Let's talk: editor@tmv.in
‘కుల రహిత గ్రామం’గా మహారాష్ట్రలోని సౌందాల

‘కుల రహిత గ్రామం’గా మహారాష్ట్రలోని సౌందాల

Pinjari Chand
13 ఫిబ్రవరి, 2026

మహారాష్ట్రలోని అహిల్యానగర్ జిల్లా నేవాసా తాలూకాలో ఉన్న సౌందాల గ్రామసభ గ్రామాన్ని ‘కుల రహిత గ్రామం’గా ప్రకటిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. కులవివక్ష, అంటరానితనం, సామాజిక అసమానతలను నిర్మూలించడమే లక్ష్యమని ఈ నిర్ణయం తీసుకున్న గురువారం తెలిపారు. ఫిబ్రవరి 5న సర్పంచ్ అధ్యక్షతన జరిగిన గ్రామపంచాయతీ సమావేశంలో రాజ్యాంగంలో పొందుపరిచిన సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం సూత్రాల ఆధారంగా మానవతా సమాజ వ్యవస్థను ఏర్పరచాలనే అంశంపై విస్తృతంగా చర్చించి ఈ తీర్మానాన్ని ఆమోదించారు.

తీర్మానం ప్రకారం, సౌందాల గ్రామంలో కులం, మతం, వంశం, సంప్రదాయం ఆధారంగా ఎలాంటి వివక్ష ఉండదు. గ్రామంలో అందరినీ సమానంగా పరిగణిస్తారు. నా కులం – మానవత్వం అనే భావనను గ్రామస్థులు సమష్టిగా స్వీకరించినట్లు తీర్మానంలో పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలు, నీటి వనరులు, దేవాలయాలు, శ్మశానవాటికలు, పాఠశాలలు, సామాజిక కార్యక్రమాలు సహా అన్ని ప్రజా స్థలాలు వివక్ష లేకుండా అందరికీ అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. అంటరానితనం, సామాజిక బహిష్కరణ లేదా సామాజిక అసమానతకి దారితీసే ఏ విధమైన విషయాలను గ్రామస్థులు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయరాదని గ్రామసభ తీర్మానించింది. ఉల్లంఘనలపై ఫిర్యాదులు వచ్చినా, స్వయంగా గానీ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే, రాజర్షి షాహూ మహారాజ్, మహాత్మా గాంధీ ఆశయాల స్ఫూర్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సామాజిక కార్యకర్త ప్రమోద్ జింఝాడే మార్గదర్శకత్వం అందించారని పేర్కొన్నారు. ఈ తీర్మానాన్ని శరద్ బాబురావ్ అర్గడే ప్రతిపాదించగా, బాబాసాహెబ్ మచ్చింద్ర బోధక్ మద్దతు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ తీర్మానాన్ని తదుపరి చర్యల కోసం పంపించారు.

కుల రహిత గ్రామం పేరిట తీసుకున్న ఈ తీర్మానం కుల ఆధారిత వివక్షను నిర్మూలించడమే కాకుండా గ్రామంలో ఐక్యతను బలోపేతం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుందని సర్పంచ్ అర్గడే పిటిఐకి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కుల వివక్ష అనే అంశం లోతుగా ఉంది. అది మా గ్రామంలోకి రాకుడదని మా సంకల్పం. ప్రజా స్థలాల్లో అంటరానితనం విస్తృతంగా ఉంది. కుల అంశాలపై సోషల్ మీడియా పోస్టులను కూడా పరిశీలిస్తాం. ఫిర్యాదులు వచ్చినా, స్వయంగా గుర్తించినా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

ఇంతకుముందు గ్రామంలోని వితంతువులపై వివక్షాపూరితమైన ఆచారాలకు వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించింది. తల్లులు, సోదరీమణులను అవమానించే విధంగా ప్రవర్తిస్తే జరిమానా విధించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఒక వితంతు పునర్వివాహం జరగగా, చెడు మాటలు మాట్లాడడంపై 13 మందికి రూ.500 చొప్పున జరిమానా విధించినట్లు అర్గడే తెలిపారు. సుమారు 25,000 జనాభా కలిగిన ఈ గ్రామంలో తీర్మానాల అమలుకు పలు ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామ ప్రజల ప్రధాన ఆదాయ వనరులు చెరకు సాగు, పాల ఉత్పత్తి అని ఆయన పేర్కొన్నారు.

పశ్చిమ మహారాష్ట్రలోని అహిల్యానగర్ జిల్లాకు కుల హింస, సామాజిక ఉద్రిక్తతల చరిత్ర ఉంది. 2013 సోనాయి త్రిపుల్ హత్య, 2014 జవ్ఖెడే త్రిపుల్ హత్య, ఖర్డా హత్య వంటి ఘటనలు జిల్లాను ‘అట్రాసిటీ ప్రోన్ జిల్లా’ జాబితాలో ఉంచాయి. సౌందాల గ్రామంలో కూడా గతంలో కుల హింస కేసులు నమోదైనట్లు అర్గడే తెలిపారు. అయితే గ్రామస్థుల్లో సామాజిక చైతన్యం పెరగడంతో ఇటువంటి ఘటనలు గణనీయంగా తగ్గాయని చెప్పారు. ఇప్పుడు ప్రజలు పరస్పరం ఒకరి ఇళ్లకు ఒకరు వెళ్లి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కష్ట సమయంలో ఒకరికి ఒకరు తోడుగా నిలుస్తున్నారని ఆయన అన్నారు. ప్రస్తుతం కులాంతర, మతాంతర వివాహాలు లేవని, కానీ ఈ తీర్మానం అలాంటి మార్పులకు దారితీస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.