Let's talk: editor@tmv.in
కేంద్రం కార్మికులతోనూ..రైతులతో వ్యవహరించినట్టే చేస్తోంది: రాహుల్ గాంధీ

కేంద్రం కార్మికులతోనూ..రైతులతో వ్యవహరించినట్టే చేస్తోంది: రాహుల్ గాంధీ

Pinjari Chand
23 జనవరి, 2026

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ)ను రద్దు చేయడంలో మోడీ ప్రభుత్వ లక్ష్యం, గతంలో తీసుకొచ్చిన మూడు నల్ల వ్యవసాయ చట్టాల లక్ష్యంతో సమానమేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కార్మికులతో కూడా రైతుల్లా వ్యవహరించాలనే ఉద్దేశమే కేంద్ర ప్రభుత్వానికి ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ విభాగంలోని సృజనాత్మక వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ ఎంజీఎన్‌ఆర్‌ఈజీ కార్మికుల సదస్సులో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వివరిస్తూ ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ భావన పేదలకు హక్కులు కల్పించడమేనన్నారు. అవసరం ఉన్నవారికి పని కల్పించడమే లక్ష్యంగా, పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా ఈ పథకం అమలవుతుందని చెప్పారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ గా అంటే పేదలకు పని చేసే హక్కు. ఆ హక్కు భావననే బీజేపీ–మోడీ ప్రభుత్వం ముగించాలనుకుంటోందని వ్యాఖ్యానించారు. కొన్నేళ్ల క్రితం కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రైతులు ఐక్యంగా పోరాడి రద్దు చేయించారని గుర్తుచేశారు. అందరం కలిసి ఒత్తిడి తెచ్చినప్పుడు ఆ చట్టాలు రద్దయ్యాయి. ఇప్పుడు కార్మికుల విషయంలోనూ అదే తంతు చేస్తున్నారని అన్నారు. కొత్త చట్టం ద్వారా పని ఏది, నిధులు ఎక్కడ ఇవ్వాలన్నది కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందని, బీజేపీ పాలిత రాష్ట్రాలకు ప్రాధాన్యం ఉంటుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. గతంలో కార్మికులకు అందిన లబ్ధి ఇప్పుడు కాంట్రాక్టర్లు, బ్యూరోక్రసీకి వెళ్తుందని తెలిపారు. ఆస్తులు కొద్దిమంది చేతుల్లోనే ఉండేలా చేసి, పేదలు అదానీ–అంబానీలపై ఆధారపడే భారత్ కావాలనేదే బీజేపీ మోడల్. రాజే అన్నీ నిర్ణయించే దేశాన్ని వారు కోరుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా కొత్త చట్టం పేరు తనకు గుర్తుకు రావడం లేదని చెప్పి, ప్రేక్షకులను అడగడం గమనార్హం. దేశవ్యాప్తంగా వచ్చిన కార్మికులు తమ పని ప్రదేశాల నుంచి తీసుకొచ్చిన మట్టి చేతిపనిముట్లతో మొక్కల్లో మట్టి వేసి, నిరసనకు ప్రతీకగా కార్యక్రమం నిర్వహించారు.

ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ రద్దుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ జనవరి 10 నుంచి ‘ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ బచావో సంగ్రామ్’ పేరుతో 45 రోజుల దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభించింది. వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవిక మిషన్ (గ్రామీణ) (వీబీ-జీ రాం జీ) చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏగా పథకాన్ని హక్కుల ఆధారిత చట్టంగా యథాతథంగా కొనసాగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

బడ్జెట్ సమావేశాల్లో బలంగా లేవనెత్తుతాం: ఖర్గే

ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏగా (మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం)ను రద్దు చేయడం ద్వారా ప్రజల మదిలో మహాత్మా గాంధీ పేరును తొలగించాలనే ప్రయత్నమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. పార్లమెంట్లో రానున్న బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాన్ని తీవ్రంగా లేవనెత్తుతామని స్పష్టం చేశారు. సదస్సులో మాట్లాడిన ఖర్గే, ప్రజలంతా ఐక్యంగా నిలబడి ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త చట్టాన్ని అమలు చేయనివ్వకూడదని పిలుపునిచ్చారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏగా రద్దు చర్య గ్రామ స్వరాజ్య భావనను బలహీనపరచడానికేనని ఆయన విమర్శించారు. బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై పోరాటం చేస్తామంటూ ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ రద్దుపై ప్రభుత్వాన్ని ఖర్గే తీవ్రంగా తప్పుబట్టారు.