Let's talk: editor@tmv.in
కేంద్రం ముస్లింలను రెండో తరగతి పౌరులుగా చూస్తోంది: కేరళ సీఎం

కేంద్రం ముస్లింలను రెండో తరగతి పౌరులుగా చూస్తోంది: కేరళ సీఎం

Pinjari Chand
18 జనవరి, 2026

బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు చట్టాలు, విధానాలు ముస్లింలను రెండో తరగతి పౌరులుగా మార్చేలా ఉన్నాయని, వారిని సమాజ ప్రధాన ప్రవాహం నుంచి వేరు చేసే ప్రయత్నం చేస్తున్నాయని కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఆరోపించారు. పౌరసత్వ చట్టం (సిటిజన్‌షిప్ యాక్ట్), కొత్త వక్ఫ్ చట్టం వంటి నిబంధనలు ముస్లింలపై వివక్ష చూపుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కేరళ ముస్లిం జమాత్ ఆధ్వర్యంలో జనవరి 1న కాసరగోడ్ నుంచి ప్రారంభమై, తిరువనంతపురంలో ముగిసిన ‘కేరళ యాత్ర’ ముగింపు సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో లౌకికవాదం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలు తీవ్రమైన ముప్పులో ఉన్నాయని విజయన్ అన్నారు. దేశవ్యాప్తంగా ముస్లింలు, క్రైస్తవుల వంటి మైనారిటీ వర్గాలు, వారి ప్రార్థనా స్థలాలపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో మెజారిటీ కమ్యూనలిజాన్ని మైనారిటీ కమ్యూనలిజంతో ఎదుర్కోవడం సాధ్యం కాదని, రెండూ పరస్పరం ఒకదానిని ఒకటి బలపరుస్తాయని చెప్పారు. ఇలాంటి శక్తులను ఎదుర్కోవాలంటే లౌకికవాదాన్ని మరింత బలోపేతం చేయడమే మార్గమని పుత్తరికండం మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన స్పష్టం చేశారు.

ఏ విధమైన కమ్యూనలిజం పట్లైనా ‘సాఫ్ట్ స్టాండ్’ లేదా ‘బుజ్జగించే ధోరణి’ అనుసరించడం ప్రమాదకరమని విజయన్ హెచ్చరించారు. గతంలో కేరళలో తీవ్ర కమ్యూనల్ ఘర్షణలు, అల్లర్లు చోటుచేసుకున్నప్పటికీ, ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం తీసుకున్న కఠినమైన, రాజీ లేని వైఖరి కారణంగానే అవన్నీ అణచివేసినట్లు ఆయన తెలిపారు. మతం, జాతి, కులం, భాష పేరిట ప్రజలను విభజించేందుకు ప్రయత్నిస్తున్న శక్తులపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ నేతృత్వంలో జరిగిన ‘కేరళ యాత్ర’ ఈ దిశగా సరైన అడుగని ప్రశంసించారు. మతం లేదా జాతి పేరుతో ప్రజలను విడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్న ఈ కాలంలో, ఇలాంటి ఉద్యమాలు వాటికి బలమైన రక్షణగా నిలుస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.