
కుట్ర వెనుక ఉన్న వారిని వదలిపెట్టం:ప్రధాని మోడీ
ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు బాధితులను ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ప్రత్యక్షంగా పరామర్శించారు. భూటాన్ పర్యటన ముగించుకుని నేరుగా ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారిని చూసి వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులనుంచి తెలుసుకున్నారు.
‘ఢిల్లీలో జరిగిన పేలుడులో గాయపడిన వారిని కలిశాను. అందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఈ కుట్ర వెనుక ఉన్న వారిని తప్పకుండా శిక్షిస్తాం’ అని ప్రధాని ‘ఎక్స్’ వేదికగా బాధితులకు భరోసా ఇచ్చారు. సీనియర్ అధికారులూ, వైద్యులూ బాధితుల పరిస్థితిని ప్రధానికి వివరించారు. సోమవారం సాయంత్రం రెడ్‌ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో పార్క్‌చేసిన కారు పేలడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రాథమిక పోస్టుమార్టం నివేదికల్లో బాధితుల శరీరాలపై తీవ్రమైన గాయాలు, ఎముకలు విరిగిన సూచనలు ఉన్నట్లు తేలింది. చాలా మంది తల, ఛాతీ, పై భాగాలపై తీవ్రమైన గాయాలతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. శరీరాలపై లేదా దుస్తులపై స్ప్లింటర్ ఆనవాళ్లు కనిపించకపోవడంతో, పేలుడు పదార్థం రకాన్ని గుర్తించేందుకు ఫోరెన్సిక్ విశ్లేషణ జరుగుతోంది. అనుమానితుడు డాక్టర్ ఉమర్ నబీ తల్లి డీఎన్‌ఏ నమూనాలు ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు సేకరించారు. ఈ కారు నడుపుతున్న నబీ పేలుడు సమయంలో అక్కడే ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఈ ఘటనను ఉగ్రదాడిగా పరిగణిస్తూ, హెం మంత్రిత్వ శాఖ కేసును అధికారికంగా ఎన్‌ఐఏకి అప్పగించింది.దీనిపై ఎన్‌ఐఏ ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి, ఉన్నతాధికారుల పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ ఘటనపై చర్చించేందుకు ప్రధాని మోదీ కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశాన్ని కూడా నిర్వహించనున్నారు.
