
కృష్ణా జలాల్లో కాంగ్రెస్ ద్రోహం: మాజీ మంత్రి హరీష్ రావు
కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును, చేస్తున్న అన్యాయాలను ఎండగడుతూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తెలంగాణ భవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. "నదీ జలాలు - కాంగ్రెస్ ద్రోహాలు" అనే అంశంపై సాగిన ఈ ప్రజెంటేషన్ ద్వారా కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న విద్రోహాన్ని గణాంకాలతో సహా వివరించారు.
అసెంబ్లీలో భయం.. ప్రజా క్షేత్రంలో యుద్ధం!
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ, అసెంబ్లీలో తమ పీపీటీ ప్రజెంటేషన్‌కు అవకాశం ఇవ్వకపోవడంపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తాము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటే, కాంగ్రెస్ బండారం బయటపడుతుందనే భయంతో ఆ అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. అయినా తాము ఊరుకోబోమని, కృష్ణా జలాల్లో కాంగ్రెస్ చేస్తున్న అన్యాయాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో మరో జలపోరాటానికి శ్రీకారం చుడతామని హరీష్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పాలనలోనే కృష్ణా జలాల్లో అత్యల్ప నీటి వినియోగం జరిగిందని హరీష్ రావు తెలిపారు. అసలు కృష్ణా జలాల్లో తెలంగాణకు ఎంత వాటా ఉందన్న విషయంపై కాంగ్రెస్ నేతలకు అవగాహన లేదని ఆయన విమర్శించారు. అలాంటి వారు తెలంగాణ హక్కులను ఎలా కాపాడతారని ప్రశ్నించారు.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్: మాటలు వర్సెస్ వాస్తవాలు
ఎస్‌ఎల్‌బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉద్దెర మాటలు మాట్లాడుతున్నారని హరీష్ రావు ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏడేళ్ల పాలనలో ఎస్‌ఎల్‌బీసీ కోసం రూ.1,358 కోట్లు ఖర్చు చేసి 11.5 కిలోమీటర్ల మేర టన్నెల్ తవ్వామని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో కేవలం రూ.195 కోట్లు ఖర్చు చేసి కేవలం 18 మీటర్లు మాత్రమే తవ్విందని ఆరోపించారు. ఇంత పని చేసి కూడా బీఆర్‌ఎస్‌ను విమర్శించే అర్హత కాంగ్రెస్‌కు లేదన్నారు.
కొడంగల్ ప్రజలకే రేవంత్ ద్రోహం!
రేవంత్ రెడ్డి కమీషన్ల కోసం ఆశపడి, సొంత నియోజకవర్గమైన కొడంగల్ ప్రజలకే ద్రోహం చేస్తున్నారని హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. కరివెన, ఉద్దండాపూర్ నుంచి కాలువ తవ్వితే కొడంగల్‌లో 63 వేల ఎకరాలకు నీళ్లు అందే అవకాశం ఉందని, కానీ మూడు లిఫ్టులు ఏర్పాటు చేసి కేవలం 53 వేల ఎకరాలకే నీళ్లు ఇస్తామని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. నిజంగా రైతులకు నీళ్లు అందించడమే ప్రాధాన్యతనా, లేక కమీషన్లే లక్ష్యమా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
కేసీఆర్‌పై చేస్తున్న ఆరోపణలను హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమించిన కేసీఆర్ నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తాడంటే ఎవరూ నమ్మరన్నారు. సెక్షన్-3 సాధన కోసం కేంద్రానికి కేసీఆర్ 32 లేఖలు రాశారని గుర్తు చేశారు. ప్రధానమంత్రికి లేఖలు రాయడమే కాకుండా, ఫస్ట్ అఫెక్స్, సెకండ్ అఫెక్స్‌లలో వాదించి, చివరకు సుప్రీంకోర్టుకు వెళ్లి సెక్షన్-3 సాధించారని ఆయన వివరించారు. అందుకే నేడు ట్రిబ్యునల్ ముందు తెలంగాణ తన వాదనను బలంగా వినిపించగలుగుతోందన్నారు.
తెలంగాణ రాష్ట్రం సాధించడం ద్వారా కేసీఆర్ ఎంత మేలు చేశారో, అదే విధంగా కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోసం సెక్షన్-3 సాధించడం ద్వారా కూడా అంతే మేలు చేశారని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో తెలంగాణకు చేసిన ద్రోహాలను గుర్తు చేస్తూ, నాడు రాష్ట్రాన్ని కలిపింది కాంగ్రెస్, తెలంగాణ విద్యార్థులు, యువకుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నదీ కాంగ్రెస్ అని విమర్శించారు. అనేక ప్రాజెక్టులను రద్దు చేసి అభివృద్ధిని అడ్డుకున్నదీ కాంగ్రెస్ పార్టీనేనని వ్యాఖ్యానించారు.
తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్
రాష్ట్ర విభజన సమయంలో కూడా పాలమూరు, రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు కాంగ్రెస్ తీవ్ర ద్రోహం చేసిందని ఆయన ఆరోపించారు. నాడైనా నేడైనా తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్ పార్టీయేనని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
చివరగా, అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడి శాసనసభ వ్యవస్థను తప్పుదారి పట్టిస్తున్న రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తెలంగాణ ప్రజలు నిజాలను గుర్తించి కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని హరీష్ రావు హెచ్చరించారు. తప్పుడు వాదనలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. తెలంగాణ నీటి హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ మరో చారిత్రాత్మక పోరాటానికి సిద్ధమవుతోందని ఈ పీపీటీ ద్వారా సందేశం ఇచ్చారు.
