Let's talk: editor@tmv.in
కృత్రిమ మేధ దుర్వినియోగం అరికట్టాలి - నిర్మలా సీతారామన్

కృత్రిమ మేధ దుర్వినియోగం అరికట్టాలి - నిర్మలా సీతారామన్

Dantu Vijaya Lakshmi Prasanna
19 అక్టోబర్, 2025

కృత్రిమ మేధస్సు (ఏఐ) నేరస్థులు ప్రముఖుల వాయిస్‌లను అనుకరించడానికి, వ్యక్తిత్వాలను క్లోన్ చేయడానికి, నిజానికి దగ్గరగా ఉన్న వీడియోలను సృష్టించడానికి వాడుతున్న నేపథ్యంలో, ఫిన్‌టెక్ సంస్థలు రిస్క్ మేనేజ్‌మెంట్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు.

గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2025, ఆరవ ఎడిషన్‌లో ముంబయి లో జరిగినది.ఈ సమావేశం ఫైనాన్స్, టెక్నాలజీ, స్టార్టప్‌లు, పాలసీ మేకర్లు పాల్గొనే ప్రపంచస్థాయి వేదిక. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆర్దిక మంత్రి సీతారామన్ మాట్లాడుతూ ఫిన్ టెక్ లు ప్రధానంగా రిస్క్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టాలని, ప్రస్తుతం కృత్రిమ మేధస్సు వల్ల అపారమైన అవకాశాలు ఉన్నప్పటికీ, దాని “డార్క్ సైడ్” కూడా ఉందని హెచ్చరించారు. ఏఐ ద్వారా సాధ్యమయ్యే అభివృద్ధి వెనుక, అదే సాంకేతికత మోసాలకు, మభ్యపెట్టే ప్రయత్నాలకు కూడా ఆయుధంగా మారుతోంది,” స్వయంగా నా పేరుతో డీప్‌ఫేక్ వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయని, అవి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఉపయోగపడుతున్నాయని ఆమె వెల్లడించారు. “ఇది మన రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అత్యవసరతను గుర్తు చేసింది,”. నేరస్థులు ఇప్పుడు ఫైర్వాల్‌లను దాటడం కాకుండా, “నమ్మకాన్ని హ్యాక్ చేయడం” ప్రారంభించారని ఆమె వ్యాఖ్యానించారు.

విదేశీ కరెన్సీ సెటిల్‌మెంట్ వ్యవస్థ ప్రారంభం

ఈ కార్యక్రమంలో ఆమె గిఫ్ట్ ఐఎఫ్ఎస్‌సీ (GIFT IFSC) లో ఫారిన్ కరెన్సీ సెటిల్‌మెంట్ సిస్టమ్ (విదేశీ కరెన్సీ సెటిల్‌మెంట్ వ్యవస్థ) ను ప్రారంభించారు. ఈ వ్యవస్థ ద్వారా విదేశీ కరెన్సీలలో లావాదేవీలు రియల్ టైమ్ లేదా దానికి దగ్గరగా జరిగేలా చేయవచ్చు దీంతో భారత్ గిఫ్ట్ ఐఎఫ్ఎస్‌సీ, హాంకాంగ్, టోక్యో, మనిలా వంటి ప్రపంచ ఆర్థిక కేంద్రాల సరసన చేరింది. ఇది భారత్‌కు ప్రపంచ ఆర్థిక వేదికలో ప్రతిష్టాత్మక స్థానాన్ని కల్పిస్తుంది.

ఈ సందర్బంగా ఆమె “భారతదేశం ప్రపంచ స్థాయి ఏఐ ఉత్పత్తులు, సేవలు అందించే కేంద్రంగా మారగల సామర్థ్యం కలిగిన దేశం.”అన్నారు.

ఏఐ అభివృద్ధి కోసం ఆమె కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు.

• ఏ ఐ వ్యవస్థలు భారత భాషలు, స్థానిక సందర్భాలు ఆధారంగా రూపుదిద్దుకోవాలి.

• టెక్స్ట్, వాయిస్, విజువల్ వంటి బహుముఖ ఇన్‌టర్‌ఫేస్‌లతో అందరికీ సులభంగా ఉపయోగించగలవిగా ఉండాలి.

• భారత్ ప్రపంచానికి ఏఐ ప్రయోగశాలగా మారగలదు. అదే సమయంలో, ఈ విధానం భారతదేశాన్ని “గ్లోబల్ సౌత్” దేశాలకు ఏఐ మార్గదర్శిగా (టార్చ్ బేరర్) నిలబెడుతుందని ఆమె పేర్కొన్నారు.

బాధ్యతాయుతమైన అభివృద్ధి అవసరం

ఫిన్‌టెక్ సంస్థలు కేవలం వేగవంతమైన వృద్ధిపై కాకుండా, బాధ్యతాయుతమైన అభివృద్ధి పైన కూడా దృష్టి పెట్టాలని సీతారామన్ సూచించారు. రెవెన్యూ వృద్ధి, సృజనాత్మక ఉత్పత్తులు, లాభదాయకత, రిస్క్ & కంప్లయెన్స్ అంశాలు సమతుల్యంగా ఉండాలి. నియంత్రణలు ప్రగతికి అడ్డుకాదు. అవి భద్రత కోసం వేసిన సీటుబెల్ట్‌లాంటివి.

( “Responsible regulation is not a brake on progress; it is a seatbelt for safe acceleration,”) అని ఆమె వ్యాఖ్యానించారు.

భారతదేశం డిజిటల్ ఫైనాన్స్‌లో ముందంజ

గత పదేళ్లలో భారతదేశం ఫైనాన్షియల్ రంగంలో విశేష పురోగతి సాధించిందని ఆమె గర్వంగా వివరించారు.భారత్ లో 56 కోట్లు జనధన్ బ్యాంకు ఖాతాలు ప్రారంభమయ్యాయి. ఇది యూరోపియన్ యూనియన్ మొత్తం జనాభాకు సమానం. యుపిఐ (UPI), డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (DPI) వల్ల డిజిటల్ చెల్లింపులు ప్రజల రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. భారత్ ఇప్పుడు ఫిన్‌టెక్ కంపెనీల సంఖ్యలో ప్రపంచంలో మూడో స్థానం, అలాగే డిజిటల్ చెల్లింపుల పరంగా ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 18,580 కోట్ల యుపిఐ లావాదేవీలు ₹261 లక్షల కోట్లు విలువైనవి ప్రాసెస్ అయ్యాయి. ప్రపంచంలోని రియల్ టైమ్ డిజిటల్ లావాదేవీలలో దాదాపు 50 శాతం భారత్‌లోనే జరుగుతున్నాయి. భారతదేశంలో డిజిటల్ దత్తత రేటు 87%, ప్రపంచ సగటు 67% కంటే ఎక్కువగా ఉంది.

ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) విజయం

ప్రభుత్వం అమలు చేసిన ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) పథకం గురించి ఆమె వివరించారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వ సబ్సిడీలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరుతున్నాయి. దీని వల్ల ₹4.31 లక్షల కోట్ల వరకు ఆదా జరిగింది. 2014 నుండి 2024 మధ్య 16 రెట్లు లబ్ధిదారుల సంఖ్య పెరిగింది. పేపర్ ఆధారిత పద్ధతుల బదులు డిజిటల్ బదిలీలు ప్రవేశపెట్టడంతో ప్రజలకే నేరుగా ప్రయోజనాలు అందుతున్నాయి.

భవిష్యత్తు దిశ

భారతదేశంలో ప్రస్తుతం 650 మిలియన్లకుపైగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఉన్నారని, ఈ విస్తారమైన జనాభా ఆధారంగా ఫిన్‌టెక్ మోడళ్లను ఇతర రంగాల్లో కూడా విస్తరించవచ్చని ఆమె సూచించారు.

ఉదాహరణకు: ఆరోగ్యరంగం, విద్య , వ్యవసాయం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఎగుమతులు వంటివి.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగం ద్వారా రెండు ప్రధాన సందేశాలు వెల్లడించారు. ఒకటి, భారత్ డిజిటల్ విప్లవంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందన్న గర్వం. మరొకటి, కృత్రిమ మేధస్సు (ఎఐ) దుర్వినియోగం వల్ల పెరుగుతున్న ప్రమాదాలను సకాలంలో అరికట్టాల్సిన అవసరం.టెక్నాలజీ అభివృద్ధి తప్పనిసరి, కానీ బాధ్యతాయుతమైన వినియోగం అంతకంటే ముఖ్యమైనది అని ఆమె అన్నారు.

కృత్రిమ మేధ దుర్వినియోగం అరికట్టాలి - నిర్మలా సీతారామన్ - Tholi Paluku