
కృష్ణా జిల్లాలో 3.1 కిలోల గంజాయి స్వాధీనం
కృష్ణా జిల్లాలో మాదకద్రవ్యాల రవాణాపై పోలీసులు చర్యలు కఠినతరం చేశారు. ఇటీవల జిల్లాలో పలుచోట్ల గంజాయి రవాణా కేసులు వరుసగా వెలుగుచూస్తుండటంతో, గుడివాడ రూరల్ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం కౌతవరం రైల్వే స్టేషన్ సమీపంలో దాడి నిర్వహించి, తొమ్మిది మంది యువకులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 3.1 కిలోల గంజాయి, ఒక మోటార్ సైకిల్, 9 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
గుడివాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్.ఎల్.ఆర్. సోమేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం అరెస్టు వారు డోకిపర్రు గ్రామానికి చెందిన యువకులే. వీరంతా గంజాయి వ్యసనంతో పాటు తక్కువ ధరకు మాదకద్రవ్యాలు కొనుగోలు చేసి స్థానికంగా విక్రయించే ప్రయత్నాల్లో ఉన్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. అంతేకాక బయట రాష్ట్రాల వ్యక్తులతో పరిచయాలు పెంచుకొని గంజాయి సరఫరాకు పాల్పడుతున్నట్టు పోలీసులకు ముందే సమాచారం రావడంతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు.
ఈ ఘటనపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ చట్టం కింద కేసులు నమోదు చేసి, సరఫరా లింకులు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ముఠాలతో సంబంధాలు వంటి అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
కృష్ణా జిల్లాలో ఇటీవల నెలల్లో గంజాయి రవాణా ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. కొంతకాలం క్రితం గుడివాడ అర్బన్ పరిధిలో బస్టాండ్ వద్ద జరిగిన చెకింగ్‌లో పోలీసులు రెండు కిలోలకుపైగా గంజాయి స్వాధీనం చేశారు. మచిలీపట్నం తీరప్రాంతంలో అక్రమ రవాణా ముఠా నుండి పలువురిని అదుపులోకి తీసుకున్న ఘటన కూడా పోలీసు రికార్డులో నమోదు అయింది. మరోవైపు కైకాలూరు–ఎలూరు రూట్‌లో ప్రయాణిస్తున్న ఓ కారులో భారీగా గంజాయి దొరకడం పెద్ద చర్చనీయాంశమైంది. యువతలో పెరుగుతున్న వ్యసనం, గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి సులభంగా అందుబాటులోకి రావడం కారణంగా జిల్లాలో మాదకద్రవ్యాల సమస్య మరింత తీవ్రతరం అవుతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గంజాయి సరఫరా నెట్‌వర్క్‌పై కట్టడి చేసేందుకు పలు ప్రాంతాల్లో ప్రత్యేక మాదక ద్రవ్య నిర్మూలన బృందాలను ఏర్పాటు చేసి పోలీసులు నిఘాను మరింత పెంచారు.
