Let's talk: editor@tmv.in
కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువు: వైసీపీ నేత లక్ష్మీ పార్వతి

కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువు: వైసీపీ నేత లక్ష్మీ పార్వతి

Panthagani Anusha
16 మార్చి, 2026

రాష్ట్రంలో తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల భద్రత గాలిలో దీపంగా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు, వేధింపుల ఘటనలు శాంతిభద్రతల క్షీణతకు అద్దం పడుతున్నాయని ఆమె విమర్శించారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.

ప్రజలను రక్షించాల్సిన బాధ్యత కలిగిన కొందరు ప్రజాప్రతినిధులే నేడు మహిళలపై దాడులకు పాల్పడుతున్న పరిస్థితి నెలకొందని లక్ష్మీపార్వతి ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా అభం శుభం తెలియని బాలికల నుంచి వృద్ధ మహిళల వరకు ఎవరికీ రక్షణ లేని అసురక్షిత వాతావరణం నెలకొందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులకు గురైన బాధితులు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే కొన్ని సందర్భాల్లో రివర్స్‌లో బాధితులపైనే కేసులు నమోదు చేస్తున్న ఉదంతాలు కనిపిస్తున్నాయని ఇది రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ప్రతిష్ఠను మంటగలుపుతోందని మండిపడ్డారు.

అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలే మహిళలపై దుర్వినియోగానికి పాల్పడిన ఘటనలు బయటపడుతున్నాయని దీనివల్ల వారి అనుచరులు కూడా అలాంటి ప్రవర్తనకు ప్రోత్సాహం పొందుతున్నారని ఆమె ఆరోపించారు. అయినప్పటికీ నిందితులపై ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకోవడం కనిపించడం లేదని ఆమె విమర్శించారు.

గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మహిళల రక్షణ కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన 'దిశ యాప్' పనితీరును ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న మహిళలకు 24 గంటల పాటు తక్షణ పోలీస్ సహాయం అందేలా ఒక పటిష్టమైన వ్యవస్థను జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అయితే ప్రస్తుత ప్రభుత్వం కేవలం రాజకీయ వైరం కారణంగా ఆ వ్యవస్థను పూర్తిగా నీరుగార్చిందని ఆమె ఆరోపించారు. గత పాలనలో మహిళలకు ఆర్థిక చేయూతతో పాటు ప్రజా జీవితంలో వారికి ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించడం మానేసి నిరంతరం గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ మళ్లింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఇప్పటికైనా ప్రభుత్వం రాజకీయ కక్షలను పక్కనపెట్టి రాష్ట్రంలో మహిళల భద్రతను అగ్ర ప్రాధాన్యతగా తీసుకోవాలని డిమాండ్ చేశారు.