Let's talk: editor@tmv.in
కృత్రిమ మేధలో తెలంగాణకు కొత్త దిశ: డీకిన్ యూనివర్సిటీతో ఒప్పందం
కృత్రిమ మేధలో తెలంగాణకు కొత్త దిశ: డీకిన్ యూనివర్సిటీతో ఒప్పందం

కృత్రిమ మేధలో తెలంగాణకు కొత్త దిశ: డీకిన్ యూనివర్సిటీతో ఒప్పందం

Sirisha B
10 ఏప్రిల్, 2026

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణకు మరో కీలక ముందడుగు పడింది. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ విద్యాసంస్థ డీకిన్‌ యూనివర్సటీతో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఐకమ్ అప్లైడ్ కృత్రిమ మేధస్సు అభివృద్ధికి సంబంధించి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో డీకిన్ యూనివర్సిటీ వైస్‌-ఛాన్సలర్ ఇయాన్‌ మార్టిన్‌ ,ఐకమ్ వ్యవస్థాపక ప్రధాన అధికారి ఫణి నాగార్జున సమక్షంలో ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ భాగస్వామ్యం ద్వారా తెలంగాణను ప్రపంచ స్థాయి కృత్రిమ మేధస్సు కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నాలకు మరింత బలం చేకూరనుంది.

ప్రజా ప్రయోజనాల కోసం సాంకేతికత

కృత్రిమ మేధస్సును బాధ్యతాయుతంగా వినియోగించి ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావడమే లక్ష్యమని తెలంగాణ ఐటీ శాఖ ప్రత్యేక కార్యదర్శి భవేశ్‌ మిశ్రా తెలిపారు. ఆధునిక పరిశోధనలను ప్రయోగశాలలకే పరిమితం చేయకుండా ప్రభుత్వ పాలన, ప్రజా సేవల్లో ఉపయోగించడంలో ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని ఆయన వివరించారు.

మూడు ప్రధాన రంగాల్లో సంయుక్త చర్యలు

ఈ ఒప్పందం కింద మూడు కీలక అంశాలపై దృష్టి సారించనున్నారు.

• నైపుణ్యాభివృద్ధి: అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం శిక్షణ అందించి తెలంగాణ యువతను ప్రపంచ స్థాయి ఏఐ నిపుణులుగా తీర్చిదిద్దడం.

• పరిశోధన: వినూత్న ఆవిష్కరణల కోసం సంయుక్త పరిశోధనలు నిర్వహించడం.

• పరిశ్రమల భాగస్వామ్యం: స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడం, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సాంకేతికత అభివృద్ధి చేయడం.

‘ఐకమ్–ధృతి’ పరిశోధన కేంద్రం

ఈ భాగస్వామ్యంలో భాగంగా ‘ఐకమ్–ధృతి’ అనే ప్రత్యేక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. అప్లైడ్ కృత్రిమ మేధస్సును సామాజిక అవసరాలకు అన్వయించడంపై ఈ కేంద్రం పరిశోధనలు చేపట్టనుంది. శాస్త్రవేత్తలు, విధాన నిర్ణేతలు, పరిశ్రమల ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకురావడంలో ఇది కీలక పాత్ర పోషించనుంది.

పాలనలో సాంకేతిక వినియోగం

సైబర్ భద్రత, డేటా విశ్లేషణ వంటి రంగాల్లో కృత్రిమ మేధస్సును వినియోగించి ప్రభుత్వ సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు అవసరమైన అప్లికేషన్లను సంయుక్తంగా అభివృద్ధి చేస్తామని డీకిన్ వైస్-ఛాన్సలర్ ఐన్ మార్టిన్ తెలిపారు.

భారత్–ఆస్ట్రేలియా సాంకేతిక భాగస్వామ్యం

ఈ ఒప్పందం రెండు సంస్థల మధ్య సహకారమే కాకుండా ఇండియా–ఆస్ట్రేలియా దేశాల మధ్య సాంకేతిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా కూడా కీలక అడుగని డీకిన్ వైస్ ప్రెసిడెంట్ రవ్‌నీత్‌ పవా పేర్కొన్నారు.

కొత్త ప్రమాణాల దిశగా తెలంగాణ

డీకిన్ యూనివర్సిటీ నైపుణ్యం, తెలంగాణలో ఉన్న ఆవిష్కరణ వాతావరణం కలిసివచ్చి డేటా ఆధారిత పాలన, నైతిక కృత్రిమ మేధస్సు వినియోగం, ప్రపంచ స్థాయి నైపుణ్య శక్తి తయారీ వంటి రంగాల్లో రాష్ట్రం కొత్త ప్రమాణాలు నెలకొల్పే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

కృత్రిమ మేధలో తెలంగాణకు కొత్త దిశ: డీకిన్ యూనివర్సిటీతో ఒప్పందం - Tholi Paluku