Let's talk: editor@tmv.in
కుర్దిస్తాన్ అధ్యక్షుడి నివాసంపై డ్రోన్ దాడి

కుర్దిస్తాన్ అధ్యక్షుడి నివాసంపై డ్రోన్ దాడి

Shaik Mohammad Shaffee
30 మార్చి, 2026

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ఇరాక్ పరిధిలోని స్వయంప్రతిపత్తి గల కుర్దిస్తాన్ ప్రాంత అధ్యక్షుడు నెచిర్వాన్ బర్జానీ నివాసంపై శనివారం డ్రోన్ దాడి జరగడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. దుహోక్ నగరంలోని ఆయన ప్రైవేట్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు కుర్దిస్తాన్ ప్రాంతీయ ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఘటనలో ప్రాణనష్టంపై స్పష్టత లేనప్పటికీ, ఇది అత్యంత పిరికిపంద చర్య అని కుర్దిష్ వర్గాలు మండిపడ్డాయి.

పిరికిపంద చర్య: కుర్దిస్తాన్ ప్రధాని

ఈ దాడిని కుర్దిస్తాన్ ప్రధాని మస్రూర్ బర్జానీ తీవ్రంగా ఖండించారు. "ఇది మా సార్వభౌమత్వంపై జరిగిన దాడి. నేరస్థులను పట్టుకుని కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత ఇరాక్ ఫెడరల్ ప్రభుత్వంపై ఉంది" అని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాద గ్రూపుల ఆగడాలను అరికట్టేందుకు అంతర్జాతీయ సమాజం తమకు మద్దతుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. తమ పౌరులను రక్షించుకోవడానికి, ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి తమకు అన్ని హక్కులు ఉన్నాయని, అవసరమైతే దీటుగా స్పందిస్తామని ఆయన హెచ్చరించారు.

ఇరాన్ పనేనన్న అమెరికా.. కొట్టిపారేసిన టెహ్రాన్

ఈ దాడిపై అమెరికా, ఇరాన్ దేశాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. అమెరికా విదేశాంగ శాఖ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ.. దీని వెనుక ఇరాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద ముఠాల హస్తం ఉందని ఆరోపించింది. ఇరాక్ స్థిరత్వాన్ని దెబ్బతీసేందుకే ఇరాన్ ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని అమెరికా ప్రతినిధి థామస్ పిగాట్ విమర్శించారు.

మరోవైపు, ఇరాన్ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. ఇరాన్ సైనిక విభాగం ఐఆర్జీసీ మాట్లాడుతూ.. ఇది అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేసిన కుట్ర అని ఆరోపించింది. కుర్దిస్తాన్ అధ్యక్షుడిని హతమార్చేందుకు జరిగిన ప్రయత్నంగా దీనిని అభివర్ణించింది. ప్రాంతీయ సహకారాన్ని దెబ్బతీసేందుకు శత్రు దేశాలు చేస్తున్న ప్రయత్నాల్లో ఇది భాగమని ఇరాన్ పేర్కొంది.

మద్దతుగా నిలిచిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్

కుర్దిస్తాన్ నాయకత్వానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తన సంఘీభావాన్ని ప్రకటించారు. అధ్యక్షుడు బర్జానీతో ఫోన్లో మాట్లాడిన ఆయన, ఇటువంటి దాడులు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఇటీవల ఆరుగురు పెష్మెర్గా సైనికుల మరణాన్ని గుర్తు చేస్తూ.. ఇరాక్ యుద్ధంలోకి నెట్టబడకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇరాక్ ప్రభుత్వానికి ఫ్రాన్స్ ఎప్పుడూ మంచి మిత్రుడిలా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

ముదురుతున్న ఉద్రిక్తతలు

గత నెల ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించినప్పటి నుండి ఈ ప్రాంతంలో పరిస్థితులు విషమించాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఆస్తులపై దాడులు చేస్తోంది. తాజా డ్రోన్ దాడి ఈ ఉద్రిక్తతలను మరింత పెంచి, అంతర్జాతీయ ఇంధన మార్కెట్లు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.