీటీవీ కెమెరాలు, యాప్‌ల ద్వారా విదేశీ నిఘా జరుగుతున్న వాస్తవాలను కేంద్ర ప్రభుత్వం దాచిపెడుతోందని, దీనివల్ల ప్రతి భారతీయుడి భద్రత ప్రమాదంలో పడుతోందని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. భారత ప్రజలను చీకట్లో ఉంచేందుకు ఇది ఉద్దేశపూర్వక ప్రయత్నమని ఆయన శనివారం చేసిన ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నారు. ప్రజల వినియోగానికి చైనా సీసీటీవీ కెమెరాలను నిషేధించినట్టు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, అవే కెమెరాలు ప్రభుత్వ భవనాల్లో ఇంకా అమర్చి ఉన్నాయని రాహుల్ గాంధీ అన్నారు. నిషేధిత చైనా యాప్‌లు పేర్లు మార్చుకొని మళ్లీ ప్రత్యక్షమవుతున్నాయని, విదేశీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్‌లు సున్నితమైన డేటాను ప్రాసెస్ చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ అంశాలపై తాను పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగినా కేంద్రం సరైన సమాధానాలు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడైన ఆయన మాట్లాడుతూ మన దేశంలో ఉన్న సీసీటీవీ కెమెరాలు ఏ దేశాలకు చెందినవి? వాటిలో ఎన్ని భద్రతా ప్రమాణాలు పొందాయి? ప్రభుత్వ డేటాను ఏ విదేశీ ఏఐ ప్లాట్‌ఫామ్‌లు ప్రాసెస్ చేస్తున్నాయి? నిషేధిత యాప్‌లలో ఎన్ని పేర్లు మార్చుకుని కొనసాగుతున్నాయని ప్రశ్నించినట్టు తెలిపారు. ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాధానంలో స్పష్టమైన గణాంకాలు, వివరాలు లేవని ఆయన విమర్శించారు. ఒక్క ప్లాట్‌ఫామ్ పేరు కూడా చెప్పలేదని ఆయన అన్నారు. ప్రభుత్వం ఐదేళ్ల క్రితమే సుమారు పది లక్షల చైనా కెమెరాలు డేటా బదిలీ విషయంలో ప్రమాదకరమని అంగీకరించినప్పటికీ, ఇప్పటికీ అవి భద్రమేనా కాదా అన్న విషయాన్ని వెల్లడించలేదని అన్నారు.

డిజిటల్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు: కేంద్రం

ఇదిలా ఉండగా, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి జితిన్‌ ప్రసాద లోక్‌సభలో ఇచ్చిన సమాధానంలో డిజిటల్ సాంకేతికతల వల్ల కలిగే సైబర్ భద్రతా ప్రమాదాలపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని తెలిపారు. గత 12 సంవత్సరాల్లో దేశ డిజిటల్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు పలు చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారు. ముఖ్యంగా టెలికాం నెట్‌వర్క్‌ల భద్రత, డేటా రక్షణకు చట్టపరమైన వ్యవస్థను బలపరిచినట్లు తెలిపారు. 2021లో టెలికాం పరికరాలు విశ్వసనీయ వనరుల నుంచే వినియోగించాలనే జాతీయ భద్రతా మార్గదర్శకాలు అమలు చేశామని చెప్పారు. అలాగే టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ల భద్రత కోసం టెలి కమ్యూనికేషన్‌ యాక్ట్‌ 2023, వ్యక్తిగత డేటా రక్షణ కోసం డిజిటల్‌ పర్సనల్‌ డాటా ప్రోటెక్షన్‌ యాక్ట్‌ 2022 వంటి చట్టాలను అమలు చేసినట్లు తెలిపారు. సీసీటీవీ వ్యవస్థల భద్రతను మెరుగుపరిచేందుకు కూడా ప్రభుత్వం కీలక సంస్కరణలు చేపట్టిందని, భారత మార్కెట్‌లో అమ్మే సీసీటీవీ పరికరాలకు తప్పనిసరి భద్రతా ప్రమాణాలను నిర్దేశించినట్లు మంత్రి తెలిపారు.