
కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు
కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు జనగణనలో కులగణన చేపట్టారని, దానిని సంపూర్ణంగా అమలు చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అందుకు అనుగుణంగానే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించారని, ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించారని అన్నారు. అనంతపురం నగరంలోని రాయల్ ఫంక్షన్ హాల్‌లో జనగణనలో కులగణన చేపట్టాలని సీపీ సదస్సు నిర్వహించింది. పలు రాజకీయ పార్టీల నాయకులు సదస్సుకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కులగణన పూర్తి చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని పనిచేస్తున్నారని తెలిపారు. ఏపీలోని కూటమి ప్రభుత్వం కూడా కులగణన చేపట్టి సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. ఏపీలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన వారికి సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రెండు వారాల్లో కులగణన పూర్తి చేయడం పెద్ద కష్టం కాదని, అన్ని రాజకీయ పార్టీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు ముక్తకంఠంతో కోరుతున్నామని తెలిపారు.
బీసీ పార్టీ అని చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ కులగణన చేపట్టాలి, జనాభా ప్రాతిపదికన వారికి అవకాశం ఇవ్వాలని కోరారు. ఏపీలోని 26 జిల్లాల్లో కులగణన సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. అన్ని వర్గాల వారికి అన్ని రకాల అవకాశాలు ఇవ్వాలని కోరారు. అన్ని జిల్లాల్లో సమావేశాలు పూర్తి అయ్యాక చలో అమరావతి కార్యక్రమానికి పిలుపునిస్తామని తెలిపారు. కులగణన పూర్తి అయ్యాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు. గతంలో నష్టపోయామని, ఈసారైనా న్యాయం చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.
