
కులగణన త్వరగా పూర్తి చేయాలి: సీపీఐ రామకృష్ణ
జనగణనలో కులగణన త్వరగా పూర్తీ చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం పుట్టపర్తిలోని సాయి ఆరామంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడారు. కులగణన రాష్ట్రంలో వీలైనంత త్వరగా పూర్తీ చేయాలని కోరారు. అప్పుడే ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ఆ దిశగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని కోరారు. కులగణన జరిగితే జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు దక్కుతాయని తెలిపారు.
బీసీల్లోని కొన్ని కులాలకు మాత్రమే రాజకీయ ప్రాధాన్యత దక్కుతోందని అన్నారు. కులగణన జరగడం వల్ల ఏ కులం వెనుకబడింది, ఎవరికి ఏ విధమైన అవసరాలు ఉన్నాయన్న స్పష్టత వస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ చెప్పారు. తెలంగాణలోలాగ ఏపీ ప్రభుత్వం జనగణనకు సంబంధించిన నిర్ణయం త్వరగా తీసుకోవాలని కోరారు.
కర్ణాటక ముఖ్యమంత్రి కులగణన పూర్తీ చేసి నివేదిక పంపాలని ఆదేశించారని, తెలంగాణ ప్రభుత్వం కూడా జనాభా లెక్కల ప్రకారం కులగణన చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు కేటాయిస్తు అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని సీపీఐ రామకృష్ణ గుర్తు చేశారు. బీసీ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. బీసీలు ఐక్యంగా హక్కుల కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఐ రామకృష్ణ గుర్తుచేశారు.
