
కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుంటుంది: డిప్యూటీ సీఎం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న టిడిపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి సర్కారు పూర్తిస్థాయి 'ప్రజా స్నేహపూర్వక ప్రభుత్వం' (పీపుల్ ఫ్రెండ్లీ గవర్నమెంట్) అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలోని నందిగరువు గ్రామంలో గిరిజనులతో నిర్వహించిన ‘మాటా – మంతి’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన సంప్రదాయాల మధ్య పవన్ కళ్యాణ్ తన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు.
ఈ సందర్భంగా గిరిజనులను ఉద్దేశించి పవన్ మాట్లాడుతూ మీ కష్టాలను వినడానికి సమస్యలను పరిష్కరించడానికి కన్నీళ్లు మీ గడపను తాకకుండా చూసుకోవడానికి ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది. కష్టపడే ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలబడితే మేము మరింత ఉత్సాహంతో పని చేస్తాం" అని హామీ ఇచ్చారు. కేవలం 40 గడపలు ఉన్న నందిగరువు గ్రామానికి రూ.2 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మించామని ఇది కూటమి ప్రభుత్వ అభివృద్ధి నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు.
గత ప్రభుత్వ పాలనపై ధ్వజం
ఇక గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి అస్తవ్యస్తమైందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. "గత ప్రభుత్వంలో ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి కూడా భయపడే పరిస్థితి ఉండేది. ఎమ్మెల్యే దగ్గరకు వెళ్తే మీ ఊరు ఎక్కడుంది అని అడిగే స్థాయి నుంచి ఈరోజు ప్రభుత్వ యంత్రాంగమే మీ ముందుకు వచ్చేలా పాలనను మార్చాం" అని అన్నారు. జలజీవన్ మిషన్ నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించడం వల్లే ఏజెన్సీలో తాగునీటి ఎద్దడి ఏర్పడిందని విమర్శించారు.
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నగరాల్లో లక్షలాది మంది మధ్య జరుపుకోవచ్చు కానీ మారుమూల గిరిజన ప్రజల మధ్య జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చానని పవన్ తెలిపారు. 70 ఏళ్లుగా రోడ్డు ముఖం చూడని ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించడం సంతోషంగా ఉంది మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాలకు రావడానికి నాయకులు భయపడతారని కానీ ప్రజల కోసం పనిచేసే తనకు అలాంటి భయాలు లేవని ఆయన స్పష్టం చేశారు.
తక్షణ పరిష్కారాలు - నిధుల మంజూరు
ఇదిలా ఉండగా గ్రామస్తులు కోరిన వెంటనే ఒంటూరు జంక్షన్ నుంచి కొత్తపొలం గ్రామానికి 1.6 కిలోమీటర్ల మేర రోడ్డును జీరామ్ జీ పథకం కింద మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వివాదాస్పద జీవో నెంబర్ 3 పునరుద్ధరణ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కాగా ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ అమిత్ బర్దార్ మరియు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
