
కూటమిలో చిచ్చు రాజేసిన ఐరన్ ఓర్
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పటికే 16 నెలల పాలన పూర్తీ చేసుకుంది. అక్కడక్కడ మూడు పార్టీల మధ్య విబేధాలు కనిపిస్తున్నప్పటికీ.. ఎవరో ఒకరు సర్దుకుపోతున్నారు. కానీ అనంతపురం జిల్లాలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. కూటమి పార్టీల నేతల కొట్లాట అసెంబ్లీ వరకు వెళ్లింది. టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు, బీజేపీ నేత కాపు రామచంద్రారెడ్డి మధ్య వివాదం కూటమిలో కుంపటి రాజేస్తోంది. కాల్వ, కాపు మధ్య విబేధాలకు కారణం ఏంటి ? ఎందుకు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు?
వైసీపీ హయాంలో సీబీఐ సీజ్ చేసిన లక్ష మెట్రిక్ టన్నుల ఐరన్ ఓర్ అక్రమంగా తరలించారని టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. ఐరన్ ఓర్ అక్రమ తరలింపుపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు డిమాండ్ పై బీజేపీ నాయకుడు కాపు రామచంద్రారెడ్డి స్పందించారు. వైసీపీ హయాంలోనే కాదు. ఇప్పుడు కూడా అక్రమాలు జరుగుతున్నాయి. వాటిపైన విచారణ జరపాలి అంటూ కాపు రామచంద్రారెడ్డి కోరారు. టీడీపీ, బీజేపీ నాయకుల మధ్య ఈ మాటల తూటాలకు కారణం ఏంటన్న చర్చ జరుగుతోంది.
కాల్వ శ్రీనివాసులుపై కాపు రామచంద్రారెడ్డి ఎందుకు ప్రత్యారోపణలు చేస్తున్నారనే ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే కాల్వ శ్రీనివాసులు ఆరోపణలు చేసింది కాపు రామచంద్రారెడ్డిపైనే. వైసీపీ హాయంలో రాయదుర్గం ఎమ్మెల్యేగా ఉన్నది కాపు రామచంద్రారెడ్డి. 2024 ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో బీజేపీలోకి వెళ్లారు. ఎన్నికల్లో కాపు, కాల్వ ఇద్దరూ కలిసి పనిచేశారు. కానీ అధికారం వచ్చాక ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయి. దీంతో వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేస్తున్నారు. కౌంటర్ గా కాల్వ శ్రీనివాసులు అక్రమాలపై విచారణ జరపాలని కాపు రామచంద్రారెడ్డి డిమాండ్ చేస్తున్నారు.
రెండు కత్తులు ఒకే ఒరలో ఉండలేవన్నట్టుగా కాపు, కాల్వ వ్యవహారం ఉంది. కాపు రామచంద్రారెడ్డి బీజేపీలో ఉన్నప్పటికీ టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు దగ్గరికి రానివ్వడంలేదు. కాపు పెత్తనం జరగనివ్వడంలేదు. దీంతో కాపు రామచంద్రారెడ్డి కాల్వ శ్రీనివాసులుపై ఎదురుదాడికి దిగుతున్నారు. వైసీపీ హయాంలో అక్రమాలపై విచారణ కోరడం అంటే తనపై విచారణ కోరడమే అని కాపు రామచంద్రారెడ్డి భావిస్తున్నారు. అందుకే టీడీపీ కూటమి ప్రభుత్వంలో అక్రమాలపై కూడా విచారణ జరపాలని కాపు డిమాండ్ చేస్తున్నారు. ఇద్దరి మధ్య వివాదం అసెంబ్లీ వరకు వెళ్లడం. అసెంబ్లీలో కాల్వ శ్రీనివాసులు విచారణ కోరడం. కాపు దానిపై కౌంటర్ ఇవ్వడంతో అనంతపురం జిల్లా కూటమి పార్టీల్లో వివాదం రాజుకుంది.
