
కెనడాలో దారుణం.. భారత విద్యార్థిని కాల్చి చంపిన దుండగులు
కెనడాలోని టొరంటో నగరంలో జరిగిన కాల్పుల ఘటనలో 20 ఏళ్ల భారతీయ పీహెచ్‌డీ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన టొరంటో యూనివర్సిటీ స్కార్బరో క్యాంపస్ సమీపంలో చోటుచేసుకుంది. ఈ కేసును హత్యగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో హైలాండ్ క్రీక్ ట్రెయిల్, ఓల్డ్ కింగ్స్టన్ రోడ్ ప్రాంతంలో ఒక వ్యక్తి గాయాలతో నేలపై పడివున్నాడని పోలీసులకు సమాచారం అందింది. అక్కడికి చేరుకున్న పోలీసులు, తుపాకీ గాయం అయిన వ్యక్తిని గుర్తించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడిని శివాంక్ అవస్థీగా పోలీసులు గుర్తించారు. శివాంక్ భారతదేశానికి చెందిన డాక్టోరల్ (పీహెచ్‌డీ) విద్యార్థి అని కెనడియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ తెలిపింది. ఈ ఘటనను పోలీసులు హత్యగా పరిగణిస్తూ దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనపై టొరంటో పోలీస్ డ్యూటీ ఇన్‌స్పెక్టర్ జెఫ్ ఆలింగ్టన్ మాట్లాడుతూ, “మా ప్రధాన లక్ష్యం సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరించడం, ఏం జరిగిందో తెలుసుకోవడం, మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడం. ఈ కారణంగా ప్రస్తుతం ఎక్కువ వివరాలు వెల్లడించలేము” అని చెప్పారు. కాల్పుల తర్వాత అనుమానితుడు అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇప్పటివరకు నిందితుడి వివరాలు లేదా గుర్తింపు సమాచారం విడుదల చేయలేదు.
ఇదిలా ఉండగా, టొరంటోలోని భారత కాన్సులేట్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. “టొరంటో యూనివర్సిటీ స్కార్బరో క్యాంపస్ సమీపంలో జరిగిన కాల్పుల్లో భారతీయ పీహెచ్‌డీ విద్యార్థి శివాంక్ అవస్థీ మృతి చెందడం ఎంతో బాధాకరం. ఈ కఠిన సమయంలో మృతుడి కుటుంబ సభ్యులతో మేము సంప్రదింపులో ఉన్నాం. స్థానిక అధికారులతో కలిసి అవసరమైన అన్ని సహాయాలు అందిస్తున్నాం” అని కాన్సులేట్ ‘ఎక్స్’ (ట్విట్టర్)లో పేర్కొంది.
టొరంటో యూనివర్సిటీ యాజమాన్యం కూడా ఈ ఘటనపై స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తమ క్యాంపస్ సమీపంలో ఇలా ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని పేర్కొంది. అయితే, చనిపోయిన వ్యక్తి తమ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థేనా? కాదా? అనే విషయాన్ని మాత్రం ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని యూనివర్సిటీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
భద్రతా కారణాల దృష్ట్యా యూనివర్సిటీ యాజమాన్యం సేఫ్టీ అలర్ట్ జారీ చేసింది. క్యాంపస్ భవనాల్లో ఉన్నవారు లోపలే ఉండాలని, బయట ఉన్నవారు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టాలని సూచించింది. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్న హైలాండ్ క్రీక్ వ్యాలీ ప్రాంతానికి వెళ్లవద్దని కూడా హెచ్చరించింది.
కాగా ఈ ఘటనతో కెనడాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల భద్రతపై మరోసారి భయాందోళనలు మొదలయ్యాయి. అసలు అక్కడ విద్యార్థులు క్షేమంగా ఉన్నారా? లేదా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ వేగంగా జరుగుతోందని, కాల్పులు జరిపి పారిపోయిన నిందితుడి వివరాలను త్వరలోనే బయటపెడతామని పోలీసులు చెబుతున్నారు.
భారత ప్రభుత్వం విడుదల చేసిన అంతర్జాతీయ విద్యార్థుల గణాంకాల ప్రకారం.. విదేశాల్లో భారతీయ విద్యార్థుల భద్రతపై ఆందోళనకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత ఐదేళ్లలో మొత్తం 633 మంది భారతీయ విద్యార్థులు వివిధ దేశాల్లో ప్రాణాలు కోల్పోగా, అందులో ఒక్క కెనడాలోనే అత్యధికంగా 172 మంది మరణించడం గమనార్హం. మరీ ముఖ్యంగా, కెనడాలో చనిపోయిన వారిలో 19 మంది హింసాత్మక ఘటనల (దాడులు, హత్యలు) వల్లే మరణించినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.
