Let's talk: editor@tmv.in
కెనడా పెట్టుబడులకు తెలంగాణ ఆహ్వానం: సీఎం రేవంత్ రెడ్డి

కెనడా పెట్టుబడులకు తెలంగాణ ఆహ్వానం: సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
2 నవంబర్, 2025

భారతదేశంలోని కెనడా హైకమిషనర్‌ క్రిస్టోఫర్‌ కూటర్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందం శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో ఇరు పక్షాల మధ్య ఐటీ, ఫార్మా, ఎయిరోస్పేస్‌, డిఫెన్స్‌, అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం, కొత్త పెట్టుబడుల అవకాశాలను అన్వేషించడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చలు జరిగాయి.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ సందర్భంగా మాట్టాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలు, ముఖ్యంగా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్‌ – 2047’ దృష్టిపథకంపై కెనడా ప్రతినిధులకు వివరించారు. ఈ ప్రణాళికలో భాగంగా రాష్ట్రాన్ని ఇన్నోవేషన్‌ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే కృషి జరుగుతోందని, సాంకేతికత, మౌలిక వసతులు, పరిశ్రమలు, విద్యా రంగాల సమన్వయంతో గ్లోబల్‌ స్టాండర్డ్‌ ప్రాజెక్టులను అమలు చేస్తున్నామని తెలిపారు.

పెట్టుబడులకు ఆహ్వానం

సీఎం రేవంత్‌ రెడ్డి కెనడా సంస్థలను తెలంగాణలో స్టార్టప్స్‌, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌, అడ్వాన్స్డ్‌ టెక్నాలజీ సెంటర్స్, పరిశోధన రంగాల్లో పెట్టుబడులకు ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇన్నోవేషన్‌, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల విస్తరణకు అనుకూల వాతావరణం సృష్టిస్తోందని, కెనడాతో భాగస్వామ్యం కొత్త అవకాశాలకు మార్గం చూపుతుందని ఆయన పేర్కొన్నారు.

హైకమిషనర్‌ క్రిస్టోఫర్‌ కూటర్‌ తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను గుర్తిస్తూ, ఇరుదేశాల మధ్య బలమైన ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని మరింతగా పెంచేందుకు కెనడా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ముఖ్యంగా సస్టెయినబుల్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌, క్లిన్‌ ఎనర్జీ, హెల్త్‌కేర్‌, స్కిల్‌ ట్రైనింగ్‌ రంగాల్లో సంయుక్త ప్రాజెక్టులను అమలు చేసే దిశగా సహకారాన్ని కొనసాగించేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు.

ఇరు పక్షాలు త్వరలో సంయుక్త వర్కింగ్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి, పెట్టుబడుల అవకాశాలు, టెక్నాలజీ మార్పిడి, విద్యా భాగస్వామ్యాలపై ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని అంగీకరించాయి. అలాగే 2026లో టొరంటో, మాంట్రియాల్‌ నగరాల్లో తెలంగాణ ప్రభుత్వ పెట్టుబడి అవకాశాలను కెనడాలో ప్రదర్శించే ప్రత్యేక రోడ్‌షో నిర్వహించడానికి ప్రాథమిక అంగీకారం కుదిరింది. తక్షణ ఒప్పందాలు కుదరనప్పటికీ, భవిష్యత్‌ భాగస్వామ్యానికి బలమైన పునాది ఈ సమావేశంతో ఏర్పడింది.

ఈ సమావేశంలో కెనడా ప్రతినిధులుగా కారెన్‌, కెనడా మినిస్టర్‌ ఎడ్‌ జాగర్‌, ట్రేడ్‌ కమిషనర్‌ విక్రమ్‌ జైన్‌ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తరఫున స్పెషల్‌ సీఎస్‌ జయేష్‌ రంజన్‌, విష్ణువర్ధన్‌ రెడ్డి, అజిత్‌ రెడ్డి తదితరులు హాజరయ్యారు.