Let's talk: editor@tmv.in
కూటమి రాజకీయాల్లో మాస్టర్.. నితీశ్

కూటమి రాజకీయాల్లో మాస్టర్.. నితీశ్

Pinjari Chand
6 మార్చి, 2026

సీఎంగా 10 సార్లు ప్రమాణం స్వీకారం చేసి బీహార్‌‌లో రికార్డు నెలకొల్పాడు నితీశ్‌కుమార్. సుమారు రెండు దశాబ్దాలుగా(2005–2026) ముఖ్యమంత్రిగా ప్రజలకు అందుబాటులో ఉండి రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం సీఎం పదవిని వదిలి, పెద్దల సభ(రాజ్యసభ)కు నామినేషన్ వేసి, సీఎం పదవిని వదిలేందుకు సిద్ధమవ్వడంతో మరోసారి నితీశ్‌కుమార్ రాజకీయంగా వార్తల్లో నిలిచారు.

బీహార్ రాజకీయ చరిత్రలో అత్యంత చాతుర్యమైన నాయకుల్లో ఒకరిగా నితీశ్‌కుమార్ పేరు నిలిచే అవకాశముంది. ఆయన పార్టీ జనతాదళ్(యునైటెడ్) రాష్ట్ర అసెంబ్లీలో ఎప్పుడూ పూర్తి మెజారిటీ సాధించకపోయినా, ఆయన మాత్రం బీహార్ ముఖ్యమంత్రిగా తన ముందున్న నాయకులందరికంటే ఎక్కువకాలం అధికారంలో కొనసాగగలిగారు. ఈ పరిణామాలపై రాజకీయ వర్గాల్లో విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ఆయనకు అత్యంత విధేయులైన అనుచరులు దీనిని ‘అంతర్గత రాజకీయ ఆలోచనల ఫలితం’గా భావిస్తుండగా, ప్రత్యర్థులు మాత్రం నితీశ్ కుమార్ అవకాశవాద రాజకీయాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు.

ఇక్కడా మహారాష్ట్ర రాజకీయాలే

ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న ఆర్జేడీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ బీజేపీ మహారాష్ట్రలో చేసిన రాజకీయాలను బీహార్‌లో కూడా చేసింది. కానీ దీనికి నితీశ్ కుమార్ కూడా బాధ్యత వహించాలి. మాకు ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ మేము ఆయనకు ముఖ్యమంత్రి పదవిని ఇచ్చాం. కానీ ఆయన రెండు సార్లు మమ్మల్ని విడిచిపోయారని విమర్శించారు. బీజేపీ దళితులు, ఓబీసీలకు వ్యతిరేకంగా ఉండే పార్టీ. ఇప్పుడు రాష్ట్రంలో తమ అజెండాను అమలు చేయాలని చూస్తోందని ఆరోపించారు.

నితీశ్ రాజకీయ నేపథ్యం

గత వారం 75 ఏళ్లు పూర్తి చేసుకున్న నితీశ్ కుమార్ రాజకీయ ప్రయాణం 1970లలో విద్యార్థి దశలోనే ప్రారంభమైంది. ప్రముఖ సోషలిస్టు నాయకుడు జయప్రకాశ్‌ నారాయణ్ ప్రారంభించిన జేపీ ఉద్యమంలో ఆయన చురుకుగా పాల్గొన్నారు.

1985లో నలందా జిల్లాలోని హర్నౌట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాలుగేళ్ల తరువాత లోక్‌సభకు ఎన్నికై పార్లమెంటులో ప్రవేశించారు. ఆ సమయంలో మండల్ రాజకీయాల ప్రభావంతో ఏర్పడిన ప్రభుత్వం లో ప్రధాని వీపీ.సింగ్‌ కేబినెట్‌లో ఆయనకు స్థానం లభించింది.

1995లో ఆయన జనతాదళ్‌ను విడిచి వెళ్లారు. అప్పటి బీహార్ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్‌యాదవ్‌ ప్రభావం పెరుగుతుండటంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం జార్జ్‌ ఫెర్నాండెజ్‌ సహాయంతో సమతా పార్టీని ఏర్పాటు చేశారు.

1996 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ తరువాత ప్రధాని అటల్ బీహారి వాజ్‌పాయ్‌ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు.

2000లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ రావడంతో ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి ఆయనకు బీజేపీ మద్దతిచ్చింది. తరువాత శరద్‌యాదవ్‌తో కలిసి జనతాదళ్ (యునైటెడ్) పార్టీని స్థాపించారు.

2005లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ-బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. అప్పటి నుంచి నితీశ్ కుమార్ రాజకీయ ప్రభావం బీహార్‌లో మరింత బలపడింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 243 స్థానాల్లో 206 స్థానాలు గెలుచుకుంది. జాతీయ రాజకీయాల్లో మార్పుల సమయంలో నితీశ్ కుమార్‌ను కొందరు నరేంద్రమోడీకి ప్రత్యామ్నాయ నాయకుడిగా కూడా చూశారు. అయితే రాజకీయ విభేదాల కారణంగా తరువాత బీజేపీతో ఆయన విడిపోయారు.

2014 లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ పరాజయం తర్వాత నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత జితన్‌రామ్‌మాంఝీని ముఖ్యమంత్రిగా నియమించారు. అయితే కొద్ది కాలంలోనే మళ్లీ తానే అధికారంలోకి వచ్చారు.

2015లో లాలు ప్రసాద్ యాదవ్‌తో కలిసి ఏర్పాటు చేసిన ‘మహాగఠ్‌బంధన్’ భారీ విజయం సాధించింది. కానీ ఈ కూటమి ఎక్కువకాలం కొనసాగలేదు. రెండు సంవత్సరాల తరువాత ఆయన మళ్లీ బీజేపీతో చేతులు కలిపారు. ఈ తరచు కూటమి మార్పుల కారణంగా నితీశ్ కుమార్‌కు ‘పల్టూ రామ్’ (పక్షం మార్చే నాయకుడు) అనే విమర్శాత్మక పేరు కూడా అంటుకుంది. అయినప్పటికీ మహిళా సాధికారత, అభివృద్ధి, చట్టవ్యవస్థ మెరుగుదల వంటి అంశాల్లో ఆయన పాలనకు ప్రశంసలు లభించాయి.

రాజ్యసభకు నితీశ్ కుమార్.. బీహార్‌లో తొలి పూర్తి స్థాయి బీజేపీ ప్రభుత్వానికి అవకాశం

జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ రాజ్యసభ సభ్యుడిగా వెళ్లాలన్న అభిలాషతో బీహార్ రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీసే పరిస్థితి ఏర్పడింది. దీంతో రాష్ట్రంలో తొలిసారి పూర్తి స్థాయి బీజేపీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అవకాశం కనిపిస్తోంది. నాలుగు నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 89 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇది 2020 తర్వాత రెండోసారి జేడీయూ కంటే మెరుగైన ఫలితాన్ని సాధించింది. అప్పటి నుంచే బీజేపీకి సీఎం పదవి దక్కే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి.

కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా బీజేపీ ఆధిపత్యాన్ని ప్రతిబింబించింది. కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. కొత్త మంత్రివర్గంలో బీజేపీకి అధిక ప్రాధాన్యం లభించడంతో పాటు కీలకమైన హోం శాఖ కూడా దక్కింది.

సీఎం అభ్యర్థులపై ఊహాగానాలు

బీజేపీ నుంచి ముఖ్యమంత్రి పదవికి పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి పేరు ముందంజలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయనను ‘పెద్ద నాయకుడిగా తయారు చేస్తాం’ అని అమిత్ షా ప్రకటించారు. సమ్రాట్ చౌదరీ ఓబీసీ వర్గానికి చెందిన కోయిరీ కులానికి చెందినవారు. ఈ వర్గానికి ఇప్పటివరకు బీహార్‌లో ముఖ్యమంత్రి పదవి దక్కలేదనే భావన ఉంది. మరోవైపు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌రాయ్‌ పేరు కూడా సీఎం రేసులో వినిపిస్తోంది. ఆయన యాదవ్ వర్గానికి చెందినవారు. అయితే యాదవ్ వర్గానికి సీఎం పదవి ఇస్తే ఇతర సామాజిక వర్గాల్లో అసంతృప్తి కలగవచ్చని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇతర అవకాశాలు కూడా

ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఒడిశా వంటి రాష్ట్రాల్లో అనూహ్యంగా కింది స్థాయి నాయకులను ముఖ్యమంత్రులుగా ఎంపిక చేసినట్లే బీహార్‌లో కూడా తక్కువగా ప్రచారంలో ఉన్న నాయకుడిని ఎంపిక చేసే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

జేడీయూలో ఆందోళన

పార్టీలోని భావోద్వేగాన్ని సామాజిక సంక్షేమ శాఖ మంత్రి మదన్ సాహ్ని వ్యాఖ్యలు ప్రతిబింబించాయి. ఏం జరుగుతుందో చూసి మేమంతా ఆశ్చర్యపోతున్నాం. ఇది నిజంగా నితీశ్ కుమార్ స్వయంగా తీసుకున్న నిర్ణయమా అనేది నమ్మడం కష్టమని ఆయన అన్నారు. లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ సభ్యుడిగా పనిచేయాలన్న తన పాత కోరికను నెరవేర్చుకునేందుకు నితీశ్ కుమార్ ప్రస్తుతం జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. పోలీసులు ముఖ్యమంత్రి అధికార నివాసానికి వెళ్లకుండా అడ్డుకోవడంతో జేడీయూ కార్యకర్తలు పార్టీ కార్యాలయం వద్ద ఆగ్రహం వ్యక్తం చేస్తూ విధ్వంసానికి కూడా పాల్పడ్డారు. ఒకప్పుడు బీజేపీ నేత సుశీల్‌కుమార్ మోడీ సహా పలువురు నాయకులు నితీశ్ కుమార్‌ను ప్రధానమంత్రి అభ్యర్థి స్థాయి నాయకుడిగా అభివర్ణించిన సందర్భాలు ఉన్నాయి.

ఇక జేడీయూలో మాత్రం అంతర్గత ఆందోళనలు పెరుగుతున్నాయి. పార్టీ ప్రభావం తగ్గే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో నితీశ్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ ఇటీవల రాజకీయాల్లోకి ప్రవేశించినట్లు ప్రకటించారు. ఆయనను ఉప ముఖ్యమంత్రి పదవిలోకి తీసుకునే అవకాశాలపై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే జేడీయూ నాయకుల్లో కొందరు మాత్రం ఇకపై మా పార్టీ మంత్రులు కూడా బీజేపీ అనుకూలతపై ఆధారపడాల్సి వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు నిశాంత్‌కుమార్ రాజకీయాల్లోకి రావడంతో , కుటుంబ రాజకీయాలను విమర్శిస్తూ నిలుపుకున్న తన స్థానం కూడా నితీశ్ కుమార్ కోల్పోయే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

కూటమి రాజకీయాల్లో మాస్టర్.. నితీశ్ - Tholi Paluku