
కృష్ణా జలద్రోహి బీఆర్ఎస్: మంత్రి ఉత్తమ్
తెలంగాణ రాష్ట్రం తన నదీ జల హక్కులను సద్వినియోగం చేసుకునే ప్రయత్నాలు విఫలమవడానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన రెండు “చారిత్రక తప్పిదాలే” కారణమని నీటిపారుదల, పౌర సరఫరాల మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. ఈ నిర్ణయాలను ఆయన పసిపిల్ల రాష్ట్రానికి ఆత్మహత్యాసదృశమైన చర్యలుగా అభివర్ణించారు. శాసనసభలో నదీ జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ, బీఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాలు తెలంగాణ నీటి హక్కులపై ఎలా ఘోర ప్రభావం చూపాయో వివరించారు.
2013 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేపట్టారు. దాన్ని శ్రీశైలంకి మార్చి తెలంగాణకు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై గత ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించిందని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించిన ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టుల ఆఫ్‌టేక్ పాయింట్లను బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మార్చిందని ఆయన ఆరోపించారు. పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ జూరాల ప్రాజెక్ట్ ఎగువన నుంచి నీటిని తీసుకునేలా రూపొందించగా, దానిని శ్రీశైలం రిజర్వాయర్‌కు మార్చారని మంత్రి తెలిపారు. అదే విధంగా, గోదావరి జలాలను తుమ్మిడిహట్టి వద్ద వినియోగించాల్సిన ప్రణహిత, చెవెళ్ల ప్రాజెక్ట్‌ను మేడిగడ్డకు మార్చడం వల్ల తీవ్ర నష్టం జరిగిందని చెప్పారు. ఈ రెండు మార్పులూ పూర్తిగా ప్రతికూల ఫలితాలనే ఇచ్చాయని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ముద్రను తుడిచిపెట్టడానికే ఈ మార్పులు చేశారని, దాని ఫలితంగా తెలంగాణ రాష్ట్రం నీటి కొరతతో, ఆర్థికంగా నష్టపోయిందని ఉత్తమ్ విమర్శించారు. బీఆర్‌ఎస్ పాలనలో రూ.1.83 లక్షల కోట్లకు పైగా నీటిపారుదలపై ఖర్చు చేసినా, రాష్ట్రానికి ఎలాంటి స్పష్టమైన ప్రయోజనం దక్కలేదని అన్నారు. 11–11.5 శాతం అధిక వడ్డీతో తీసుకున్న అప్పులు భవిష్యత్ తరాలపై భారంగా మారాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని తక్కువ వడ్డీ రుణాలుగా మార్చి ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని కాపాడిందని ఆయన తెలిపారు.
పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను ఆయన బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన ద్రోహానికి ప్రతీకగా అభివర్ణించారు. జూరాల వద్దే ఇన్‌టేక్ కొనసాగి ఉంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం వచ్చేదని, కానీ డీపీఆర్‌ను 2022లో సీడబ్ల్యూసీకి సమర్పించే నాటికి వ్యయం రూ.32 వేల కోట్ల నుంచి రూ.55 వేల కోట్లకు పెరిగిందని చెప్పారు. ప్రాజెక్ట్ పూర్తి అయితే ఖర్చు రూ.80–84 వేల కోట్లకు చేరుతుందని హెచ్చరించారు. 90 శాతం పూర్తి చేశామని బీఆర్‌ఎస్ చేసిన వాదనలను నిజమైన మోసంగా అభివర్ణిస్తూ, ఇప్పటివరకు ఒక్క ఎకరాకూ సాగునీరు అందలేదని, 39 వేల ఎకరాల భూసేకరణ ఇంకా పెండింగ్‌లో ఉందని మంత్రి తెలిపారు.
ప్రణహిత, చెవెళ్ల ప్రాజెక్ట్‌ను కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లో భాగంగా మార్చి మేడిగడ్డ వద్ద ఇన్‌టేక్ పెట్టడం వల్ల మూడు బ్యారేజీలు మరమ్మతుల్లోనే ఉండిపోయి, సున్నా సాగునీటి లాభాలు మాత్రమే వచ్చాయని విమర్శించారు. కృష్ణ, గోదావరి బేసిన్లలో తెలంగాణకు ఉన్న వాటా వినియోగం పూర్తిగా విఫలమైందని చెప్పారు. కాళేశ్వరం రోజువారీ డ్రాయల్‌ను 2 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు పెంచాలని బీఆర్‌ఎస్ ప్రయత్నించగా, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల సాగునీటి పథకం సామర్థ్యాన్ని 1.5 టీఎంసీల నుంచి 1 టీఎంసీకి తగ్గించారని ఆయన తెలిపారు. 2018 నాటికి పీఆర్ఎల్ఐఎస్ పూర్తి చేస్తామన్న హామీ అమలు కాలేదని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం వెళ్లే నాటికి రూ.40 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండగా, అందులో రూ.10 వేల కోట్లు నీటిపారుదల శాఖవేనని ఉత్తమ్ వెల్లడించారు.
