
కువైట్‌లో ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) 72వ జన్మదిన వేడుకలు కువైట్‌లో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ ఎన్‌ఆర్‌ఐ కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకోవాలని నిర్ణయించిన నిర్వాహకులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పలువురు సభ్యులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సామాజిక బాధ్యతను చాటుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి కేసీఆర్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా అభిలాష గొడిశాల మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన నుంచి నేటి అభివృద్ధి వరకు కేసీఆర్ అందించిన నాయకత్వం అద్భుతమని, అది చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు.కేసీఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, త్వరలోనే ఆయనను మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రిగా చూడాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆమె తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి ఆయన నాయకత్వంలోనే సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ భవన్ లో 72వ జన్మదిన వేడుకలు
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ లో భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు పార్టీ నాయకుడు తలసాని సాయికిరణ్ యాదవ్ తెలిపారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని బీఆర్‌ఎస్ యూఎస్‌ఏ అడ్వైజరీ బోర్డు చైర్మన్ మహేష్ తన్నీరు రూపొందించిన ప్రత్యేక గీతాన్ని విడుదల చేయనున్నారు.
