Let's talk: editor@tmv.in
కూటమి పాలనలో క్రైస్తవుల పై వివక్ష పెరిగింది: వైసీపీ

కూటమి పాలనలో క్రైస్తవుల పై వివక్ష పెరిగింది: వైసీపీ

Panthagani Anusha
7 ఏప్రిల్, 2026

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కుల, మత వివక్షను విపరీతంగా ప్రోత్సహిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులే దళితులు, క్రైస్తవుల పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరించడం ప్రజాస్వామ్య విలువలకు తీవ్ర విఘాతం కలిగిస్తోంది అని విమర్శించారు.

కాగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఒక మాదిగ కళాకారుల పై చేయి చేసుకోవడం వార్తలు అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు ఏకంగా దళితులు, క్రైస్తవులను సామాజికంగా బహిష్కరించాలంటూ పిలుపునివ్వడం అత్యంత ఆందోళనకరమని సుధాకర్ బాబు పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి అణగారిన వర్గాల మనోభావాలు దెబ్బతీస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ఈ మౌనం దాడులకు మద్దతు తెలపడమేనని ఆరోపించారు.

అయితే గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళిత, క్రైస్తవ వర్గాలకు లభించిన ప్రాధాన్యతను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. జగన్ హయాంలో దళితుల సంక్షేమం కోసం దాదాపు రూ. 70,000 కోట్లు వెచ్చించడంతో పాటు రాజకీయంగా డిప్యూటీ సీఎం, హోంమంత్రి వంటి కీలక పదవులను ఆ వర్గాలకే కేటాయించారని తెలిపారు. మంత్రివర్గం నుండి కార్పొరేషన్ చైర్మన్ల వరకు సామాజిక న్యాయం పాటించిన ఘనత జగన్‌దేనని విజయవాడలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణం ద్వారా తమ నిబద్ధతను చాటుకున్నామని పేర్కొన్నారు.

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలిందని సుధాకర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. కుప్పం, రైల్వే కోడూరు వంటి ప్రాంతాల్లో దళితులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, అధికార పార్టీ నేతలు కుల దూషణలకు పాల్పడుతున్నా కఠిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు.

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ఫోటోలకు ఫోజులివ్వడం కాదు, ఆ వర్గాల సమస్యలపై చిత్తశుద్ధి ఉండాలని సుధాకర్ బాబు హితవు పలికారు. చంద్రబాబు తనను తాను జగన్‌తో పోల్చుకోవద్దని దళితులు అణగారిన వర్గాలన్నీ జగన్ నాయకత్వానికే అండగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.