
కిసాన్ క్రెడిట్ కార్డు పేరిట భారీ మోసం
రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్ క్రెడిట్ కార్డు (కేకే సీ) పథకం లక్షలాది మంది కర్షకులకు మేలు చేస్తోంది. అయితే ఈ పథకాన్ని కొందరు వ్యక్తులు తమ స్వలాభం కోసం దుర్వినియోగం చేస్తున్న ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్గీర్-చాంపా జిల్లాలో ఇలాంటి మోసం బయటపడింది. కిసాన్ క్రెడిట్ కార్డు (కేకే సీ) లోన్ మంజూరు చేస్తామని నమ్మించి ఓ కుటుంబాన్ని మోసం చేసిన కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలేశ్వర్ సాహు సహా మరో ఇద్దరిపై కేసు నమోదు చేసారు అధికారులు.
పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం 2015 నుండి 2020 మధ్య కాలంలో బంహనిఢీహ్ అనే సహకార సంఘంలో సాహు మేనేజర్‌గా, రాథోర్ సేల్స్‌మన్‌గా పనిచేశారు. క్రమంలో ఛాంపా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫరస్వానీ గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ శర్మ కుటుంబానికి కిసాన్ క్రెడిట్ కార్డు లోన్ మంజూరు చేస్తామని చెప్పి లోన్ ప్రాసెస్ కోసం శర్మ వద్ద నుండి ఖాళీ చెక్కు, భూమిపత్రాలను తీసుకున్న సాహు, వాటిని దుర్వినియోగం చేసి శర్మ కుటుంబానికి చెందిన 50 ఎకరాల భూమిని పూచీకత్తుగా చూపుతూ రూ. 24 లక్షలు తన ఖాతాకు తన భార్య ఖాతాకు మళ్లించినట్లు దర్యాప్తులో బయటపడిందని అధికారులు వెల్లడించారు.
అయితే బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా, విషయం పై స్పందన కోసం పలుమార్లు సంప్రదించినప్పటికీ ఎమ్మెల్యే సాహు అందుబాటులో లేరని అధికారులు తెలిపారు. ఇక ఈ కేసు వెలుగులోకి రావడంతో స్థానికంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సాహు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కావడంతో ఈ ఘటనపై ప్రతిపక్షం తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. రైతుల సమస్యలపై పెద్దఎత్తున హామీలు ఇచ్చే నాయకులే ఇలాంటి మోసాలకు పాల్పడటం దారుణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు కిసాన్ క్రెడిట్ కార్డు పథకంలో గతంలోను ఇలాంటి అక్రమాలు చోటుచేసుకున్నాయని అధికారులు గుర్తు చేస్తున్నారు.
