Let's talk: editor@tmv.in
కీచకుల క్రూరత్వానికి బలైన మహిళ

కీచకుల క్రూరత్వానికి బలైన మహిళ

Panthagani Anusha
13 అక్టోబర్, 2025

కూలి పని ఆశ చూపి వలలో వేసుకున్న దుండగులు ఒక గిరిజన మహిళపై అమానుషంగా దాడి చేసి, అత్యాచారం చేసి, ఓ నిర్మానుష్య ప్రాంతంలో స్తంభానికి కట్టేసి పారిపోయిన ఘోరం మెదక్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. తీవ్ర గాయాలపాలైన బాధితురాలని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ప్రాణాలు విడిచింది.

స్థానికుల కథనం ప్రకారం జనకం పల్లి పంచాయతీకి సమీపంలోని ఒక తండాకు (గిరిజన గ్రామం) చెందిన ఓ మహిళా కూలి పనులు చేసుకుని జీవనం సాగించేది. ఈ క్రమంలో రోజులాగే శుక్రవారం కూడా పనికోసం జిల్లాకేంద్రమైన మెదక్ వచ్చింది . మార్గం మధ్యలో కొందరు అపరిచిత వ్యక్తులు పరిచమయ్యారు, కాగా మేము చాలా మందికి ఉపాధి కల్పించడంలో సహాయం చేస్తుంటామని ఆమెను మాటల్లో పెట్టి, తనకు కూడా కూలి పని ఇప్పిస్తామని నమ్మించారు. దుండగుల మాటలు నమ్మిన మహిళా వారి కూడా వెళ్ళింది. ఇదే అదునుగా భావించిన కామాంధులు బాధిత మహిళను ఏడుపాయల రోడ్డులోని కుల్చారం మండలం అప్పాజిపల్లి సమీపంలో ఉన్న ఒక నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు.

ఆ ఏకాంత ప్రదేశంలో దుండగులు ఆమెపై దారుణంగా దాడికి పాల్పడ్డారు. ఆమెపై అత్యాచారం చేయడంతో పాటు, తీవ్రంగా కొట్టి ఒక స్తంభానికి కట్టేసి పారిపోయారు. నిస్సహాయులైన బాధితురాలు విపరీతమైన గాయాలతో అక్కడే ఉండిపోయింది. ఇక మరుసటి రోజు శనివారం ఉదయం ఆ దారుణ స్థితిలో స్తంభానికి కట్టి ఉన్న మహిళను గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తీవ్ర గాయాలతో ఉన్న మహిళను హుటాహుటిన మెదక్ ఆసుపత్రికి తరలించగా ఆమె తలకు, అంతర్గతంగా అయిన గాయాలు తీవ్రంగా ఉండటంతో, మెదక్ వైద్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అయితే, దురదృష్టవశాత్తూ బాధితురాలి ఆరోగ్యం హైదరాబాద్‌కు తరలించే క్రమంలో విషమించడంతో, ఆమె మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారు.

ఇక బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య, అత్యాచారం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఈ అమానవీయ ఘటనకు పాల్పడిన దుండగుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.ఇకపోతే బాధిత మహిళలకు ఐదు మంది పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఈ దారుణం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామస్తులు భయంతో రాత్రిపూట బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. మహిళలు, ముఖ్యంగా గిరిజన వర్గాలు, భద్రత కోసం అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

కీచకుల క్రూరత్వానికి బలైన మహిళ - Tholi Paluku