Let's talk: editor@tmv.in
కునో పార్క్ లో ఐదు చిరుతలకు జన్మనిచ్చిన ‘ముఖీ’

కునో పార్క్ లో ఐదు చిరుతలకు జన్మనిచ్చిన ‘ముఖీ’

Pinjari Chand
21 నవంబర్, 2025

భారత్‌లో చిరుతల పునఃప్రవేశ ప్రాజెక్టులో మరో చారిత్రాత్మక మైలురాయి అందుకుంది. మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్​ లో భారత్‌లో పుట్టిన తొలి ఆడ చిరుతపులి ‘ముఖీ’ (వయసు 33 నెలలు) ఐదు చిరుతలకు జన్మనిచ్చింది. ఆధునిక భారత చరిత్రలో ఇంతవరకు భారత్‌లో పుట్టిన చిరుతపులి సంతానం ఇదే కావడం తొలిసారి. నమీబియా నుంచి 2022లో తరలించిన ‘సియాయా’కు 2023 మార్చిలో కునోలో ముఖీ పుట్టింది. ఇప్పుడు ముఖీ కూడా తల్లయ్యింది. తల్లి చిరుత, పుట్టిన చిరుతలుఉ క్షేమంగానే ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం కునోలో మొత్తం చిరుతల సంఖ్య 30 దాటింది. ఈ ఘట్టాన్ని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఇద్దరూ ‘చారిత్రాత్మక విజయం’గా అభివర్ణించారు.

‘భారత్‌లో మొదటగా పుట్టిన చిరుతపులి సంతానోత్పత్తి. ఇది జాతి చిరుతలు భారత వాతావరణ పరిస్థితులకు పూర్తిగా అలవాటు పడుతున్నాయనడానికి బలమైన సంకేతం. ఇక్కడ స్థిరమైన, జన్యుపరంగా వైవిధ్యమైన చిరుతల జనాభాను ఏర్పాటు చేయడం దిశగా ఈ అడుగు ఆశలు రేకెత్తిస్తోంది’ అని మంత్రి భూపేందర్ యాదవ్ ఎక్స్‌లో పేర్కొన్నారు. 1952లో భారత్‌లో చిరుతలు అంతరించినట్టు ప్రకటించారు. 70 ఏళ్ల తర్వాత... మళ్లీ రెండో తరం చిరుతలు భారత భూమిపై పుట్టి, పెరిగి, సంతానాన్ని కూడా ఇస్తున్నాయి. ఇది ‘ప్రాజెక్ట్ చిరుత’కు బంగారు అధ్యాయంగా నిలవనుంది.

ఫలితాలిస్తున్న చీతా ప్రాజెక్టు* *(నవంబరు 20, 2025 నాటికి)

దీన్ని భారత ప్రధాని నరేంద్రమోడీ 17, సెప్టెంబరు 2022 (ప్రధాని మోదీ 72వ జన్మదినం సందర్భంగా ప్రారంభించారు. 70 ఏళ్ల క్రితం అంతరించిన ఆసియా చిరుతపులిని మళ్లీ భారత్‌లోకి తీసుకురావాలని, ఆఫ్రికా చిరుతలను తీసుకొచ్చి జన్యుపరంగా దగ్గరగా ఉన్న జాతిని దేశంలో పెంచడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. 2022లో నమీబియా

నుంచి 5 ఆడ, 3 మగ, 2023లో దక్షిణాఫ్రికా నుంచి 7 ఆడ, 5 మగ చిరుతలను తీసుకొచ్చారు.

ప్రస్తుతం వీటి సంఖ్య పెద్ద చిరుతలు 24–25 ఉన్నాయి. పిల్లలు (2023–2025 మధ్య పుట్టినవి) 19 ఉన్నాయి. తాజాగా ముఖీ 5 చిరుతలకు జన్మనిచ్చింది. 2023 మార్చి లో భారత్‌లో తొలి చిరుత పిల్లలు పుట్టాయి (నమీబియా నుంచి వచ్చిన సియాయాకు 4 పిల్లలు. అందులో ముఖీ కూడా ఒకటి) 2023–2025 మధ్య 8 పెద్ద చిరుతలు, కొన్ని పిల్లలు మరణించాయి.(సీసీవీ వ్యాధి, గాయాలు, ఒత్తిడి వల్ల) ప్రస్తుతం మరణాల రేటు తగ్గి, పిల్లల జీవన వృద్ధి రేటు పెరుగుతోంది. 2030 నాటికి రాజస్థాన్‌లోని ముకుందరా, గాంధీసాగర్ అభయారణ్యాలకు కూడా చిరుతలు తరలించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది.