Let's talk: editor@tmv.in
కుక్క కాటుకు భారీ పరిహారం చెల్లించాల్సిందే: సుప్రీంకోర్టు

కుక్క కాటుకు భారీ పరిహారం చెల్లించాల్సిందే: సుప్రీంకోర్టు

Pinjari Chand
14 జనవరి, 2026

కుక్క కాటు ఘటనలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయ్యింది. వాటిని తొలగించాలని గతంలోనే ఆదేశించినా ఆయా రాష్ట్రాలు విఫలమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలు తిరిగే ప్రాంతాల్లో ఉన్న కుక్కలను తొలగించాలని సూచించింది. లేకుంటే భారీ పరిహారం సమర్పించాల్సి ఉంటుందని హెచ్చరించింది. మంగళవారం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

నానాటికీ పెరుగుతున్న కుక్కల కాటు ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వాలు భారీ పరిహారం చెల్లించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. గత ఐదేళ్లుగా వీధి జంతువుల నియంత్రణ నిబంధనలను అమలు చేయడంలో రాష్ట్రాలు విఫలమయ్యాయని కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్వీ అంజారియా లతో కూడిన ధర్మాసనం, కుక్కలను ప్రేమిస్తున్నామంటూ వీధుల్లో ఆహారం పెట్టే వారికీ బాధ్యత తప్పదని స్పష్టంగా హెచ్చరించింది.

కుక్కలను వీధుల్లో ఎందుకు వదిలేస్తున్నారు?

ప్రతి కుక్క కాటు ఘటనకు, ముఖ్యంగా పిల్లలు లేదా వృద్ధులు గాయపడినా లేదా మరణించినా, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భారీ పరిహారం వసూలు చేస్తాం. ఎందుకంటే గత ఐదేళ్లుగా నిబంధనల అమలులో వారు ఏమీ చేయలేదు. అలాగే వీధి కుక్కలకు ఆహారం పెట్టేవారిపైనా బాధ్యత, జవాబుదారీతనం ఖరారు చేస్తాం. మీకు జంతువులంటే అంత ప్రేమ ఉంటే, వాటిని మీ ఇళ్లకు తీసుకెళ్లండి. ప్రజలను భయపెట్టేలా, కొరికేలా వీధుల్లో ఎందుకు వదిలేస్తున్నారు? అని జస్టిస్ విక్రమ్ నాథ్ వ్యాఖ్యానించారు. జస్టిస్ సందీప్ మెహతా కూడా ఇదే అభిప్రాయాన్ని సమర్థిస్తూ 9 ఏళ్ల చిన్నారిపై కుక్క దాడి చేస్తే బాధ్యత ఎవరిది? వాటికి ఆహారం పెట్టే సంస్థదా? ఈ సమస్యను మేం విస్మరించలేం అని ప్రశ్నించారు.

నవంబర్ 7, 2025న జారీ చేసిన ఉత్తర్వులను సవరించాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై కోర్టు విచారణ చేపట్టింది. ఆ ఉత్తర్వుల్లో విద్యాసంస్థలు, ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లు వంటి సంస్థాగత ప్రాంతాల నుంచి వీధి కుక్కలను తొలగించాలని ఆదేశించింది. విచారణ సందర్భంగా గుజరాత్‌కు చెందిన ఓ న్యాయవాది పార్కులో కుక్క కాటుకు గురయ్యారని, ఆ కుక్కను పట్టుకునేందుకు వచ్చిన మున్సిపల్ అధికారులపై తమను ‘డాగ్ లవర్స్’గా చెప్పుకునే కొందరు న్యాయవాదులు దాడి చేశారని కోర్టు గుర్తు చేసింది.

సమస్య వెయ్యి రెట్లు పెరిగింది

గత నాలుగు రోజులుగా ఈ అంశంపై వాదనలు సాగుతున్నాయని, కార్యకర్తలు, ఎన్‌జీవోలు అడ్డుపడటం వల్ల కేంద్రం, రాష్ట్రాల వాదనలు వినే అవకాశం కూడా రాలేదని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను బాధ్యతకు కట్టుబడి ఉండేలా చేసేందుకు మాకు అవకాశం ఇవ్వండి. వారు కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉన్నారా లేదా తెలుసుకోవాలి. సమస్య వెయ్యి రెట్లు పెరిగింది. చట్టంలోని నిబంధనలు అమలవ్వాలన్నదే మా లక్ష్యమని కోర్టు పేర్కొంది.

జనవరి 9న, కుక్కలకు ఆహారం పెట్టే మహిళలను వేధిస్తున్నారన్న ఆరోపణలపై కోర్టు జోక్యం చేసుకోలేదని, అది లా అండ్ ఆర్డర్ సమస్య కావడంతో బాధితులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సూచించింది. అలాగే మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యల అంశాన్నీ విచారణకు తీసుకోలేదు. వీధి కుక్కల కాట్లు ముఖ్యంగా పిల్లల్లో రేబీస్‌కు దారితీస్తున్నాయన్న మీడియా కథనాన్ని ఆధారంగా చేసుకుని, సుప్రీంకోర్టు గత ఏడాది జూలై 28న స్వయంచాలకంగా (సుమోటో) ఈ కేసును ప్రారంభించింది. ఇప్పటికే కోర్టు, స్టెరిలైజేషన్, టీకాలు పూర్తయ్యాక కూడా పట్టుకున్న వీధి కుక్కలను తిరిగి అదే ప్రాంతంలో వదలొద్దని ఆదేశించింది. అలాగే జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేల్లో అన్ని వీధుల్లో తిరిగే జంతువులను తొలగించాలని స్పష్టం చేసింది.

పెరుగుతున్న కుక్క-కాటు కేసులు

భారతదేశంలో వీధి కుక్క కాటు ఘటనలు గత కొన్ని సంవత్సరాల్లో గణనీయంగా పెరిగి ప్రజారోగ్య సమస్యగా మారుతున్నాయి. అధికార గణాంకాల ప్రకారం, ఈ ఘటనలు కోవిడ్-19 తర్వాత మళ్లీ పెరుగుతున్నాయి. 2018లో సుమారు 75.7 లక్షల కుక్క కాటు ఘటనలు నమోదు అయ్యాయి. 2019 – 2020లో కోవిడ్ వల్ల కేసులు తగ్గాయి. 2021–17.9 లక్షల కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. 2022లో కేసులు మళ్లీ పెరిగి సుమారు 21.8 లక్షలకు చేరాయి. 2023లో 26.5శాతం పెరిగి 27.5 లక్షల కాటు ఘటనలు నమోదయ్యాయి. 2024లో 37.17 లక్షల పైగా కేసులు నమోదు కాగా, ఈ సంవత్సరంలో కూడా కేసుల పెరుగుదల కొనసాగింది. 2025 (జూలై వరకు): దేశవ్యాప్తంగా ఇప్పటికే 26.7 లక్షలకు పైగా కుక్క కాటు కేసులు వచ్చినట్లు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి.

ప్రాంతాల వారీ పరిస్థితి

2025లో చండీగఢ్ లో మొత్తం 36,515 కేసులు నమోదు అయ్యాయని, రోజుకు 100కి పైగా కేసులు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. జనవరి-ఆగస్టు మధ్య కర్ణాటకలో 3.1 లక్షలకు పైగా ఘటనలు నమోదు అయ్యాయని సమాచారం.మదురైలో కేసులు 18,000కి మించి, ఇది గత ఎనిమిది సంవత్సరాల్లో ఇదే అత్యధికం.