

కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు భూముల వేలం రద్దు చేయాలి: ఎంపీ ఈటల
తెలంగాణ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులోని వేలానికి ఉంచిన ఓపెన్ ప్లాట్లను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పేదల సొంతింటి కలను నెరవేర్చాల్సిన హౌసింగ్ బోర్డును రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థగా మార్చారని ఆరోపించారు.
నిజాం పాలనలో 1908లో వచ్చిన వరదల తర్వాత ప్రజలకు ఇళ్లను నిర్మించేందుకు 1911లో ‘సిటీ ఇంప్రూవ్‌మెంట్ బోర్డు’ ఏర్పాటు చేశారని ఈటల తెలిపారు. 1931లో ‘సికింద్రాబాద్ ఇంప్రూవ్‌మెంట్ బోర్డు’ ఏర్పడి, 1960లో అది హౌసింగ్ బోర్డుగా మారిందన్నారు. కూకట్‌పల్లి, కైతలాపూర్, హైదర్‌నగర్ గ్రామాల పరిధిలో సుమారు 1,400 ఎకరాలను సేకరించి పేదలు, ఉద్యోగులకు అందుబాటులో ఉండేలా వివిధ పరిమాణాల్లో ప్లాట్లు రూపొందించారని చెప్పారు. జేఎన్‌టీయూకు కూడా హౌసింగ్ బోర్డు 100 ఎకరాలను లీజుకు ఇచ్చిందన్నారు.
భూముల విక్రయాలు & ప్రస్తుత పరిస్థితి
2005-06లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో కూకట్‌పల్లిలో భూముల విక్రయాలు ప్రారంభమయ్యాయని ఈటల పేర్కొన్నారు. మలేషియా టౌన్‌షిప్‌కు 36 ఎకరాలు, హిందూ ప్రాజెక్ట్‌కు 70 ఎకరాలు, లోధాకు 18 ఎకరాలు, ఇండీస్ వన్ సిటీకి 12 ఎకరాలు విక్రయించారని తెలిపారు. ఈ సంస్థలు పేదలకు కూడా ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే నిబంధన ఉన్నప్పటికీ, మలేషియా టౌన్‌షిప్ మినహా మిగతా వాటిలో ఆ లక్ష్యం నెరవేరలేదని ఆయన ఆరోపించారు.
భూముల విక్రయాల ద్వారా వచ్చిన సుమారు రూ.1,200 కోట్లు హౌసింగ్ బోర్డు ఖాతాలో ఉండగా, ప్రస్తుత ప్రభుత్వం వాటిని తీసుకుందని ఈటల ఆరోపించారు. ఇటీవల గోద్రెజ్ సంస్థకు ఎనిమిది ఎకరాల భూమిని విక్రయించారని చెప్పారు. అత్యంత జనసాంద్రత కలిగిన కూకట్‌పల్లి ప్రాంతంలో ఖాళీ స్థలాలను విక్రయించడం వల్ల భవిష్యత్తులో అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఫైర్ ఇంజిన్లు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
స్కూళ్లు, పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, దేవాలయాలు, ఆసుపత్రుల కోసం ఖాళీ స్థలాలను కేటాయించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. హౌసింగ్ బోర్డు చట్టం ఉద్దేశం పేదలకు ఇళ్ల స్థలాలు, గృహాలు కల్పించడమే తప్ప భూములను విక్రయించి ఆదాయం సమకూర్చుకోవడం కాదన్నారు. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు భూములకు రూ.1.60 లక్షల బేస్ ప్రైస్ నిర్ణయించి వేలం వేయడం సరికాదని పేర్కొన్నారు.
ఎల్లమ్మబండ వివాదం
ఎల్లమ్మబండ, షంషీగూడ సర్వే నంబర్ 57 భూముల వ్యవహారంపైనా ఈటల ఆరోపణలు చేశారు. 2007 నుంచి ఆ భూముల పరిరక్షణ కోసం పోరాడుతున్నానని తెలిపారు. సుమారు 300 ఎకరాల్లో 170 ఎకరాలను పేదలు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలుగా కేటాయించినప్పుడు అవి ప్రభుత్వ భూములు కాకపోతే ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. మిగిలిన సుమారు 130 ఎకరాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు.
ఐడీఎల్‌లో ‘హానర్ హోమ్స్’ పేరుతో నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్లపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గతంలో జరిగిన భూ కేటాయింపులపై విచారణ చేస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి ఈ వ్యవహారంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అక్రమంగా ఆక్రమించిన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరారు.
22ఏ నిబంధన తెచ్చి భూములను వెనక్కి తీసుకుంటే ప్రభుత్వానికి రూ.10 లక్షల కోట్లు వస్తాయని, కానీ అందులో 30 శాతం సొమ్ము చేతులు మారేలా కుమ్మక్కవుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అర్బన్ సీలింగ్ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలను నిలిపివేయాలని ఈటల డిమాండ్ చేశారు. భూకబ్జాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైతే బాధ్యత వహించి రాజీనామా చేయాలని అన్నారు. ప్రభుత్వ ఆస్తుల విక్రయాలను నిలిపివేయకపోతే ప్రజల నుంచి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
బస్తీల్లో జీవించే పేదలకు వారి ఉపాధి ప్రాంతాలకు దూరంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మిస్తే జీవనోపాధికి ఇబ్బందులు ఏర్పడతాయని ఈటల అన్నారు. ఎక్కడ నివసిస్తున్నారో అక్కడే వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదల ఇళ్ల కోసం ప్రభుత్వం వద్ద బడ్జెట్ లేదా అని ప్రశ్నించారు. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులో సెప్టెంబర్ 2న నిర్వహించనున్న భూముల వేలాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
