
కూకట్‌పల్లి నల్ల చెరువు కొత్త రూపు
కూకట్‌పల్లి ప్రాంతంలోని నల్ల చెరువు ఇప్పుడు నగర ప్రజలకు ఆహ్లాదకరమైన విశ్రాంతి కేంద్రముగా మారింది. ఒకప్పుడు ఆక్రమణలకు గురై నిర్మాణ వ్యర్థాలతో నిండిపోయిన ఈ చెరువు హైడ్రా ఆధ్వర్యంలో ఆరు నెలల్లోనే సరికొత్త అందాలను సంతరించుకుంది. ప్రస్తుతం ఇది నీటితో నిండుకుండలా మెరిసిపోతూ, బోటు షికారుకు చిరునామాగా మారింది. చెరువు చుట్టూ సేదతీరటానికి ప్రజలు విపరీతంగా తరలి వస్తున్నారు.
హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ స్వయంగా ఈ అభివృద్ధి పనులను పరిశీలించారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్‌ను అంతరాయం లేకుండా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. భద్రతను దృష్టిలో ఉంచుకుని సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, చిన్నారుల ఆడుకునేందుకు ప్లే ఏరియాలు, పెద్దల కోసం గజిబిజిలేని విశ్రాంతి గజబోలు (విశ్రాంతి మందిరం) నిర్మించాలని ఆదేశించారు. అలాగే చెరువు పరిసరాల్లో మెడిసినల్ ప్లాంట్స్ నాటడం ద్వారా ఆరోగ్య వాతావరణం నెలకొల్పాలన్నారు.
చేరువు ఆక్రమణలకు గురై నిర్మాణ వ్యర్థాలతో నిండిపోయి మురికి కూపంగా మారిన చెరువు సరికొత్త జలాశయంగా కనిపిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు నిండుకుండలా మారిందని అక్కడ నివాసం ఉన్న వాళ్లే అచ్చెరవొందేలా కూకట్‌పల్లి నల్ల చెరువు తయారయ్యిందని పేర్కొన్నారు.చెరువు అభివృద్ధిపట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.ఉదయం సాయంత్రం వందలాది మంది ఇక్కడకు చేరుకుని సేదదీరుతున్నారు. నీటి లోతు సుమారు 4 మీటర్ల మేర పెరిగిందని ఆయన తెలిపారు. ఫలితంగా నీటి నిల్వ సామర్థ్యం విస్తరించి, చెరువుకు పునర్జీవం లభించింది. మురుగు నీరు చెరువులోకి చేరకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం వలన మురికివాసన పూర్తిగా తగ్గిపోయిందని పేర్కొన్నారు.
మునుపు ఆక్రమణలతో 16 ఎకరాలకే పరిమితమైన నల్ల చెరువును రెవెన్యూ, గ్రామ రికార్డుల ఆధారంగా హైడ్రా 30 ఎకరాల పాత పరిమితికి విస్తరించింది. చెరువు పరిధిలోని 16 వ్యాపార షెడ్లను కూల్చివేయడం ద్వారా చెరువు వైశాల్యం పునరుద్ధరించబడింది.ప్రస్తుతం చెరువు పరిసరాల్లో నడక మార్గాలు, బెంచీలు, లైటింగ్ సదుపాయాలు, పిల్లల ఆట స్థలాలు ఏర్పాటు చేస్తున్నారు. బతుకమ్మ పండుగల కోసం చెరువు పక్కనే ప్రత్యేక వేదిక సిద్ధం చేయబడుతోంది. బతుకమ్మలను గంగలో కలపడానికి చిన్న కుంటను కూడా హైడ్రా ఏర్పాటు చేస్తోంది.
కేవలం ఆరు నెలల్లో నల్ల చెరువు పూర్తిగా మారిపోయింది. ప్రజలు కుటుంబాలతో వచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. ఇది ఇప్పుడు హైడ్రా నగరానికి గర్వకారణం” అని కమిషనర్ పేర్కొన్నారు.నగర ప్రజలు కూడా ఈ అభివృద్ధి పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారాంతాల్లో వందలాది మంది కుటుంబాలతో వచ్చి సేదతీరుతున్నారు. ఒకప్పుడు మురికిగా ఉన్న నల్ల చెరువు, ఇప్పుడు హైడ్రా కృషితో హరిత, హైజీనిక్, హాయిగా మారి ప్రజల హృదయాలను ఆకట్టుకుంటోంది.
