
కునో పార్క్ లో ‘గామిని’కి మూడు చిరుత పులుల జననం
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ లో ‘గామిని’ అనే చిరుత మూడు చిరుత పులులకు జన్మనిచ్చింది. దీంతో దేశంలో చిరుతల మొత్తం సంఖ్య 38కి చేరిందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ బుధవారం వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టిన మహత్తరమైన ‘ప్రాజెక్ట్ చిరుత’కు ఇది గర్జించే విజయంగా ఆయన అభివర్ణించారు. దేశంలో దశాబ్దాల క్రితమే అంతరించిన, ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగెత్తే ఈ జంతువును తిరిగి తీసుకొచ్చేందుకు 2022 సెప్టెంబర్‌లో ప్రారంభించిన పునరావాస కార్యక్రమంలో భాగంగా గామినిని దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తీసుకొచ్చారు.
సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో మంత్రి పేర్కొంటూ దక్షిణాఫ్రికా నుంచి చిరుతలు భారత్‌కు వచ్చి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా కునోలో మరో గర్వించే అధ్యాయం ప్రారంభమైంది. రెండోసారి తల్లైన గామిని మూడు పులులకు జన్మనివ్వడంతో కునో నేషనల్ పార్క్ సంబరాల్లో మునిగిపోయిందని తెలిపారు. ఈ తాజా జననంతో భారత్‌లో విజయవంతంగా జన్మించిన చిరుతల తొమ్మిదో లిటర్(ఒక చిరుత ఒకేసారి 3 పిల్లలకు జన్మనిస్తే — ఆ 3 పిల్లల సమూహాన్ని ఒక లిటర్ అంటారు). నమోదైంది. భారత్‌లో పుట్టి ప్రాణాలతో ఉన్న పిల్లల సంఖ్య 27కి చేరిందని ఆయన వెల్లడించారు. తాజా చేరికతో దేశంలోని మొత్తం చిరుతల సంఖ్య 38కు పెరిగిందని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి కొత్త జననం ప్రాజెక్ట్ చిరుతకు బలాన్ని చేకూరుస్తోందని, ఈ విజయానికి అటవీశాఖ సిబ్బంది, వెటర్నరీ వైద్య బృందాల నిరంతర కృషి కారణమని ఆయన కొనియాడారు. కునోకు, దేశానికి ఇది గర్వకారణం. గామిని, దాని మూడు చిన్న చిరుతలు ఆరోగ్యంగా పెరిగి దేశంలోని చిరుత పునరుద్ధరణ కార్యక్రమాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలి అని ఆయన ఆకాంక్షించారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా ఈ ఘటనపై హర్షం వ్యక్తం చేశారు. వన్యప్రాణి సంరక్షణ, జీవవైవిధ్యం, పర్యావరణ సమతౌల్యం దిశగా ఇది చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. కునో నేషనల్ పార్క్‌లో చిరుతల రాకకు మూడేళ్లు పూర్తైన వేళ ఇది తొమ్మిదో విజయవంతమైన జననం అని తెలిపారు. ఇటీవలే నమీబియా నుంచి భారత్‌కు తరలించిన ‘ఆశా’ అనే చిరుత కూడా కునోలో ఐదు పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
