Let's talk: editor@tmv.in
కీలక అధికారుల నియామకం పై ప్రధానితో రాహుల్ గాంధీ సమావేశం

కీలక అధికారుల నియామకం పై ప్రధానితో రాహుల్ గాంధీ సమావేశం

Pinjari Chand
11 డిసెంబర్, 2025

కేంద్ర ముఖ్య అధికారుల నియామకానికి సంబంధించి బుధవారం పార్లమెంట్ ఉన్నత సమావేశం జరిగింది. దీంట్లో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా కలిసి సెంట్రల్ ఇన్‌ఫర్మేషన్ కమిషన్ (సీఐసీ) సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) వంటి కీలక నియామకాలపై దాదాపు రెండు గంటల పాటు ముఖ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో చీఫ్ ఇన్‌ఫర్మేషన్ కమిషనర్, ఎనిమిది మంది ఇన్‌ఫర్మేషన్ కమిషనర్‌లను ఎంపిక చేయడం, అలాగే విజిలెన్స్ కమిషనర్ నియామకం వంటి అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ కొన్ని ఎంపికలపై అసమ్మతి నోటు కూడా ఇచ్చినట్టు వర్గాలు తెలిపాయి.

బెర్లిన్ పర్యటనకు రాహుల్ గాంధీ–బీజేపీ విమర్శ

ఇదే సమయంలో రాహుల్ గాంధీ బెర్లిన్ పర్యటన రాజకీయ వాదోపవాదాలకు దారి తీసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో దేశం విడిచి బయటికి వెళ్లడంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. బీజేపీ ప్రతినిధి షెహ్జాద్ పూనావాలా రాహుల్‌ను ‘విదేశ్ నాయక్’,‘లీడర్ ఆఫ్ పర్యటన్​’ అని వ్యాఖ్యానిస్తూ మరోసారి సోషల్ మీడియాలో విమర్శలు చేశారు.

డిసెంబర్ 15–20 మధ్య రాహుల్ గాంధీ జర్మనీకి వెళ్తున్నారు. డిసెంబర్ 17న బెర్లిన్‌లో భారీగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (ఐఓసీ) సమావేశంలో ఆయన ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. యూరప్‌ అంతటా ఉన్న ఐఓసీ అధ్యక్షులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది.

పార్టీ బలోపేతానికే

ఐఓసీ ఆస్ట్రియా అధ్యక్షుడు అవ్సాఫ్ ఖాన్ మాట్లాడుతూ, ఈ పర్యటనతో ఎన్ఆర్ఐ సమస్యలు,కాంగ్రెస్ పార్టీని బలపరచడం, పార్టీ సిద్ధాంతాన్ని విదేశాల్లో విస్తరించడం వంటి అంశాలపై ప్రత్యేక చర్చలు జరగనున్నాయని తెలిపారు.ఐఓసీ యూకే జనరల్ సెక్రటరీ విక్రం దూహన్ ప్రకారం రాహుల్ గాంధీ పర్యటన జర్మన్ పార్లమెంటేరియన్స్‌తో సంభాషణలకు, భారత గ్లోబల్ పాత్రపై చర్చలకు కొత్త వేదికను అందిస్తుంది.ఈ మొత్తం పరిణామాల మధ్య ఒకవైపు కీలక రాజ్యాంగ సంస్థల నియామకాలపై రాహుల్ గాంధీ ప్రభుత్వంతో చర్చలు చేస్తుండగా, మరోవైపు ఆయన విదేశీ పర్యటనపై రాజకీయ విమర్శలు మళ్లీ ఉద్ధృతమవుతున్నాయి.

కీలక అధికారుల నియామకం పై ప్రధానితో రాహుల్ గాంధీ సమావేశం - Tholi Paluku