Let's talk: editor@tmv.in
కృష్ణా జలాలపై ఏపీ హక్కులు కాపాడాలి: సీఎం చంద్రబాబుకు జగన్ లేఖ

కృష్ణా జలాలపై ఏపీ హక్కులు కాపాడాలి: సీఎం చంద్రబాబుకు జగన్ లేఖ

Shaik Mohammad Shaffee
22 నవంబర్, 2025

కృష్ణా నదీ జలాల పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని కోరుతూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తొమ్మిది పేజీల బహిరంగ లేఖ రాశారు. కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్-II ముందు త్వరలో కీలక విచారణలు రానున్న నేపథ్యంలో రాష్ట్రం చిత్తశుద్ధితో పోరాడాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణ డిమాండ్‌తో ఏపీకి అన్యాయం

కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న భారీ డిమాండ్‌పై జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదిలో తమకు 763 టీఎంసీల ఆధారపడదగిన నీటిని కేటాయించాలని ట్రైబ్యునల్‌ను కోరుతోంది. ఒకవేళ ట్రైబ్యునల్ ఈ డిమాండ్‌కు అంగీకరిస్తే, ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరుగుతుందని జగన్ హెచ్చరించారు. బచావత్ ట్రైబ్యునల ప్రకారం, ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల్లో నికరంగా 512 టీఎంసీలు కేటాయించారు. "ఈ 512 టీఎంసీలలో ఒక్క టీఎంసీ నీరు తగ్గినా, దానికి టీడీపీ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి" అని ఆయన స్పష్టం చేశారు.

జగన్ మోహన్ రెడ్డి తన లేఖలో గతంలో జరిగిన కొన్ని కీలక పరిణామాలను ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడుపై తీవ్ర ఆరోపణలు చేశారు. 1996లో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచే పనులు ప్రారంభించింది. అప్పుడు రైతులు, ప్రతిపక్షాలు ఆందోళన చేసినా చంద్రబాబు పట్టించుకోలేదని ఆరోపించారు. చంద్రబాబు నాటి వైఖరి కారణంగానే, బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కర్ణాటకకు డ్యామ్ ఎత్తు పెంచడానికి అనుమతి ఇచ్చింది. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం కూడా డ్యామ్ ఎత్తు పెంపునకు భూసేకరణకు అనుమతి ఇస్తూ చురుకుగా వ్యవహరిస్తోందని గుర్తు చేశారు.

2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు, ముఖ్యంగా ‘ఓటుకు నోటు’ కేసు నుంచి బయటపడడానికి కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణకు వదులుకుందని, పులిచింతల, నాగార్జునసాగర్ కుడి కాలువ వంటి ప్రాజెక్టుల నిర్వహణలో అన్యాయం జరిగినా మౌనంగా ఉందని జగన్ ఆరోపించారు. రాయలసీమ ప్రాజెక్టుల (హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలిగొండ, తెలుగుగంగ) పట్ల టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఈ ప్రాజెక్టులకు సంబంధించిన వాదనలు ట్రైబ్యునల్ ముందు బలహీనంగా వినిపిస్తున్నారని విమర్శించారు.

"రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మీరు రాజీ పడతారన్న అభిప్రాయం అందరిలో బలంగా వ్యక్తమవుతోంది" అని జగన్ పేర్కొన్నారు. అందుకే ఈ కీలక తరుణంలో టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్రం పట్ల నిబద్ధతతో వ్యవహరించి, కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్-II ముందు బలమైన వాదనలు వినిపించాలని, రాయలసీమతో సహా రాష్ట్రంలోని తాగు, సాగునీటి అవసరాలు తీరేలా కృష్ణా జలాలపై మన హక్కును కాపాడాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు.

కృష్ణా జలాలపై ఏపీ హక్కులు కాపాడాలి: సీఎం చంద్రబాబుకు జగన్ లేఖ - Tholi Paluku