Let's talk: editor@tmv.in
కృష్ణా జలాల దోపిడీలో చంద్రబాబు మౌనం.. రాయలసీమకు శాపం: వైఎస్ఆర్‌సీపీ
కృష్ణా జలాల దోపిడీలో చంద్రబాబు మౌనం.. రాయలసీమకు శాపం: వైఎస్ఆర్‌సీపీ

కృష్ణా జలాల దోపిడీలో చంద్రబాబు మౌనం.. రాయలసీమకు శాపం: వైఎస్ఆర్‌సీపీ

Dantu Vijaya Lakshmi Prasanna
9 ఏప్రిల్, 2026

కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ ఒక్క చుక్క నీటిని కూడా కేటాయించకపోయినా, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు నోటిఫై అయ్యి ఇంకా అమలులోకి రాకపోయినా, కర్ణాటక ప్రభుత్వం అత్యంత అక్రమంగా అప్పర్ భద్ర ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోందని వైఎస్ఆర్‌సీపీ ఆరోపించింది. సుమారు 29.9 టీఎంసీల నీటిని మళ్లించి 5.57 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో సాగుతున్న ఈ ప్రాజెక్టుపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం కనీసం అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం తెలుగు రాష్ట్రాల రైతాంగానికి గొడ్డలిపెట్టుగా మారిందని ఆ పార్టీ పేర్కొంది.

రాయలసీమ జీవనాడి అయిన హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, కేసీ కెనాల్ ఆయకట్టును పూర్తిగా ఎడారిగా మార్చే ఈ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కర్ణాటకకు దాసోహమంటోందని, రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నట్లుగా చంద్రబాబు వ్యవహారం ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయని వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన న్యాయపోరాటం

గతంలో, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పరిరక్షణే ఏకైక ధ్యేయంగా అప్పర్ భద్ర ప్రాజెక్టును ప్రతి వేదికపై తీవ్రంగా వ్యతిరేకించింది. 2020లో కేంద్ర జలసంఘం, దిగువ రాష్ట్రాల అభిప్రాయం తీసుకోకుండానే సాంకేతిక అనుమతులు మంజూరు చేసినప్పుడు, జగన్ ప్రభుత్వం తక్షణమే స్పందించి తీవ్రమైన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ లేఖలు రాసిందని ఈ పోస్ట్ లో పేర్కొన్నారు.

అంతటితో ఆగకుండా, 2023 ఫిబ్రవరి 7న సుప్రీంకోర్టులో ప్రత్యేక లీవ్ పిటిషన్ దాఖలు చేసి, ఈ అక్రమ ప్రాజెక్టును తక్షణమే నిలుపుదల చేయాలని జగన్ ప్రభుత్వం డిమాండ్ చేసిందని, న్యాయపరంగా రాష్ట్రం బలమైన వాదనలు వినిపిస్తున్న తరుణంలో, అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ కేంద్రం వద్ద నోరు మెదపకపోవడం వెనుక ఉన్న చీకటి ఒప్పందాలేమిటని ప్రతిపక్ష నాయకులు సూటిగా ప్రశ్నిస్తున్నారు.

అంచనా వ్యయం భారీ పెంపు.. కేంద్రం ఉదారత వెనుక మర్మం

మరోవైపు, కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు అధ్యక్షతన సమావేశమైన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ, అప్పర్ భద్ర ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయాన్ని ఏకంగా రూ. 21,167.93 కోట్లుగా ఆమోదించింది. సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉన్నప్పటికీ, కేంద్రం నిధులు కేటాయించడం, ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడం వెనుక కర్ణాటక రాజకీయ ప్రయోజనాలే ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.

ఒకవైపు మన ప్రాజెక్టులకు నిధులు రాక అల్లాడుతుంటే, రాష్ట్రానికి తీరని నష్టం చేసే అప్పర్ భద్రకు జాతీయ హోదా కల్పించి వేల కోట్లు విడుదల చేస్తున్నా, చంద్రబాబు ప్రభుత్వం మౌనంగా ఉండటం రాష్ట్ర రైతులకు చేస్తున్న ఘోరమైన ద్రోహమని సాగునీటి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయని వైఎస్ఆర్‌సీపీ తీవ్రంగా ఆరోపణలు గుప్పించింది.

అక్రమ నీటి తరలింపు వెనుక కర్ణాటక 'దోపిడీ' లెక్కలు

తుంగభద్ర డ్యామ్ ఎగువ ప్రాంతంలో కర్ణాటక 295 టీఎంసీలకు మించి నీటిని వాడుకోకూడదని స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. అయితే, ఇప్పటికే వారు 319.558 టీఎంసీలకు పైగా జలాలను వినియోగిస్తున్నట్లు కేడబ్ల్యూడీటీ -2 స్వయంగా తేల్చింది. అంటే ఇప్పటికే వారు నిర్దేశించిన పరిమితికి మించి నీటిని దోచుకుంటున్నారు. ఇప్పుడు విజయనగర ఛానళ్లు, తుంగ, భద్ర ఆనకట్టల ఆధునీకరణ పేరుతో 'మిగులు' జలాలు దొరికాయంటూ కొత్త నాటకానికి తెరలేపారు. వాస్తవానికి అప్పర్ భద్ర ద్వారా 29.9 టీఎంసీలే తరలిస్తామని కాగితాలపై చెబుతున్నప్పటికీ, నిర్మాణాల సామర్థ్యం చూస్తే కనీసం 58 టీఎంసీల వరకు మళ్లించేలా భారీ ఎత్తున పనులు చేపట్టారని నిపుణులు ఆధారాలతో సహా హెచ్చరిస్తున్నారని వైఎస్ఆర్‌సీపీ పేర్కొంది.

పాత పాపాలే శాపాలు - 2015 నాటి నిర్లక్ష్యానికి కొనసాగింపు

2015లో కర్ణాటక ఈ అక్రమ ప్రాజెక్టు పనులు ప్రారంభించినప్పుడు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కళ్లు మూసుకుని కూర్చుంది. ఆనాడు చంద్రబాబు చూపిన నిర్లక్ష్యం కారణంగానే 2019 నాటికే కర్ణాటక రూ. 4,830 కోట్లు ఖర్చు చేసి ఎత్తిపోతల పథకాలు, ప్రధాన కాలువల పనులు పూర్తి చేయగలిగింది.

అప్పర్ తుంగ నుంచి భద్రకు, అక్కడి నుంచి వాణివిలాస రిజర్వాయర్‌కు ఇప్పటికే గణనీయమైన మొత్తంలో నీటిని అక్రమంగా తరలిస్తున్నారు. గతంలో చేసిన అదే తప్పును ఇప్పుడు మళ్లీ పునరావృతం చేస్తూ, జాతీయ హోదా విషయంలోనూ రాష్ట్ర హక్కులను బాబు సర్కార్ కర్ణాటకకు తాకట్టు పెట్టిందని వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాయలసీమకు ముంచుకొస్తున్న ఎడారి ముప్పు

అప్పర్ భద్ర ప్రాజెక్టు గనుక పూర్తయితే తుంగభద్ర డ్యామ్‌కు, తద్వారా శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చే వరద ప్రవాహం భారీగా తగ్గిపోతుంది. దీనివల్ల రాయలసీమలోని 7.09 లక్షల ఎకరాల ఆయకట్టు సాగునీరు అందక బీడు భూములుగా మారడం ఖాయం. హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, కేసీ కెనాల్ కింద ఆధారపడిన రైతాంగం వీధిన పడటమే కాకుండా, తాగునీటి ఎద్దడి కూడా ఊహించని రీతిలో పెరుగుతుందని, కేవలం సీమకే కాకుండా, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లపై ఆధారపడిన ప్రాజెక్టులతో పాటు కృష్ణా డెల్టా రైతులకు కూడా ఈ ప్రాజెక్టు మరణశాసనం కానుందని వైఎస్ఆర్‌సీపీ ఆరోపించింది.

రాజకీయ మౌనం.. రాష్ట్ర ప్రయోజనాలకు శాపం

కేంద్ర ప్రభుత్వం 2023-24 బడ్జెట్‌లో అప్పర్ భద్రకు ఏకంగా రూ. 5,300 కోట్లు కేటాయించి జాతీయ హోదాను స్థిరీకరించింది. ఏ ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వాలంటే ఆ బేసిన్ లోని ఇతర రాష్ట్రాల అంగీకారం తప్పనిసరని కేంద్ర మార్గదర్శకాలే చెబుతున్నా, ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలను కేంద్రం బేఖాతరు చేసింది. ప్రస్తుతం కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్న చంద్రబాబు నాయుడు, అప్పర్ భద్రకు నిధులు నిలుపుదల చేయాలని ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని వైఎస్సార్‌సీపీ ప్రశ్నిస్తోంది. మరోవైపు ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు ద్వారా 130 టీఎంసీల మళ్లింపునకు కర్ణాటక శరవేగంగా అడుగులు వేస్తున్నా, బాబు సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయం అని వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు.

కృష్ణా నదీ జలాలపై ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులను కాపాడాల్సిన బాధ్యతను ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. అప్పర్ భద్ర ప్రాజెక్టు కేవలం పొరుగు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించింది కాదు, అది ఆంధ్రప్రదేశ్ మనుగడకు, ముఖ్యంగా రాయలసీమ ఉనికికి సంబంధించిన సమస్య. సాగునీటి రంగ నిపుణులు, రైతులు గొంతు ఎత్తుతున్నా ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్ తరాలు తీవ్రమైన జల సంక్షోభంలో కూరుకుపోతాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రారంభించిన న్యాయపోరాటాన్ని నీరుగార్చి, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న చంద్రబాబు వైఖరిని రైతాంగం ఎన్నటికీ క్షమించదు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని అక్రమ ప్రాజెక్టులపై గళమెత్తాలని వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చింది