Let's talk: editor@tmv.in
కెనడాలో భారతీయ యువతి హత్య.. నిందితుడి కోసం పోలీసుల గాలింపు

కెనడాలో భారతీయ యువతి హత్య.. నిందితుడి కోసం పోలీసుల గాలింపు

Shaik Mohammad Shaffee
25 డిసెంబర్, 2025

కెనడాలోని టొరంటో నగరంలో నివాసం ఉంటున్న 30 ఏళ్ల భారతీయ యువతి హిమాన్షి ఖురానా దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ ఘటన స్థానిక భారతీయ సమాజంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న భారతీయులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ హత్యకు సంబంధించి హిమాన్షికి అత్యంత సన్నిహితుడైన అబ్దుల్ గఫూరీ (32) అనే వ్యక్తిపై పోలీసులు ప్రధానంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అసలేం జరిగింది?

టొరంటో పోలీసుల కథనం ప్రకారం.. గత శుక్రవారం (డిసెంబర్ 19) రాత్రి హిమాన్షి ఖురానా కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శనివారం ఉదయం 6:30 గంటల సమయంలో టొరంటోలోని ఒక నివాసంలో ఆమెను విగతజీవిగా గుర్తించారు. ఆమె శరీరంపై తీవ్రమైన గాయాలు ఉండటంతో, దీనిని ఉద్దేశపూర్వకంగా జరిగిన హత్యగా పోలీసులు ధ్రువీకరించారు. ఈ మిస్సింగ్ కేసు టొరొంటోలోని స్ట్రాచన్ అవెన్యూ-వెల్లింగ్టన్ స్ట్రీట్ వెస్ట్ ప్రాంతానికి సంబంధించినదిగా నమోదు అయింది. కెనడా బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ కూడా ఈ విషయాన్ని నివేదించింది.

నిందితుడి కోసం గాలింపు

ఈ హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్న అబ్దుల్ గఫూరీ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. టొరంటో నివాసి అయిన ఇతడికి మృతురాలితో ముందే పరిచయం ఉందని పోలీసులు వెల్లడించారు. వీరిద్దరి మధ్య కొన్నాళ్లుగా సన్నిహిత సంబంధం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నిందితుడిని పట్టుకునేందుకు కెనడా పోలీసులు దేశవ్యాప్తంగా 'అరెస్ట్ వారెంట్' జారీ చేశారు.

భారత రాయబార కార్యాలయం దిగ్భ్రాంతి

ఈ విషాద ఘటనపై కెనడాలోని భారత కాన్సులేట్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. హిమాన్షి ఖురానా మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది. బాధిత కుటుంబానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామని, కెనడా పోలీసులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని భారత అధికారులు వెల్లడించారు.

కెనడాలో భారతీయ యువతి హత్య.. నిందితుడి కోసం పోలీసుల గాలింపు - Tholi Paluku