Let's talk: editor@tmv.in
కూటమి ప్రభుత్వంలో విలేకరులకు రక్షణ కరువు

కూటమి ప్రభుత్వంలో విలేకరులకు రక్షణ కరువు

Shaik Mohammad Shaffee
28 అక్టోబర్, 2025

కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలోని ప్రజలకు, జరుగుతున్న అక్రమాలను నిర్భయంగా వార్తలు రాసే విలేకరులకు రక్షణ లేకుండా పోతుందని మాజీ మంత్రి, శింగనమల వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త డా.సాకే శైలజానాథ్ అన్నారు.

బుక్కరాయసముద్రం మండలం పసులూరు గ్రామంలో ఎర్రమట్టి అక్రమ దందాదారుల చేతిలో బెదిరింపులకు గురైన విలేకరిని మాజీ మంత్రి డా.సాకే శైలజానాథ్ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా కల్పించారు. జరిగిన సంఘటనపై వెంటనే బుక్కరాయసముద్రం ఎస్సై రామ్‌ప్రసాద్‌తో ఫోన్‌లో మాట్లాడి, భౌతిక దాడికి పాల్పడి కులం పేరుతో దూషించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. అనంతరం జగనన్న కాలనీలో టిడీపీ కార్యకర్తలు అక్రమంగా ఎర్రమట్టిని తరలించిన లేఅవుట్స్‌ను ఆయన పరిశీలించారు.

శైలజానాథ్ మాట్లాడుతూ.. “దళిత కులానికి చెందిన విలేకరిపై టిడీపీ కార్యకర్తలు హరి, పవన్ అర్ధరాత్రి దారుణంగా ఇంటిలోకి చొరబడి దాడికి యత్నించి, కులం పేరుతో దూషించడంతో పాటు, అక్కడ ఉన్న మహిళలను అనుచిత పదజాలంతో మాట్లాడారు. దీంతో కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. జగనన్న కాలనీలో నెలలుగా జరుగుతున్న ఎర్రమట్టి అక్రమ రవాణాపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ లేఅవుట్స్‌లో యథేచ్ఛగా జరుగుతున్నా ఈ దందాపై కనీసం ఎమ్మెల్యేకు తెలియదా?” అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులను కొల్లగొడుతూ సమాజానికి అన్యాయం జరుగుతుంటే, దానిపై స్పందించాల్సిన ప్రజా ప్రతినిధులు మౌనం పాటించడం ఆందోళనకరమని శైలజానాథ్ అన్నారు.