
కెనడా, వెనిజులా, గ్రీన్‌లాండ్‌లతో కూడిన అమెరికా కొత్త మ్యాప్‌ను పోస్ట్ చేసిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో అంతర్జాతీయ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు సృష్టించారు. పొరుగు దేశం కెనడాతో పాటు గ్రీన్‌లాండ్, వెనిజులా దేశాలను అమెరికా భూభాగంలో కలిపి చూపిస్తున్న ఒక వివాదాస్పద చిత్రపటాన్ని ఆయన తన 'ట్రూత్ సోషల్' వేదికగా పంచుకున్నారు. ఈ దేశాలన్నీ అగ్రరాజ్యంలో అంతర్భాగమేనని ధ్వనించేలా ఉన్న ఈ పోస్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
గ్రీన్‌లాండ్‌పై పట్టు
ట్రంప్ పంచుకున్న మరో పోస్ట్‌లో ఆయనతో పాటు వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో గ్రీన్‌లాండ్‌లో అమెరికా జెండాను ఎగురవేస్తున్నట్లు ఉంది. అక్కడ ఉన్న ఒక మైలురాయిపై "గ్రీన్‌లాండ్ యూఎస్ టెరిటరీ-ఎస్టాబ్లిష్డ్ 2026" అని రాసి ఉండటం గమనార్హం. గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేస్తామన్న తన పాత ప్రతిపాదనను ఆయన మరోసారి తెరపైకి తెచ్చారు. గ్రీన్‌లాండ్ భద్రత అమెరికాకు మాత్రమే కాకుండా ప్రపంచ భద్రతకే అత్యంత కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ అంశంపై నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో ఫోన్లో మాట్లాడిన ట్రంప్.. దావోస్‌లో దీనిపై వివిధ పక్షాలతో భేటీ అవుతానని స్పష్టం చేశారు.
వెనిజులాపై ఆధిపత్యం.. కెనడాకు అహ్వానం
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో పట్టుబడిన నేపథ్యంలో ఆ దేశంలో ప్రశాంతమైన అధికార మార్పిడి జరిగే వరకు అమెరికా అక్కడ పర్యవేక్షణ కొనసాగిస్తుందని ట్రంప్ తెలిపారు. వెనిజులాలోని తాత్కాలిక యంత్రాంగంపై తమకు పూర్తి పట్టు ఉందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ధృవీకరించారు. ఇక కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని ట్రంప్ గతంలోనే ప్రతిపాదించారు. అయితే కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఈ ప్రతిపాదనను తీవ్రంగా తిరస్కరించారు. "కోరికలకు, వాస్తవాలకు మధ్య వ్యత్యాసం ఉంటుంది.. కెనడా ఎప్పటికీ స్వతంత్రంగానే ఉంటుంది" అని ఆయన స్పష్టం చేశారు. అయినప్పటికీ ట్రంప్ మాత్రం తన పంతం వీడకుండా కెనడా మాజీ ప్రధాని ట్రూడోను 'గవర్నర్ ఆఫ్ కెనడా' అని ఎగతాళి చేస్తూ వస్తున్నారు.
ఒప్పుకోకుంటే టారిఫ్‌ల వాతే!
గ్రీన్‌లాండ్‌ను విక్రయించడానికి డెన్మార్క్ లేదా ఇతర ఐరోపా దేశాలు అంగీకరించకపోతే భారీ ఆర్థిక ఆంక్షలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఫిబ్రవరి 1, 2026 నుండి 10 శాతం, జూన్ 1 నుండి 25 శాతం మేర టారిఫ్‌లను పెంచుతామని బెదిరించారు. అమెరికా ఇన్నాళ్లుగా అందిస్తున్న మద్దతుకు ప్రతిఫలంగా డెన్మార్క్ ఇప్పుడు గ్రీన్‌లాండ్‌ను అప్పగించాల్సిన సమయం వచ్చిందని ఆయన వాదించారు. చైనా, రష్యాలు ఈ ప్రాంతంపై కన్నేసిన నేపథ్యంలో జాతీయ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తప్పనిసరని ఆయన చెప్పుకొచ్చారు.
మొత్తంగా ట్రంప్ పంచుకున్న అమెరికా కొత్త మ్యాప్ అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. గ్రీన్‌లాండ్, కెనడా వంటి సార్వభౌమ దేశాలను అమెరికా భూభాగాలుగా చిత్రించడంపై ఐరోపా దేశాలు, నాటో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా డెన్మార్క్, గ్రీన్‌లాండ్ తమ స్వయంప్రతిపత్తిని ప్రశ్నించేలా ఉన్న ట్రంప్ వైఖరిని ఖండిస్తూ వారం రోజులుగా నిరసనలు తెలుపుతున్నాయి. ఈ పరిణామం ప్రపంచ దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది. ట్రంప్ దూకుడుగా విదేశాంగ విధానంలో మార్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
