
కెనడాలో అమెరికా కాన్సులేట్‌పై కాల్పులు
కెనడాలోని టొరంటో నగరంలో ఉన్న అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయం వద్ద మంగళవారం తెల్లవారుజామున తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. గుర్తుతెలియని దుండగులు కాన్సులేట్ భవనాన్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ ఘటనలో భవనం దెబ్బతిన్నప్పటికీ, అదృష్టవశాత్తూ ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని టొరంటో పోలీసులు వెల్లడించారు.
ఏం జరిగిందంటే?
పోలీసుల కథనం మేరకు.. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం సుమారు 5:29 గంటల సమయంలో ఒక తెల్లటి కారు యూనివర్సిటీ అవెన్యూ వద్దకు చేరుకుంది. డండాస్ స్ట్రీట్ వెస్ట్ నుంచి వచ్చిన ఆ కారు కాన్సులేట్ ముందు ఆగింది. అందులో నుంచి ఇద్దరు వ్యక్తులు కిందకు దిగి, భవనం వైపు గురిపెట్టి వరుసగా కాల్పులు జరిపారు. అనంతరం వారు వేగంగా అదే వాహనంలో అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అక్కడ బుల్లెట్ ఆనవాళ్లను, ఖాళీ తూటాలను స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల ధాటికి కాన్సులేట్ ప్రధాన ద్వారం, కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఘటన జరిగిన సమయంలో భవనం లోపల కొందరు ఉన్నప్పటికీ ఎవరికీ ప్రమాదం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.
తీవ్రంగా ఖండించిన కెనడా ప్రధాని
టొరంటోలో అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయంపై జరిగిన తుపాకీ కాల్పుల ఘటనపై ఆ దేశ ప్రధానమంత్రి మార్క్ కార్నీ తీవ్రంగా స్పందించారు. ఈ దాడిని హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. బెదిరింపులకు పాల్పడేందుకే దుండగులు ఇలాంటి దుశ్చర్యకు ఒడిగట్టారని, దీనిని తాము ఏమాత్రం సహించబోమని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ కాల్పుల ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడం ఊపిరిపీల్చుకునే విషయమని ప్రధాని 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు.
బెదిరింపులకు లొంగం: అమెరికా రాయబారి
ఈ దాడిని కెనడా ప్రధాని మార్క్ కార్నీ, అంటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డ్ తీవ్రంగా ఖండించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రభుత్వం అన్ని వనరులను వినియోగిస్తుందని, వారిని చట్టం ముందు నిలబెడతామని ప్రధాని హామీ ఇచ్చారు. అమెరికా రాయబారి పీట్ హోక్స్‌త్రా స్పందిస్తూ.. ఈ ఘటన తీవ్ర ఆందోళన కలిగించిందని, అయితే ఇలాంటి బెదిరింపులకు తాము భయపడేది లేదని, తమ పని కొనసాగుతుందని స్పష్టం చేశారు. యూదు కమ్యూనిటీ ఎలాంటి భయం లేకుండా వారి సంస్కృతిని అనుసరించే హక్కు ఉందని టొరంటో మేయర్ ఒలివియా చౌ పేర్కొన్నారు.
విచారణ వేగవంతం
ప్రస్తుతం టొరంటో పోలీసులు, రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (ఆర్‌సీఎంపీ) చాలా సీరియస్‌గా తీసుకుని కలిసి దర్యాప్తు చేస్తున్నాయి.. ఘటనా స్థలంలోని సీసీటీవీ దృశ్యాలను విశ్లేషించడంతో పాటు, నిందితులు ప్రయాణించిన కారు ఫోటోను విడుదల చేశారు. ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉంటే సమాచారం అందించాలని కోరారు.
యుద్ధం నీడలో ఉద్రిక్తతలు..
ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఈ దాడి జరగడం గమనార్హం. గత వారాంతంలో టొరంటో ప్రాంతంలోని రెండు యూదు ప్రార్థనా మందిరాలపై (సినగాగ్స్) కూడా కాల్పులు జరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఒట్టావాలోని రాయబార కార్యాలయాలు, టొరంటోలోని అమెరికా, ఇజ్రాయెల్ కాన్సులేట్‌ల వద్ద భద్రతను భారీగా పెంచినట్లు ఆర్‌సీఎంపీ చీఫ్ సూపరింటెండెంట్ క్రిస్ లెదర్ తెలిపారు. టొరంటోలో ఇరాన్ సంతతి జనాభా ఎక్కువగా ఉండటం, ఇరాన్ యుద్ధానికి వ్యతిరేకంగా, మద్దతుగా కాన్సులేట్ ముందు నిరసనలు జరుగుతుండటం కూడా దర్యాప్తులో కీలకంగా మారింది.
