Let's talk: editor@tmv.in
కుప్పకూలిన టీం ఇండియా

కుప్పకూలిన టీం ఇండియా

Pinjari Chand
23 ఫిబ్రవరి, 2026

గ్రూప్ దశలో వరుసగా నాలుగు విజయాలతో దూసుకెళ్లిన భారత్ అసలు పరీక్షలో తడబడింది. “ఎటాక్ ఎట్ ఆల్ కాస్ట్” అనే ఏకైక వ్యూహంతో ముందుకు సాగుతున్న భారత బ్యాటింగ్ బలహీనతలను దక్షిణాఫ్రికా పూర్తిగా బట్టబయలు చేసింది. సూపర్ ఎయిట్ తొలి మ్యాచ్‌లోనే 76 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. దీంతో గ్రూప్ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.2022 ఎడిషన్‌లో ఇంగ్లండ్ చేతిలో సెమీఫైనల్ ఓటమి తర్వాత ఇదే భారత్‌కు మొదటి ప్రపంచకప్ పరాజయం. ఇప్పుడు జింబాబ్వే (ఫిబ్రవరి 26), వెస్టిండీస్ (మార్చి 1) మ్యాచ్‌లు ‘డూ ఆర్ డై’గా మారాయి. సూపర్ –8 కీలక పోరులో భారత్‌కు భారీ షాక్ తగిలింది. దక్షిణాఫ్రికా జట్టు అన్ని విభాగాల్లో మెరుగైన ఆటతీరు ప్రదర్శించి 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌లో అనుభవం, బౌలింగ్‌లో కట్టుదిట్టమైన నియంత్రణతో భారత జట్టును పూర్తిగా చుట్టుముట్టింది.

మొదట బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా తరఫున డేవిడ్ మిల్లర్ జోరు చూపిస్తూ 35 బంతుల్లో 63 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేశాడు. యువ ఆటగాడు డేవాల్డ్ బ్రేవిస్ (29 బంతుల్లో 45)తో కలిసి నాలుగో వికెట్‌కు కేవలం 51 బంతుల్లో 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో ప్రోటిస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 187 పరుగులు చేసింది. ఆరంభంలో భారత బౌలర్లు గట్టిగా దెబ్బకొట్టారు. జస్ప్రీత్ బుమ్రా (4 ఓవర్లు 15 పరుగులు 3 వికెట్లు), అర్షదీప్ సింగ్ (2/28)లు దక్షిణాఫ్రికాను 20/3కు పడ్డగొట్టారు. కానీ ఆ తర్వాత మిల్లర్–బ్రెవిస్ జోడీ మ్యాచ్‌ను తారుమారు చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ డేవిడ్ మిల్లర్ దక్కించుకున్నాడు.

187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభం నుంచే కుదేలైంది. కెప్టెన్ ఐడెన్ మర్క్రమ్ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుని స్వయంగా ఆఫ్‌స్పిన్‌తో కొత్త బంతి అందుకుని తొలి ఓవర్లోనే ఇషాన్ కిషన్‌ను ఔట్ చేశాడు. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ 15 పరుగులకే వెనుదిరిగాడు. పవర్‌ప్లేలోనే భారత్ 26/3తో ఒత్తిడిలో పడింది.

పూర్తిగా విఫలమైన మిడిల్ ఆర్డర్

శివమ్ దుబే(37 బంతుల్లో 42) మాత్రమే ప్రతిఘటించాడు. అయితే దక్షిణాఫ్రికా బౌలర్లు ప్రణాళిక ప్రకారం బంతులు వేసి భారత ఇన్నింగ్స్‌ను 18.5 ఓవర్లలో 111 పరుగులకే ముగించారు. భారత ఆటగాళ్లలో ఆరుగురు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. అందులో నలుగురు డకౌటయ్యారు.

మార్కూ జన్సెన్ (4/22), కేశవ్ మహారాజ్ (3/24), కోర్బిన్ బోచ్ (2/12) విజయంలో కీలక పాత్ర పోషించారు. వికెట్లు తీసుకోకపోయినా నింగిడి నాలుగు ఓవర్లలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి భారత్‌పై ఒత్తిడి కొనసాగించాడు. ఈ ఓటమితో సూపర్ ఎయిట్ దశలో భారత్‌కు సెమీఫైనల్ ఆశలు క్లిష్టంగా మారాయి. బ్యాటింగ్‌లో అస్థిరత, కీలక సమయంలో భాగస్వామ్యాల లేమి జట్టుకు భారమయ్యాయి.

సంక్షిప్త స్కోర్లు:

దక్షిణాఫ్రికా:

20 ఓవర్లలో 7 వికెట్లకు 187 (డేవిడ్ మిల్లర్ 63, డెవాల్డ్ బ్రెవిస్ 45)

భారత్:

18.5 ఓవర్లలో 111 ఆలౌట్ (శివమ్ దూబే 42)