
కుప్పంలో రూ.50 కోట్లతో ఇన్‌ఫ్రాక్రాఫ్ట్ తయారీ కేంద్రం
ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ ఆర్కిటెక్చరల్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రముఖ డిజైన్-ఫస్ట్ ఆర్కిటెక్చరల్ తయారీ సంస్థ 'ఇన్‌ఫ్రాక్రాఫ్ట్', చిత్తూరు జిల్లా కుప్పంలో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ మాన్యుఫాక్చరింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసేందుకు రూ. 50 కోట్ల పెట్టుబడితో రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇన్‌ఫ్రాక్రాఫ్ట్ సీఈఓ సహ వ్యవస్థాపకుడు భాస్కర్ కుమార్ ప్రభుత్వ ఉన్నతాధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. మూడు లక్షల చదరపు అడుగుల స్థలంలో ఏర్పాటు కానున్న ఈ కేంద్రం ద్వారా సుమారు 1,400 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి లభించనుంది.
ఈ ప్రాజెక్టు కేవలం పారిశ్రామిక వృద్ధికి మాత్రమే కాకుండా అత్యాధునిక సాంకేతికతను స్థానికులకు చేరువ చేయడంలో కీలక పాత్ర పోషించనుంది. ఇండస్ట్రీ 4.0 టెక్నాలజీ స్టాక్, ఇండస్ట్రియల్-గ్రేడ్ త్రీడీ స్కానింగ్, డిజిటల్ ట్విన్ సిస్టమ్స్ వంటి అత్యాధునిక సాంకేతికతలతో ఈ ప్లాంట్ పనిచేస్తుంది. కుప్పం కేంద్రంగా పనిచేసే ఈ హబ్ ద్వారా లండన్, న్యూయార్క్, ముంబై వంటి నగరాల నుంచి వచ్చే డిజైన్ డేటాను నేరుగా ప్రాసెస్ చేసి అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తులను తయారు చేయవచ్చు. వార్షికంగా రూ. 200–250 కోట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ కేంద్రం, ఆర్కిటెక్చరల్ తయారీ రంగంలో దేశానికే తలమానికంగా నిలవనుంది.
స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం ఇన్‌ఫ్రాక్రాఫ్ట్ సంస్థ ఎంఎస్ఎంఈ శాఖ జిల్లా అధికారులతో కలిసి పనిచేస్తోంది. ఈ ప్లాంట్ ద్వారా కేవలం ఉత్పత్తులు మాత్రమే కాకుండా డిజిటల్ నైపుణ్యం కలిగిన నిపుణులు సూక్ష్మ వ్యవస్థాపకులను తయారు చేయడం సంస్థ ప్రధాన ఉద్దేశం. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఇలాంటి మరిన్ని స్మార్ట్ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఈ కుప్పం ప్రాజెక్ట్ ఒక పునాదిగా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
