
కెనడాకు ‘బోర్డ్ ఆఫ్ పీస్’ ఆహ్వానం ఉపసంహరణ
ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను నిలిపివేసి, శాంతిని నెలకొల్పే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘బోర్డ్ ఆఫ్ పీస్’ (శాంతి మండలి) నుంచి కెనడాకు అవమానం ఎదురైంది. ఆ దేశానికి ఇచ్చిన ఆహ్వానాన్ని ట్రంప్ వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీని ఉద్దేశించి ట్రంప్ అత్యంత కటువుగా ఒక లేఖ రాస్తూ, దానిని తన 'ట్రూత్ సోషల్' వేదికగా పంచుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ కూటమిలో కెనడాకు చోటు లేదని ఆయన స్పష్టం చేశారు.
ఆ లేఖలో ఏముందంటే?
"డియర్ ప్రైమ్ మినిస్టర్ కార్నీ.. అత్యంత శక్తివంతమైన నాయకులతో కొలువుదీరబోతున్న ఈ ప్రతిష్టాత్మక బోర్డ్ ఆఫ్ పీస్‌లో చేరాల్సిందిగా కెనడాకు ఇచ్చిన ఆహ్వానాన్ని ఉపసంహరించుకుంటున్నాం. దీనిని అధికారిక సమాచారంగా పరిగణించండి" అంటూ ట్రంప్ తనదైన శైలిలో లేఖను ముగించారు. గురువారం దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఈ శాంతి మండలి ఛార్టర్‌పై సంతకం చేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
వివాదానికి కారణం ఇదే..
దావోస్ సదస్సులో కెనడా ప్రధాని మార్క్ కార్నీ చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి మూలమని తెలుస్తోంది. అంతర్జాతీయ వ్యవస్థలో నిబంధనల కంటే అగ్రరాజ్యాల ఆధిపత్యం పెరిగిపోతోందని, వాణిజ్యాన్ని ఆయుధంగా మార్చుకోవడం (గ్రీన్‌లాండ్ విషయంలో అమెరికా వైఖరిని ఉద్దేశించి) సరికాదని కార్నీ పరోక్షంగా విమర్శించారు. దీనిపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. "కెనడాకు అమెరికా ఎన్నో ఉచిత ప్రయోజనాలను కల్పిస్తోంది. మా వల్ల వాళ్లు మనుగడ సాగిస్తున్నారు. మా రక్షణ కవచం (గోల్డెన్ డోమ్) కింద ఉంటూ మాకే ఎదురుచెబుతారా? మార్క్.. గుర్తుపెట్టుకో, నువ్వు మాట్లాడే ముందు అమెరికా చేస్తున్న సాయాన్ని స్మరించుకో" అంటూ ట్రంప్ విరుచుకుపడ్డారు.
ఏమిటీ ‘బోర్డ్ ఆఫ్ పీస్’?
గతేడాది సెప్టెంబర్‌లో గాజా యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో ట్రంప్ ప్రతిపాదించిన ‘20 పాయింట్ల శాంతి ప్రణాళిక’లో భాగంగా ఈ ‘బోర్డ్ ఆఫ్ పీస్’ ఆవిర్భవించింది. తొలుత గాజా పునర్నిర్మాణం, స్థిరత్వం కోసం ఉద్దేశించినప్పటికీ, ప్రస్తుతం దీని పరిధిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఘర్షణల పరిష్కారానికి విస్తరించారు. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సహా ప్రస్తుతం కొనసాగుతున్న 8 ప్రధాన యుద్ధాలను నివారించడమే ఈ మండలి ప్రధాన లక్ష్యం. ఈ ప్రతిష్టాత్మక బోర్డులో చేరాల్సిందిగా మొత్తం 60 దేశాలకు ఆహ్వానాలు పంపగా, ఇప్పటికే 35 దేశాలు తమ సంసిద్ధతను వ్యక్తం చేశాయి. భవిష్యత్తులో ఐక్యరాజ్యసమితి నిర్వహించే కీలక బాధ్యతలను సైతం ఈ మండలే స్వీకరిస్తుందని, ఇది అంతర్జాతీయ శాంతికి కొత్త చిరునామాగా మారుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచం ఇప్పుడు ప్రశాంతం..
సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ.. "ఒకప్పుడు ప్రపంచం యుద్ధ జ్వాలలతో తగలబడిపోతూ ఉండేది, కానీ ఇప్పుడు పరిస్థితులు చక్కబడుతున్నాయి. మేం అనేక యుద్ధాలను ముగింపు దశకు తీసుకువచ్చాం. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా శాంతిని చూస్తారు" అని ధీమా వ్యక్తం చేశారు. అయితే పొరుగు దేశమైన కెనడాతో ఇలాంటి ఘర్షణ వాతావరణం నెలకొనడం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో చర్చనీయాంశమైంది.
