Let's talk: editor@tmv.in
కెనడా విక్ర‌యించే విమానాలపై 50 శాతం సుంకం.. ట్రంప్ హెచ్చరిక

కెనడా విక్ర‌యించే విమానాలపై 50 శాతం సుంకం.. ట్రంప్ హెచ్చరిక

Shaik Mohammad Shaffee
31 జనవరి, 2026

అమెరికా, కెనడాల మధ్య దౌత్య, వాణిజ్య విభేదాలు మునుపెన్నడూ లేని విధంగా ముదిరాయి. కెనడా ప్రధాని మార్క్ కార్నీతో కొనసాగుతున్న వాగ్వాదాల నేపథ్యంలో, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈసారి ఆ దేశ విమానయాన రంగాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. అమెరికాలోని జార్జియాకు చెందిన 'గల్ఫ్‌స్ట్రీమ్ ఏరోస్పేస్' జెట్‌లకు కెనడా ధృవీకరణ ఇవ్వడం లేదని ఆరోపిస్తూ.. దానికి ప్రతిచర్యగా కెనడా తయారీ విమానాలన్నింటినీ అమెరికాలో 'డీ-సర్టిఫై' (గుర్తింపు రద్దు) చేస్తానని ఆయన ప్రకటించారు.

బొంబార్డియర్ లక్ష్యంగా ఆంక్షలు

ట్రంప్ హెచ్చరికల్లో ప్రధానంగా కెనడాకు చెందిన దిగ్గజ విమాన తయారీ సంస్థ 'బొంబార్డియర్' పేరును ప్రస్తావించారు. ముఖ్యంగా క్యూబెక్ కేంద్రంగా తయారయ్యే 'గ్లోబల్ ఎక్స్‌ప్రెస్' బిజినెస్ జెట్‌లను అమెరికాలో నిషేధించేలా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలో సుమారు 150 గ్లోబల్ ఎక్స్‌ప్రెస్ విమానాలు సేవలు అందిస్తున్నాయి. బొంబార్డియర్‌తో పాటు కెనడాలో విమానాలను తయారు చేస్తున్న ఎయిర్‌బస్, డి హావిల్లాండ్ వంటి సంస్థలపై కూడా ఈ 50 శాతం సుంకం ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనివల్ల విమానయాన రంగంపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చైనా ఒప్పందంపై 100 శాతం సుంకం సెగ

కేవలం విమానాలే కాకుండా, చైనాతో కెనడా కుదుర్చుకుంటున్న వాణిజ్య ఒప్పందాలపై కూడా ట్రంప్ నిప్పులు చెరిగారు. చైనాకు కెనడా ఒక 'డ్రాప్ ఆఫ్ పోర్ట్' (వస్తువుల మార్పిడి కేంద్రం)గా మారాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఒకవేళ కెనడా చైనాతో ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్తే, కెనడా నుంచి వచ్చే అన్ని రకాల ఉత్పత్తులపై 100 శాతం టారిఫ్ విధిస్తామని అల్టిమేటం జారీ చేశారు. "చైనా కెనడాను నిలువునా మింగేస్తుంది.. వారి వ్యాపారాలను, సామాజిక వ్యవస్థను నాశనం చేస్తుంది" అంటూ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

బలహీనపడుతున్న దౌత్య బంధం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍‍, కెనడా ప్రధాని మార్క్ కార్నీ మధ్య విభేదాలకు ప్రధానంగా మూడు అంశాలు కారణమవుతున్నాయి. గ్రీన్‌లాండ్ మీదుగా అమెరికా నిర్మించ తలపెట్టిన 'గోల్డెన్ డోమ్' క్షిపణి రక్షణ వ్యవస్థను కెనడా వ్యతిరేకించడంపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అలాగే ప్రపంచ ఆర్థిక వేదిక (దావోస్)లో మార్క్ కార్నీ మాట్లాడుతూ.. పేరు ప్రస్తావించకుండానే పెద్ద దేశాలు చిన్న దేశాలపై చూపే 'ఆర్థిక ఒత్తిడి'ని ఖండించడం ట్రంప్‌కు ఆగ్రహం తెప్పించింది. వీటికి తోడు, దశాబ్ద కాలం తర్వాత కెనడా ప్రధాని చైనాలో పర్యటించి, వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించుకోవాలని చూడటం అమెరికాకు మింగుడు పడటం లేదు. ఈ పరిణామాలు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలను మరింత పెంచాయి.

నిపుణుల ఆందోళన

సాధారణంగా విమానాల ధృవీకరణ అనేది పూర్తిగా ప్రయాణ భద్రతకు సంబంధించిన అంశమని, కేవలం వాణిజ్య విభేదాల కారణంతో ఈ గుర్తింపును రద్దు చేయడం మునుపెన్నడూ లేని అసాధారణ చర్య అని మెక్‌గిల్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జాన్ గ్రేడెక్ అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య ఉన్న 'యూఎస్-మెక్సికో-కెనడా ఒప్పందం' భవిష్యత్తుపై నీలినీడలు కమ్మేలా చేయడమే కాకుండా, ద్వైపాక్షిక వాణిజ్య యుద్ధాన్ని అత్యంత క్లిష్టమైన దశకు తీసుకెళ్లాయి. విమాన భద్రత వంటి సున్నితమైన సాంకేతిక అంశాలను రాజకీయ ఆయుధాలుగా మార్చడం ప్రపంచ విమానయాన రంగంలో తీవ్ర ఆందోళనకు దారితీస్తుండగా, ఈ అంతర్జాతీయ వివాదం ఏ మలుపు తిరుగుతుందన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

కెనడా విక్ర‌యించే విమానాలపై 50 శాతం సుంకం.. ట్రంప్ హెచ్చరిక - Tholi Paluku