
కూటమి పాలనపై జనంలో తీవ్ర వ్యతిరేకత: వైఎస్ జగన్
రాష్ట్రంలో అధికార కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి మొదలైందని, ప్రతి ఇంట్లోనూ గత ప్రభుత్వానికి ప్రస్తుత పాలనకు మధ్య వ్యతిరేకతపై చర్చ జరుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు.
అప్పుల కుప్పగా రాష్ట్రం.. సంక్షేమం గాలికి
గడిచిన రెండేళ్ల కాలంలోనే కూటమి ప్రభుత్వం రికార్డు స్థాయిలో రూ. 3.30 లక్షల కోట్ల అప్పు చేసిందని అయితే ఈ నిధులు ఎటు పోతున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదని జగన్ విమర్శించారు. మేము ఐదేళ్లలో చేసిన అప్పుతో పోలిస్తే వీరు రెండేళ్లలోనే ఆ స్థాయికి చేరుకున్నారు. కానీ ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకం అమలు కావడం లేదు. సూపర్ సిక్స్ హామీలు గాలికి ఎగిరిపోయాయి. నాడు బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు వేస్తే నేడు ఆ నిధులన్నీ పాలకుల జేబుల్లోకి వెళ్తున్నాయి అని ఆయన ఆరోపించారు. జగన్ హయాంలో జరిగిన మేలు గురించి చంద్రబాబు ఎందుకు చేయడం లేదన్న అంశంపై ఇప్పుడు ప్రతి ఇంటిలోనూ చర్చ సాగుతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని సహజ వనరులను కూటమి నేతలు యథేచ్ఛగా దోచుకుంటున్నారని జగన్ మండిపడ్డారు. మద్యం, ఇసుక, మట్టి, ఖనిజ సంపద నుంచి అమరావతి నిర్మాణాల వరకు అంతా అవినీతిమయమని ధ్వజమెత్తారు. ప్రభుత్వ భూములను తమ అనుచరులకు 'పప్పు బెల్లాలు గా పంచుతున్నారని, దీనివల్ల ప్రభుత్వ ఆదాయం పడిపోయి ఖజానా ఖాళీ అవుతోందని విమర్శించారు. విద్యా, వైద్య రంగాలను ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో పేదలకు వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళలపై అరాచకాలు.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన వైఖరి
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని కూటమి నేతలు మహిళలపై దాడులకు తెగబడుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు కనీస చర్యలు తీసుకోవడం లేదని జగన్ మండిపడ్డారు. పీఏల నుంచి ఎంపీల వరకు అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని డ్రగ్స్ వ్యవహారాలు వెలుగులోకి వచ్చినా 'నో యాక్షన్' బోర్డు తిప్పుతున్నారని ఎద్దేవా చేశారు. పాలకుల మైండ్‌సెట్ మారనంత వరకు రాష్ట్రానికి మేలు జరగదని ఆయన స్పష్టం చేశారు.
ఏడాదిన్నరలో పాదయాత్ర.. 'జగన్ 2.ఓ'కు సిద్ధం
పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ ఈ ప్రభుత్వానికి మిగిలింది ఇంకా మూడేళ్లు మాత్రమేనని మరో ఏడాదిన్నర తర్వాత తాను మళ్ళీ జనంలోకి వస్తానని జగన్ ప్రకటించారు. దాదాపు ఏడాదిన్నర పాటు సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి ప్రజలతోనే ఉంటానని వెల్లడించారు. "జగన్ 2.ఓ ప్రభుత్వంలో పార్టీ కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఉంటుంది. ప్రతి పథకం, అభివృద్ధి కార్యక్రమం కార్యకర్తల ద్వారానే సాగుతాయి అని భరోసా ఇచ్చారు. ఒంగోలు ఇంచార్జ్‌గా చుండూరి రవిబాబు సేవలను కొనియాడుతూ అందరూ కలిసికట్టుగా పోరాడి విజయం సాధించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
