Let's talk: editor@tmv.in
కుప్పం అభివృద్ధికి 2,203 కోట్ల పరిశ్రమల పెట్టుబడులు

కుప్పం అభివృద్ధికి 2,203 కోట్ల పరిశ్రమల పెట్టుబడులు

Panthagani Anusha
10 నవంబర్, 2025

రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అనుకూల వాతావరణం సృష్టిస్తోందని తెలిపారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గాన్ని పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

అమరావతి నుంచి వర్చువల్ పద్ధతిలో కుప్పంలో ఏడు పరిశ్రమలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. హిందాల్కో, శ్రీజా డైరీ, ఏస్ ఇంటర్నేషనల్, ఎస్వీఎఫ్ సోయా, మదర్ డైరీ, ఈ–రాయస్ ఈవీ, అలీప్ సంస్థలు రూ.2,203 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. వీటి ద్వారా 22,330 మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఈ సంస్థలకు ప్రభుత్వం 241 ఎకరాల భూమిని కేటాయించింది.

ఈ సందర్భంగా పరిశ్రమల ప్రతినిధులు, స్థానికులతో సీఎం ఆన్‌లైన్‌లో మాట్లాడారు. పరిశ్రమలకు త్వరితగతిన అనుమతులు అందించేందుకు తన అధ్యక్షతన పనిచేస్తోన్న రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ ) కీలక పాత్ర పోషిస్తోందన్నారు. త్వరలో రూ.6,339 కోట్లతో మరో ఎనిమిది సంస్థలు కుప్పం కి రానున్నాయని తద్వారా 43 వేల మందికి ఉపాధి కలుగుతుందని తెలిపారు.

స్థానిక యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించేందుకు హిందాల్కో సంస్థ రూ.586 కోట్లతో అడ్వాన్స్‌డ్ టెక్నికల్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. అదేవిధంగా శ్రీజా డెయిరీ రూ.290 కోట్లతో సమీకృత డెయిరీ, పశుమేత ప్లాంట్ స్థాపించనుంది. దీంతో స్థానిక మహిళలు, పాడి రైతులకు ప్రయోజనం కలుగుతుందని సీఎం పేర్కొన్నారు.

ఏస్ ఇంటర్నేషనల్ రూ.525 కోట్లతో డెయిరీ ప్రోటీన్ తయారీ యూనిట్, ఎస్వీఎఫ్ సోయా రూ.373 కోట్లతో సోయా ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నాయి. మదర్ డైరీ రూ.260 కోట్ల పెట్టుబడితో జ్యూస్, జామ్, పల్ప్ యూనిట్‌ను స్థాపించనుంది అని అయన చెప్పుకొచ్చారు.

గ్రీన్ మొబిలిటీ హబ్‌గా కుప్పం

ఈ–రాయస్ ఈవీ రూ.200 కోట్లతో ఎలక్ట్రిక్ ఆటోలు, ద్విచక్రవాహనాల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం తెలిపారు. దీంతో కుప్పం గ్రీన్ మొబిలిటీకి కేంద్రంగా మారుతుందని, అలీప్ సంస్థ రూ.27 కోట్లతో నిర్మించబోయే మహిళా పారిశ్రామిక పార్కులో 4 వేల మందికి ఉపాధి, శిక్షణ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.

‘వన్ ఫ్యామిలీ–వన్ ఎంటర్‌ప్రెన్యూర్’

ప్రతి మహిళ, ప్రతి యువత పారిశ్రామికవేత్త కావాలి. ఉన్నత విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యం. వన్ ఫ్యామిలీ–వన్ ఎంటర్‌ప్రెన్యూర్, వన్ ఫ్యామిలీ–వన్ ఏఐ నిపుణుడు వంటి పథకాలు చరిత్రను మార్చేస్తాయి" అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

కుప్పాన్ని 100 శాతం సౌర విద్యుత్ వినియోగ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నామని రోడ్లు, ఎయిర్ కనెక్టివిటీ, ఇన్నోవేషన్ హబ్, మెడికల్ డివైసెస్, లాజిస్టిక్స్, ఫుట్ వేర్ వంటి విభాగాల్లో కుప్పం కేంద్రంగా మారనున్నట్లు వెల్లడించారు.

సంక్షేమానికి అధిక ప్రాధాన్యత

ఎన్నికల హామీ ప్రకారం సూపర్ సిక్స్ అమలులోకి తెచ్చామని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని చెప్పారు. హంద్రీ–నీవా ద్వారా కుప్పానికి నీటిని అందించడం చారిత్రాత్మకమని, టాటా సంజీవని ద్వారా 57,545 మంది ప్రజలకు ఆరోగ్యసేవలు అందించామని తెలిపారు.

అదేవిధంగా కుప్పంలో 400 ఈ–సైకిళ్లు ఎస్ హెచ్ జి సభ్యులకు పంపిణీ, చెత్త సేకరణకు 130కి పైగా ఎలక్ట్రిక్–సియాన్ జి ఆటోలు వినియోగంలోకి తెచ్చామని తెలిపారు. వచ్చే మార్చి నాటికి కుప్పం రాష్ట్రంలో తొలి జీరో–ల్యాండ్‌ఫిల్ నియోజకవర్గంగా నిలవనుందని చెప్పారు. సింగిల్–యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉందని వివరించారు.

అంతకుముందు కుప్పం స్థానిక రైతులు, ప్రజలతో ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ గా మాట్లాడారు. పరిశ్రమలు స్థాపించడం ద్వారా తమకు ఉపాధి కల్పించినందుకు ముఖ్యమంత్రికి కుప్పం వాసులు ధన్యవాదాలు తెలిపారు. కుప్పానికి ఈ స్థాయిలో పరిశ్రమలు వస్తాయని కలలో కూడా అనుకోలేదని పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీల రాకతో తమ ఉత్పత్తులను స్థానికంగా విక్రయించే అవకాశం లభిస్తుందని ముఖ్యమంత్రికి రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సహా తదితరులు పాల్గొన్నారు.

కుప్పం అభివృద్ధికి 2,203 కోట్ల పరిశ్రమల పెట్టుబడులు - Tholi Paluku