Let's talk: editor@tmv.in
కృత్రిమ మేధస్సుతో విప్లవాత్మక మార్పులు.. క్వాంటం హబ్‌గా అమరావతి: సీఎం

కృత్రిమ మేధస్సుతో విప్లవాత్మక మార్పులు.. క్వాంటం హబ్‌గా అమరావతి: సీఎం

Panthagani Anusha
8 మార్చి, 2026

నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచ సాంకేతిక ముఖచిత్రంపై సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం ఢిల్లీలో జరిగిన ప్రతిష్ఠాత్మక 'రైసినా డైలాగ్' సదస్సులో పాల్గొన్న ఆయన ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచానికి క్వాంటం వ్యాలీగా పరిచయం చేశారు. ఒకప్పుడు ఐటీ విప్లవంతో హైదరాబాద్‌ను ‘నాలెడ్జ్ హబ్’గా తీర్చిదిద్దిన అనుభవంతో ఇప్పుడు అమరావతిని కృత్రిమ మేధస్సు (ఏఐ) క్వాంటం కంప్యూటింగ్ పరిశోధనలకు గ్లోబల్ సెంటర్‌గా మార్చడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.

ఇక రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో మైలురాయిగా నిలిచే భారీ పెట్టుబడిని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రకటించారు. గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ సుమారు 15 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 1.25 లక్షల కోట్లు) భారీ వ్యయంతో ఆంధ్రప్రదేశ్‌లో గిగావాట్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుందని వెల్లడించారు. కాగా ఇటీవల కాలంలో రాష్ట్రానికి వచ్చిన అతిపెద్ద పెట్టుబడి ఇదేనని దీని ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలతో పాటు అత్యాధునిక సాంకేతిక మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అమరావతిలో ఏర్పాటు చేయబోయే ప్రత్యేక ‘క్వాంటం వ్యాలీ టెక్ పార్క్’ ద్వారా తయారీ అభివృద్ధి రంగాల్లో ఏపీ అగ్రగామిగా నిలవబోతోందని స్పష్టం చేశారు.

మరోవైపు సాంకేతికతతో పాటు సామాజిక సమతుల్యతపై కూడా ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పడిపోతున్న సంతానోత్పత్తి రేటు పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మన సంతానోత్పత్తి రేటు 1.5శాతంగా గా ఉందని ఇది భర్తీ స్థాయి కంటే తక్కువగా ఉండటం భవిష్యత్తులో మానవ వనరుల కొరతకు దారితీస్తుందని భవిషత్తులో "సాంకేతికతను సమర్థంగా వినియోగించుకోవాలంటే మనుషులు ఉండాలి లేకపోతే రోబోలే అన్ని పనులను ఆక్రమిస్తాయి అని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే సంతానోత్పత్తి రేటును రెండు శాతానికి పైగా పెంచే లక్ష్యంతో రెండో బిడ్డ కలిగిన జంటలకు రూ. 25,000 జనన ప్రోత్సాహకాన్ని అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆయన పేర్కొన్నారు.

అదేవిధంగా అమరావతి నగరాన్ని దేశంలోనే అత్యంత నివసించదగిన నగరంగా తీర్చిదిద్దుతానని చంద్రబాబు పునరుద్ఘాటించారు. మరోవైపు రాజకీయంగా కేంద్రంతో ఉన్న సంబంధాలపై స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రం, రాష్ట్రం ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయని స్పష్టంచేశారు. భారతదేశానికి ఉన్న చర్చల వారసత్వంతో ఏ అంశంపైనైనా ఏకాభిప్రాయాన్ని సాధించడం సాధ్యమవుతుందని అదే స్ఫూర్తితో రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తానని అమరావతికి ప్రపంచ నాయకత్వ కేంద్రంగా నిలబెట్టడమే తన తదుపరి కర్తవ్యమని ఆయన ఉద్ఘాటించారు.

కృత్రిమ మేధస్సుతో విప్లవాత్మక మార్పులు.. క్వాంటం హబ్‌గా అమరావతి: సీఎం - Tholi Paluku