
కువైట్‌లో 3 అమెరికా యుద్ధ విమానాల కూల్చివేత
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. ఇరాన్ లక్ష్యంగా అమెరికా నేతృత్వంలో సాగుతున్న 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కువైట్ గగనతలంలో ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను అడ్డుకునే క్రమంలో.. కువైట్ వైమానిక రక్షణ దళాలు పొరపాటున అమెరికాకు చెందిన మూడు ఎఫ్-15ఇ యుద్ధ విమానాలను కూల్చివేశాయి. ఈ 'ఫ్రెండ్లీ ఫైర్' ఘటనను అమెరికా సెంట్రల్ కమాండ్ ధ్రువీకరించింది. అదృష్టవశాత్తూ విమానాల్లోని ఆరుగురు సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు.
గురితప్పిన కువైట్ రక్షణ వ్యవస్థ
సోమవారం తెల్లవారుజామున ఇరాన్ నుంచి భారీగా డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు కువైట్ వైపు దూసుకొచ్చాయి. వీటిని అడ్డుకునే క్రమంలో కువైట్ రక్షణ దళాలు జరిపిన కాల్పులు పక్కనే ఉన్న అమెరికా యుద్ధ విమానాలకు తగిలాయి. విమానాలు కూలిపోతుండగా పైలట్లు పారాచూట్ల సాయంతో కిందికి దిగారు. కువైట్‌లోని అల్ జహ్రా ప్రాంతంలో విమాన శకలాలు పడటం, పైలట్లు పారాచూట్లలో దిగుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై కువైట్ ప్రభుత్వం విచారం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించింది. మరోవైపు మినా అల్-అహ్మదీ రిఫైనరీపై విమాన శకలాలు పడటంతో ఇద్దరు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి.
అమెరికా రాయబార కార్యాలయంపై దాడి
విమానాల కూల్చివేత ఘటన జరుగుతున్న సమయంలోనే కువైట్ సిటీలోని అమెరికా ఎంబసీ కాంపౌండ్‌లో భారీ పేలుడు సంభవించింది. భవనం లోపలి నుంచి దట్టమైన పొగలు, మంటలు వ్యాపించాయి. ఇరాన్ జరిపిన దాడి వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. వెంటనే అప్రమత్తమైన ఎంబసీ అధికారులు.. అమెరికా పౌరులెవరూ కార్యాలయానికి రావద్దని, అందరూ సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు. కిటికీలకు దూరంగా, భవనాల కింది అంతస్తుల్లో ఉండాలని సూచించారు.
ముదురుతున్న ఇరాన్- అమెరికా పోరు
గత శనివారం ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతికారంగా ఇరాన్ వరుసగా మూడవ రోజు గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతోంది. కేవలం కువైట్ మాత్రమే కాకుండా దుబాయ్, దోహాలలో కూడా సోమవారం ఉదయం భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అమెరికా స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తామని హెచ్చరించిన టెహ్రాన్, ఇప్పుడు పౌర, వాణిజ్య ప్రాంతాలను కూడా లక్ష్యంగా చేసుకుంటోంది. ఇరాన్ తన పాత యుద్ధ విమానాలను కూడా ఈ పోరులో రంగంలోకి దించడం గమనార్హం. ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో గగనతల రవాణా, వాణిజ్యం తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
